Home గల్పిక జగన్‌కు వేంకటేశ్వరస్వామి లైవ్‌షో!

జగన్‌కు వేంకటేశ్వరస్వామి లైవ్‌షో!

అది హైటెక్‌రత్న చంద్రబాబు తన రక్తాన్ని చెమటగా మార్చి ఇటుక ఇటుక పేర్చి మధ్యలో సిమెంట్‌ కూర్చి కట్టించిన హైదరాబాద్‌ నగరం. లోటస్‌ పాండ్‌లోని వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నివాసం. పాదయాత్ర ముగించి దైవ దర్శనాలు చేసుకుని ఇంటికొచ్చిన జగన్‌తో తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిళ, బావ అనిల్‌లు ఎంతో సరదాగా వున్నారు. నాయనా, స్నానం చేసిరా భోజనం చేద్దువు అని విజయమ్మ చెప్పింది. అలాగేనమ్మా అంటూ జగన్‌ అక్కడనుండి వెళ్ళాడు. 15 నిముషాల తర్వాత జగన్‌తో కలిసి భోజనం చేద్దా మని అందరూ డైనింగ్‌టేబుల్‌ వద్దకొచ్చి కూర్చుని జగన్‌ కోసం వెయిట్‌ చేయ సాగారు. అరగంటయినా జగన్‌ రాలేదు. విజయమ్మకు ఏదో అనుమానమొచ్చి… అనిల్‌ అలా జగన్‌ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి ఏమి చేస్తున్నాడో చూసిరాపో అని అంది. అనిల్‌కుమార్‌ జగన్‌ బెడ్‌రూంలోకి వెళ్ళాడు. జగన్‌ లేడు… బాత్‌రూమ్‌ తలుపు తీసేవుంది. అదే విషయాన్ని అనిల్‌ డైనింగ్‌ టేబుల్‌ వద్దకొచ్చి చెప్పాడు. ఈ టైంలో జగన్‌ ఎక్కడికెళ్లాడబ్బా అని అందరూ గాబరాపడుతూ లేచి వెదు కుతూ కిందకొచ్చారు. క్రింద చూస్తే అక్కడొక టెంట్‌ వేసి ఉంది. దాని వద్ద పదిమంది సెక్యూరిటీ వాళ్ళున్నారు. విజయమ్మ వారితో… ఇక్కడ టెంట్‌ ఏంటి, మీరేం చేస్తున్నారు అని అడిగింది. దానికి సెక్యూరిటీ చీఫ్‌… జగన్‌ సార్‌ ఈ టెంట్‌ వేయించాడమ్మా, సార్‌ లోపల స్నానం చేస్తున్నాడు అని చెప్పాడు. అందరూ టెంట్‌లోకి వెళ్లారు. జగన్‌ అప్పుడే స్నానం చేసి బయటకొచ్చాడు. ఏంటి జగన్‌ ఇది అని విజయమ్మ అడి గింది. అందుకు జగన్‌… నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదమ్మా… నాకు ఈ టెంట్‌లోనే స్నానం చేయాలనిపిస్తుంది. ఇక్కడే భోజనం చేయాలనిపిస్తుంది, ఇక్కడే నిద్ర పోవాలనిపిస్తుంది అని అన్నాడు. అందుకు విజయమ్మ… ఒకరోజా, ఒక నెలా నాయనా, 14 నెలలు ఆ టెంట్‌లోనే గడిపితివి… అందుకే అలా అలవాటు పడిపోయి వుంటావు, ఇప్పటిదాకా పడ్డ కష్టం చాలు, ఇప్పుడన్నా కొంచెం ప్రశాం తంగా నిద్రపోదువురా అంటూ ఇంట్లోకి తీసుకెళ్లింది. అందరూ కులాసాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. తర్వాత ఎవరి బెడ్‌రూమ్‌లలోకి వాళ్ళు వెళ్ళారు.

