Home రాష్ట్రీయ వార్తలు జగన్ పై హత్యాయత్నం

జగన్ పై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌ ఒక్క క్షణం నివ్వెర పోయింది… లక్షలాది మంది అభిమానుల గుండెలు ఒక్కసారిగా అదిరిపడ్డాయి… తమ ప్రియతమ నేతకు ఏమీ కాలేదని, చిన్న గాయంతో బయటపడ్డాడని తెలిసాక కోట్లాది మంది మనసులు కుదుటపడ్డాయి.!

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వెయిటింగ్‌ లాంజ్‌లో హత్యాయత్నం జరిగింది. ఎయిర్‌పోర్టు ఆవరణలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో పనిచేసే జానిపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు జగన్‌పై కోడిపందేలకు వాడే కత్తితో దాడి చేసాడు. జగన్‌ మెడపై కత్తితో పొడవడానికి నిందితుడు ప్రయత్నిం చాడు. అప్పుడే అక్కడే వున్న శ్రీకాళహస్తి వైసిపి ఇన్‌ఛార్జ్‌ బియ్యపు మధుసూదనరెడ్డి అన్నా అంటూ… జగన్‌ను కేకేశాడు. జగన్‌ అప్రమత్తమై తల పక్కకు తిప్పడంతో కత్తి భుజానికి తగిలి గాయమైంది. భద్రతా సిబ్బంది వెనువెంటనే నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు.

అభిమానినని వచ్చి…

జగన్‌పై దాడి చేయడానికి నిందితుడు శ్రీనివాసరావు పక్కా ప్లాన్‌తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో దాడి చేయడం అన్నది ఎవరి ఊహకు అందని విషయం. కాని, శ్రీనివాసరావు అక్కడే వుండే హోటల్‌లో పని చేస్తుండడంతో అతనికి సులభమైంది. శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వుండడంతో జగన్‌ గురువారం మధ్యాహ్నం పాదయాత్రను ఆపి హైదరాబాద్‌ వెళ్లడం కోసం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. వెయిటింగ్‌ లాంజ్‌లో వున్న జగన్‌ వద్దకు వెయిటర్‌ శ్రీనివాసరావు వచ్చాడు. సార్‌, రాష్ట్రంలో మీ వేవ్‌ చాలా బాగుంది. ఈసారి 160 సీట్లు వస్తాయా అని అడిగాడు. తర్వాత జగన్‌తో సెల్ఫీ అడిగాడు. ఆయన సెల్ఫీకి ఓకే చెప్పగానే నిందితుడు శ్రీనివాసరావు తన ఫ్యాంటు జేబులో పెట్టుకున్న కత్తి తీసి జగన్‌ మెడపై పొడవబోయాడు. ఆయన తల పక్కకు తిప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జగన్‌కు ఎయిర్‌ పోర్టులోనే ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు పంపారు.

కత్తికి విషం పూసుంటే…

ఇక్కడ జగన్‌పై దాడికి వాడిన కత్తి కోడి పందేలకు వాడేదా, కోళ్ళను కోయ డానికి వాడేదా అనే విషయం ప్రధానం కాదు. ఆ కత్తికి విషం పూసుంటే పరిస్థితి ఏంటి? అధికారులు దాడి చేసిన కత్తితో విషప్రయోగం లాంటిదేమన్నా చేసాడా అని పరీక్షించకుండానే జగన్‌ను విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపించడం పూర్తిగా అధికార వైఫల్యమే!

భద్రతా వైఫల్యం…

ఎయిర్‌పోర్టులో భద్రతా చర్యలను సిఐఎస్‌ఎఫ్‌ చూసుకుంటుంది. ప్రతి ఒక్కరినీ నిశితంగా పరీక్షిస్తారు. అలాంటి తనిఖీలుండే ఎయిర్‌పోర్టులోకి కోడిపందే లకు వాడే కత్తిని ఎలా తీసుకెళ్ళగలిగారనే అనుమానాలొస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టు లోపల హోటల్‌లో పనిచేస్తున్నాడు కాబట్టి హోటల్‌కు తీసుకెళ్లే సామానుల ద్వారా ఈ కత్తిని కూడా తీసుకెళ్లి వుండొచ్చు.

