Home సింహపురి సమాచారం చిన్న మాట… పెద్ద మంట

చిన్న మాట… పెద్ద మంట

కులం కంటే గుణం గొప్పది. మతం కంటే మానవత్వం ఉన్నతమైనది. ఒక కులానికి చెందిన వ్యక్తి ఆర్ధిక దుస్థితిలో వుంటే ఆ కులానికి చెందిన వాళ్ళే వచ్చి సాయం చేయరు. గుణం గొప్పగా వున్న వ్యక్తి ఏ కులంవాడైనా ఆదుకుంటాడు. రోడ్డు మీద ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో వుంటే అతని సొంత మతానికి చెందిన వ్యక్తులే వచ్చి కాపాడరు. మానవత్వం వున్న ఏ మతం వ్యక్తులైనా సరే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడుతారు. ఈ సూక్ష్మం తెలియక జనం ఇంకా కులం, మతం మంటల్లో కాలిపోతున్నారు. ఓ చిన్నమాట పెదవి దాటితే అది పెనుమంటలనే సృష్టిస్తోంది. కులం, మతం గురించి ఎవరు నోరు జారినా అది క్షణాలలో కార్చిచ్చుని రగిలిస్తుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల నెల్లూరులో చోటుచేసుకుంది.

బి.వి.నగర్‌లో ఓ స్థలానికి సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకటస్వామినాయుడికి, మాజీకార్పొరేటర్‌ రావుల జ్యోతి కుటుంబానికి మధ్య గత కొన్నేళ్ళుగా వివాదం నడుస్తోంది. ఈమధ్య ఆ స్థలం వద్ద కొలతలు వేసే సమయంలో కిలారి వెంకటస్వామినాయుడు రావుల జ్యోతి కులాన్ని ఉద్దేశించి ఒక్క మాట నోరు జారాడు. గతంలో టీవీ ఛానల్స్‌ లేదా వీడియోషాపుల వాళ్ళ దగ్గర మాత్రమే కెమెరాలు వుండేవి. ఇప్పుడు సెల్‌ఫోన్‌లు వచ్చాక ప్రతి ఒక్కరి చేతిలోనూ కెమెరా వున్నట్ల య్యింది. కిలారి అన్న మాటలను వీడియో తీసి ఎవరో సోషల్‌ మీడియాలో పెట్టేసారు. ఇంకేముంది ఒక్కరోజులోనే అది రాష్ట్ర వ్యాప్తంగా రాజుకుంది. కిలారి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘం నాయకులు ఆగ్రహించారు. నెల్లూరులో యాదవ సంఘం నాయకులు ఒట్టూరు సంపత్‌రాజు ఆధ్వర్యంలో పెద్దఎత్తునే ఆందోళన నిర్వహించారు. యాదవ కులాన్ని అగౌరవపరిచేలా మాట్లాడిన కిలారి వెంకటస్వామినాయుడిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవి నుండి తీసేయాలని, తెలుగుదేశం నుండి బహిష్కరించాలని సంపత్‌రాజు డిమాండ్‌ చేశాడు. కిలారిని పార్టీ నుండి సస్పెండ్‌ చేయకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంపత్‌రాజు హెచ్చరించాడు.

నాకే పాపం తెలియదు…

ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, తనకు అన్ని కులాలవారు సమానమేనని తనకే పాపం తెలియదని అంటున్నాడు కిలారి వెంకటస్వామి నాయుడు. తనపై బురద చల్లడానికే ఎవరో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని, ఎవరి మనోభావాలనైనా గాయపరిచినట్లు తన మాటలు వుంటే క్షమించాలని కూడా ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here