అర్ధరాత్రి దాటాక 2గంటలైంది. వైయస్‌ భారతికి దాహం వేసి మెలకువ వచ్చింది. యధాపలంగా ఫ్రిజ్‌ వద్దకెళ్ళి బాటిల్‌ తీసుకుని నీళ్ళు తాగింది. మళ్ళీ బెడ్‌ మీద పడుకోబోతుండగా… ఒక్క క్షణం ఉలిక్కిపడింది. రాత్రి జగన్‌ వచ్చిన విషయం అప్పుడు గుర్తుకొచ్చింది. రాత్రి అక్కడే పడుకున్నాడు. ఇప్పుడు చూస్తే లేడు. ఇంత రాత్రి వేళ ఈ మనిషే మయ్యాడు అనుకుంటూ ఆందోళన చెందింది. వెంటనే విజయమ్మ, షర్మిలను లేపి… జగన్‌ కనపడడం లేదన్న విష యాన్ని చెప్పింది. వాళ్ళు ఒక్కసారిగా

ఉలిక్కిపడ్డారు. ఆత్రంగా ఇంట్లో అన్ని రూములు వెదికారు. ఎక్కడా కని పించలేదు. క్రిందకొచ్చారు. దూరంగా ”ఏడుకొండల స్వామి ఎక్కడున్నా వయ్యా… ఎన్ని మెట్లెక్కినా కానరావే మయ్యా… ఏడుకొండల స్వామి…’ అనే పాట వినిపించసాగింది. అందరూ ఆ పాట వినిపిస్తున్న చోటుకు పరుగెత్తారు. అక్కడ చూస్తే నుదుటున తిరునామంతో, పట్టు వస్త్రాలతో కాళ్ళకు చెప్పులు లేకుండా జగన్‌ పాట పాడుకుంటూ నడుస్తున్నాడు. విజయమ్మ జగన్‌ చేయి పట్టి ఆపి… ఎక్కడికి నాయనా… అని అడిగింది. ఆ ఏడుకొండల వాని సన్నిధి కమ్మా… ఆయన పిలుస్తున్నాడు అని జగన్‌ అన్నాడు. ఇలా పోవాలంటే మళ్ళీ పాదయాత్ర చేసినంత పనవుతుంది నాయనా, రేపొద్దు ఫ్లైట్‌కు పోదువులే, ఈ రాత్రికి నిద్రపోదువురా అని చెప్పి విజయమ్మ మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది. జగన్‌ బెడ్‌పై పడుకుని నిద్రలోకి జారుకున్నాడు.

