Home జిల్లా వార్తలు చీలిన దారులు.. మళ్ళీ కలిసాయి

చీలిన దారులు.. మళ్ళీ కలిసాయి

రాజకీయాలలో వీడు నాకు శత్రువు అని ఎవరినీ అనుకోనవసరం లేదు. అలాగే వీడు నా మిత్రుడు అని కూడా ఎవరినీ శాశ్వతంగా అనుకోనవసరం లేదు. ఈరోజు మిత్రుడు అనుకున్నవాడు రేపు మనకే ప్రత్యర్థి కావచ్చు. శత్రువు అనుకుని పోరాడినవాడు స్నేహితుడుగా మారొచ్చు. మన కళ్ళ ముందే ఎన్నో రాజకీయ స్నేహాలు శత్రుత్వాలు కావడం, స్నేహాలు శత్రుత్వాలుగా మారడం చూస్తుంటాం!

ఈ కోవలోకి చెందినదే ఆనం రామనారాయణరెడ్డి – కాకాణి గోవర్ధన్‌రెడ్డిల బంధం. వీళ్ళిద్దరి దగ్గర నుండి వీళ్ళ స్నేహం మొదలు కాలేదు. ఆనం వెంకటరెడ్డి, కాకాణి రమణారెడ్డిల హయాం నుండే ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ స్నేహముంది. వారి వారసత్వంగానే ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు ఒకే దారిలో నడిచారు. రాపూరు నుండి ఆనం రామనారాయణరెడ్డి 1985, 1989, 1994, 1999, 2004 మొత్తం ఐదుసార్లలో రెండుసార్లు తెలుగుదేశం తరపున, మూడుసార్లు కాంగ్రెస్‌ తరపున పోటీ చేసాడు. రెండుసార్లు ఓడిపోయి మూడుసార్లు గెలిచాడు. రాపూరు నుండి పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ ఆనం రామనారాయణరెడ్డికి కాకాణి సహకరించాడు. చాలా ఏళ్ళ పాటు రాజకీయాలలో ఆనం అనుచరుడిగానే ముద్రపడివున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 2006లో జడ్పీ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో మొదట కాంగ్రెస్‌ తరపున జడ్పీ ఛైర్మెన్‌ అభ్యర్థిగా ఆదాల రాఘవరెడ్డిని తీసుకొచ్చారు. అయితే జిల్లాకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయనకు బదులు కాకాణికి పిలుపొచ్చింది. ఆ ఎన్నికల ద్వారా కాకాణి తొలిసారి ప్రత్యక్ష రాజ కీయాలలోకి అడుగుపెట్టాడు. సైదాపురం జడ్పీటీసీ స్థానం నుండి ఆనాడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పన్నిన రాజకీయ వ్యూహంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడమేకాక, కాంగ్రెస్‌కు అత్యధిక జడ్పీటీసీలు రావడంతో జడ్పీ ఛైర్మెన్‌గా అత్యంత సులభంగా ఎన్నికయ్యాడు. ఇక జడ్పీ ఛైర్మెన్‌గా తన పనితీరుతో మంచిపేరు తెచ్చుకోవడం తెలిసిందే!

జడ్పీ ఛైర్మెన్‌గా వున్న కాలంలోనే 2009 అసెంబ్లీ ఎన్నికలవైపు కాకాణి దృష్టి సారించాడు. ఆనం సోదరుల అండతో ఆరోజు ఆత్మకూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కాకాణి ఆత్మకూరులో బాగానే పాకిపోయాడు. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఆనం, కాకాణిల బంధానికి బీటలు వారేలా చేసింది. పునర్విభజనలో రాపూరు అసెంబ్లీ ఎగిరిపోయింది. ఆనం రామనారాయణరెడ్డి సర్వేపల్లిపై మనసుపడ్డా, ఆనాడు వై.యస్‌. ఒప్పుకోలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదాలదే సర్వేపల్లి అని తేల్చేసాడు. ఇక ఆనం రామనారాయణరెడ్డి ముందున్న మార్గం ఆత్మకూరు ఒక్కటే! ఎందుకంటే నెల్లూరురూరల్‌, సిటీ బి-ఫారాలు వాళ్ళ చేతుల్లో వున్నప్పటికీ ఒకటి బి.సి.లకివ్వాలి, ఇంకో దాంట్లో ఆనం వివేకా పోటీ చేయాలి. ఇక రామనారాయణరెడ్డికి మిగిలింది ఆత్మకూరే! దాంతో కాకాణికి సీటు లేకుండా పోయింది. తనకు ఆశ పెట్టి చివరికి సీటు లేకుండా చేసారనే కోపంతో కాకాణి ఆనంతో విభేదించాడు. అప్పటి నుండి ఎడమొగం, పెడమొగం అయ్యారు. అంతేకాదు, రాజకీయ దారులు కూడా వేరయ్యాయి. కాకాణి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌ను వీడి జగన్‌ నాయకత్వంలోని వైసిపిలో చేరితే, ఆనం రామ నారాయణరెడ్డి మాత్రం 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్‌లో కొనసాగి 2015 జనవరిలో తెలుగుదేశంలో చేరాడు. 2009 నుండి 2018 సగం దాకా దాదాపు 9ఏళ్ళు ఆనం, కాకాణిల మధ్య వైరం ఏర్పడింది.

తాజాగా పరిస్థితి మారింది. కాకాణి వుంటున్న పార్టీలోనే ఆనం వచ్చి చేరాడు. దీంతో విభేదాలు పక్కనపెట్టేసారు. మునుపటిలాగే ఒకరితో ఒకరు కలిసిపోయారు. ఒకప్పుడు ఆనం సోదరుల ఆధ్వర్యంలో కాకాణి కాంగ్రెస్‌లో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు వైకాపాలో కాకాణి సీనియర్‌ నాయకుడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరాడు. వీళ్లిద్దరి మధ్య మునుపటి స్నేహం మళ్ళీ ముదిరినట్లే కనిపిస్తోంది. రాజకీయంగా ఒకరి అవసరం ఒకరికుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనంకు బలం, బంధుత్వం వుంది. కాకాణికి అది అవసరం. అలాగే కాకాణి పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఆనం కొత్తగా పార్టీలో చేరాడు. కాబట్టి కాకాణితో స్నేహం ఆయనకు అవసరమే! మొత్తానికి 9ఏళ్ళ క్రితం వేర్వేరు దారులు పట్టిన ఇద్దరు కూడా మళ్ళీ ఒకే చోట కలిసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here