హోటల్‌ టీడీపీ నేతదే…

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడి వరంకు చెందిన శ్రీనివాసరావు కొంత కాలంగా ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ హోటల్‌ విశాఖకు చెందిన టీడీపీ నాయకుడు హర్షవర్ధన్‌దేనని, ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో గాజువాక సీటు రేసులో వున్నాడని తెలుస్తోంది.

అప్పుడే మానసిక ముద్ర

జగన్‌పై అటాక్‌ జరిగిందో లేదో నిందితుడు శ్రీనివాసరావు నేపథ్యం, అతని అంతరంగం తెలుసుకోకుండానే తెలుగు దేశం అనుకూల మీడియా నిందితుడిపై మానసిక రుగ్మత ముద్ర వేసే ప్రయత్నం చేసింది. అతను నిజంగా మానసిక ఉన్మాదే అయితే.. గతంలో ఇలాంటి దాడులు ఎన్ని చేసి వున్నాడన్నది కూడా తెలుసుకోవాలిగా! అంత తెలివిగా జగన్‌తో మాటలు కలిపి, సీట్ల గురించి మాట్లాడి దాడి చేసాడంటేనే అతను ఎంత తెలివైనవాడో అర్ధమవుతుంది.

కారణాలు తెలుస్తాయా?

జగన్‌ ఆషామాషీ మనిషి కాదు… కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు. ఆయనకు పటిష్ట భద్రత వుంటుంది. అలాంటి నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడడం అంటే మాటలు కాదు. అందుకు తెగించా లన్నా ఏదో ఒక కారణం వుండాలి. ఎక్కడో ముమ్మిడివరంకు చెందిన జానిపల్లి శ్రీనివాసరావు అనే సాధారణ యువకుడు జగన్‌పై దాడి చేయాలనుకోవడం వెనుక కారణమేంటి? ఈయన ఆస్తులేమన్నా ఆయన లాక్కున్నాడా? వీళ్ళిద్దరికేమన్నా పాతకక్షలు వున్నాయా? జగన్‌పై దాడి చేయడం వల్ల ఇతనికొచ్చే లాభమేమన్నా వుందా? దాడి చేస్తే పట్టుకుంటారు, జైలుకు పోతాను అని తెలిసి కూడా అతను ధైర్యంగా దాడికి తెగబడ్డాడంటే ఆ ధైర్యా నికి కారణం ఎవరు? అసలు ఆ నిజాలు వెలుగు చూస్తాయా?

దుష్ట రాజకీయం…

జగన్‌పై దాడి జరిగిన తర్వాత విజ్ఞు లైన నాయకులు దానిని ఖండించారు. కాని చంద్రబాబుతో సహా కొందరు తెలుగుదేశం నాయకులు వక్ర రాజకీయాలకు తెర లేపారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు జగన్‌ అభిమానంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. నిందితుడి ఫోటోతో జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఫ్లెక్సీలు సృష్టించి సోషల్‌ మీడియాలో పెట్టారు.

డిజిపి ప్రకటన అసంబద్ధం..

జగన్‌పై దాడి జరిగింది. ఎందుకు జరిగింది, దాని వెనుక కారణాలేంటి అన్నది విచారణలో తేలాలి. దానికి కొంత టైం పడుతుంది. కాని అంతలోనే డిజిపి ఠాకూర్‌… ఇది పబ్లిసిటీ దాడి అని ప్రక టించి తన ప్రభుత్వ భక్తిని, ముఖ్యంగా బాబు పట్ల భక్తిని చాటుకున్నారు.

ఆందోళనలో అభిమానులు…

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిందనే వార్తతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వై.యస్‌. అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అన్ని రాజకీయ పక్షాలు జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించాయి. జగన్‌పై దాడి కేసు లోతుగా విచారణ జరిపితేగాని నిజాలు వెలుగులోకి రావు. ఆ నిజాలు వెలుగు చూస్తాయా? లేక చీకట్లోకి నెట్ట బడతాయో చూద్దాం!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here