—————

హరి ఓం… హరి ఓం… ఆ గదిలో హరినామస్మరణం గంటల మోతల మధ్య మార్మోగసాగింది. జగన్‌ కళ్ళు తెరిచాడు. చీకటిగా వుంది… ఎవరూ కనిపించ లేదు… ఎవరూ ఆ సౌండ్‌ చేసేది అని జగన్‌ అడిగాడు. లైట్లు ఆన్‌ చెయ్‌ నాయనా… కనిపిస్తాను అని ఓ స్వరం వినిపించింది. జగన్‌ స్విచ్‌ వేశాడు. లైట్లు వెలిగాయి. ఎదురుగా వేంకటేశ్వర స్వామి… జగన్‌లో ఆశ్చర్యం… ఏడు కొండల వాడా వెంకటేశ్వరా…. అనాధ రక్షకా గోవిందా… గోవిందా… అంటూ స్వామి పాదాలపై పడ్డాడు. స్వామి జగన్‌ను లేవదీశాడు. జగన్‌ స్వామితో… ఏమి నా భాగ్యము… ఎన్ని జన్మల పుణ్యఫలమూ… ఈ అల్ప మానవుడికి మీ ప్రత్యక్ష వీక్షణమా… ఇది కలకాదు కదా అని అన్నమయ్య లెవల్లో అడిగాడు. అందుకు శ్రీవారు… కలల్లాంటి రాజ ధానులు కట్టడానికి నేనేమన్నా చంద్ర బాబునా, ఇది నిజమే అని చెప్పాడు. మీరు లైవ్‌లో వచ్చారంటే ఏదో కారణమే వుంటుంది, అదేంటో సెలవివ్వండి స్వామి అని జగన్‌ వేడుకున్నాడు. శ్రీవారు వుండి… ప్రజలను పరిపాలించాలను కునే వారికి నేను కొన్ని ఫైర్‌ టెస్ట్‌లు పెడుతుంటాను… ఎందుకంటే నా దగ్గరకొచ్చే భక్తులకు వరాలిచ్చేది నేనే అయినా, వాటిని ఇంప్లిమెంట్‌ చేయా ల్సింది పాలకులు… నీకు ఆ లక్షణా లున్నాయో లేదో చూద్దామనే పరీక్షలు పెడుతున్నాను. తొలి పరీక్ష పాదయాత్రలో పాసయ్యావు. ఇక కొన్ని మోడల్‌ టెస్ట్‌లు పెట్టాలి. అలా బయటకు పోదాం పదా అని అమీర్‌పేట ఏరియాకు తీసుకెళ్లాడు. అక్కడ చెట్టు మీద ఒక పక్షిని చూపించి… దానిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని అడిగాడు. దానికి జగన్‌… గూడు లేక చలికి వణుకుతుంది… దానికొక గూడుంటే మంచిదనిపిస్తుంది అని జగన్‌ సమాధానమిచ్చాడు. దానికి స్వామి… ఇదే ప్రశ్న చంద్రబాబుకు వేసుంటే, ఆ పక్షికి బాగా కండ పట్టివుంది… భోగి పండుగకు పనికొచ్చేదనేవాడు… వెరీ గుడ్‌… అంటూ దూరంగా ఫుట్‌పాత్‌పై పడుకుని వణుకుతున్న వృద్ధుడిని చూపించి… అతనిని చూస్తే నీకేమని పిస్తుందని అడిగాడు. రాత్రి తిండి లేక పడుకున్న ఆ వృద్ధుడు కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక చలికి వణికిపోతు న్నాడనిపిస్తోంది అని జగన్‌ చెప్పాడు. దానికి శ్రీవారు… శెభాష్‌ బాగా చెప్పావ్‌, అదే చంద్రబాబు అయితే రాత్రి మందు కొట్టి మత్తులో తూలుతున్నాడనుకునే వాడు అని చెప్పి… జగన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వాంతులు చేసుకుంటున్న ఓ వ్యక్తిని చూపించి అతనిని చూస్తే నీకేమనిపి స్తుందని అడిగాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడనిపిస్తుంది అని జగన్‌ చెప్పాడు. వెల్‌సెడ్‌… అదే చంద్రబాబు అయితే తిన్నది ఎక్కువై కక్కుకుంటున్నా డని చెప్పేవాడు… సో నువ్వు బాగా ఇంప్రూవ్‌ అయ్యావ్‌, ప్రజల సమస్యలను బాగా అర్ధం చేసుకుంటున్నావ్‌… నువ్వు నా కొండకు ఒట్టి కాళ్ళతో నడిచొచ్చినప్పుడే నీకు వంద మార్కులేసేసాను అని చెప్పి అదృశ్యమయ్యాడు వెంకటేశ్వరుడు. జగన్‌ స్వామి… స్వామి… ఉండండి… ఉండండి.. అంటూ కేకలు వేయ సాగాడు. ఆ కేకలకు పక్కనే వున్న భారతి ఉలిక్కిపడి లేచింది. జగన్‌ ముఖాన

నీళ్ళు చల్లింది. జగన్‌ అప్పుడు ఈ లోకం లోకి వచ్చాడు. ఈలోపు విజయమ్మ, షర్మిల, అనిల్‌లు కూడా అక్కడకు వచ్చారు. వాళ్ళను చూసాక జగన్‌కు విషయం అర్ధమైంది. అప్పటిదాకా తనకొచ్చింది కల అని. ఏమైంది జగన్‌ అని విజయమ్మ అడిగింది. జగన్‌ శూన్యం లోకి చూస్తూ… ‘కలగంటి కలగంటి… ఇప్పుడిటు కలగంటి… ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి… కలగంటి కలగంటి… ఇప్పుడిటు కల గంటి’ అని పాటందుకున్నాడు. ఆ పాట వింటూ అనిల్‌ ఓమైగాడ్‌ అంటూ ఆకాశంలోకి చూడసాగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here