అసెంబ్లీలోకి అడుగుపెట్టి ‘సముద్రం’ సినిమాలో తనికెళ్ళ భరణిలాగా ‘అధ్యక్షా’ అనాలనే కోరిక చాలామంది రాజకీయ నాయకులకుంటుంది. దానిని నెరవేర్చుకోగలిగిన వాళ్ళు
కొందరే! అలాంటి కోరిక బలంగా వున్నోళ్ళలో మన మేయర్ అబ్దుల్ అజీజ్ ఒకడు.
ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన అజీజ్, ఆ తర్వాత కాలంలో వైసిపిలో చేరడం తెలిసిందే! వైసిపిలో వున్నప్పుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ముఖ్యఅనుచరుడిగా వుంటూ మైనార్టీల కోటాలో నెల్లూరు నగరం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అప్పటికే నగర వైసిపి ఇన్‌ఛార్జ్‌గా పి.అనిల్‌కుమార్‌యాదవ్ ప్రజల్లోకి వెళ్ళిపోయి వుండడం, ఆయనకే గెలుపు అవకాశాలున్నాయనే సమాచారంతో అజీజ్‌ను అసెంబ్లీ కంటే ముందే వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నెల్లూరులో వైసిపి పట్ల వున్న ప్రజాదరణతో మేయర్‌గా ఎన్నికైన అజీజ్, రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరడం తెలిసిందే!
మైనార్టీల కోటాలో నెల్లూరు నగరం టిక్కెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరం టీడీపీ టిక్కెట్ విషయంలో మంత్రి పి.నారాయణతో పాటు నగర ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మహిళా కోటాలో తాళ్ళపాక అనూరాధల పేర్లు కూడా ప్రచారంలో వున్నాయి. జిల్లా తెలుగుదేశంలో నెల్లూరు సిటీ సీటుకున్నంత పోటీ ఇంకే సీటుకు లేకపోవడం గమనార్హం. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువుగా వుండడంతో తనకు సీటు రాకపోతే ఏం చేయాలనేదానిపై మేయర్ అజీజ్ దూరదృష్టితో ఆలోచించినట్లు తెలుస్తోంది. టీడీపీ సీటు రాకుంటే జనసేన నుండైనా సీటు తెచ్చుకుని పోటీ చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈమేరకు ‘జనసేన’ వారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. జనసేన నుండి అయితే ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని, ఇక పవన్‌కళ్యాణ్ అభిమానులు, కాపుల ఓట్లు కలిస్తే తనకు గెలుపు అవకాశాలుంటాయని ఆయన నమ్మకం. దాంతో ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి.
