Home రాష్ట్రీయ వార్తలు చరిత్ర క్షమించదు!

చరిత్ర క్షమించదు!

ఏ రాష్ట్రమైతే కాంగ్రెస్‌కు ఆయువుపట్టులా నిలిచిందో, ఏ రాష్ట్రమైతే కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీ స్థానాలిచ్చి కేంద్రంలో అధికారం నిలబెట్టిందో, ఏ రాష్ట్రమైతే కాంగ్రెస్‌ను భుజాలమీద మోసిందో… ఆ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బహుమానం విభజన. అది కూడా అలాంటి ఇలాంటి విభజన కాదు… దారుణమైన విభజన. తడిగుడ్డతో గొంతు కోసినంత దారుణమైన విభజన. కట్టుబట్టలతో ఇంట్లో నుండి గెంటేసిన విభజన. కోట్లాదిమంది ఆంధ్రా ప్రజల ఆర్తనాదాలను బయటకు వినిపించకుండా గొంతు నొక్కేసి పార్లమెంట్‌ తలుపులు మూసేసి, ఛానెల్స్‌ ప్రసారాలు కట్‌ చేసి నిరంకుశంగా చేసిన అనైతిక విభజన.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్ర చరిత్రతో రెండే బ్లాక్‌డేస్‌. ఒకటి ఎమర్జెన్సీ విధించిన రోజైతే, రెండోది యూపిఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని విభజించిన రోజు. ఈ రెండింటికి కారణం కాంగ్రెస్సే! మొదటి దాంతో దేశమంతా ఇబ్బంది పడింది. కాని రెండో కారణంతో ఏపి ప్రజలు దారుణంగా మోసగించ బడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న నేటితరం ప్రజలే కాదు, రేపటి తరం వారు కూడా 2014లో కాంగ్రెస్‌ చేసిన దారుణ విభజన సీన్‌లను చూస్తే వారి జన్మలో క్షమించరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చరిత్ర క్షమించలేనంత తప్పు చేసింది కాంగ్రెస్‌.

అలాంటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు ఏపికి అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు. అంత ఘోరమైన విభజన జరిగి శతాబ్దాలు దాటలేదు, దశాబ్దాలు కూడా కాలేదు… గట్టిగా నాలుగేళ్ళు దాటాయంతే! సిగ్గు, శరం వదిలేసిన వాళ్ళు తప్పితే ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కాంగ్రెస్‌ నాయకుల నియంతృత్వ ప్రవర్తనను, సోనియాగాంధీ అహంకార పూరిత ధోరణిని ఏపి ప్రజలు మరచిపోలేదు. అంత మతిమరుపు కూడా ఎవరికీ లేదు. ఇప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీయే అప్పుడు యూపిఏ ప్రభు త్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన వద్దంటే ఏ బిల్లు అయినా ఆగిపోవాల్సిందే! అంత శక్తి వుండి కూడా ఆరోజు ఆయన ఏపి ప్రజల పట్ల కనీస సానుభూతి చూపలేదు. కనీసం ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చడానికి కూడా వాళ్ళకు మనసు రాలేదు. ఏపి ప్రజలంతా ఏదో అంటరానివారైనట్లు, వీళ్ళంతా పాపాలు చేసినట్లు, కాంగ్రెస్‌ నేతలు, సోనియా ఒక్కటే పుణ్యాత్ములైనట్లు వ్యవహరించారు. ఏపిని ఒక పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల మాదిరిగా చూసి దూరంగా విసిరిపడేసారు.

తెలియకుండా చేసిన తప్పులను మన్నించవచ్చు. పొరపాట్లను క్షమించవచ్చు. అధికార అహంకార మదంతో కళ్ళు మూసుకుపోయి విభజనతో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను అంధకారం చేసిన కాంగ్రెస్‌ను మాత్రం తెలుగుజాతి క్షమించదు.

మొన్న కర్నూలు సభలో రాహుల్‌గాంధీ ఏపి గురించి దొంగ ఏడుపులు ఏడ్చాడు. విభజన హోదా హామీలు నెరవేర్చడం లేదంటూ బీజేపీని తిట్టిపోసాడు. ఏపికి కేంద్రం ద్రోహం చేసిందన్నాడు. నిజమే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రాకు మొండి చేయి చూపింది. ఆంధ్రాకు ఏం చేసినా రాజకీయంగా వాళ్ళకు ఉపయోగం లేదు. ఇక్కడ వాళ్ళకు అధికారం రాదు. గట్టిగా నాలుగు సీట్లు రావు. కాని కాంగ్రెస్‌ను ఈ రాష్ట్రం బ్రతికించింది. అలాంటి రాష్ట్రానికే కాంగ్రెస్‌ ద్రోహం చేసింది. విభజన చట్టంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకహోదాను పొందుపరచివుంటే ఈరోజు ఎందుకు అమలు చేయడం లేదని మోడీని నిలదీసి అడిగి వుండొచ్చు. ఇవ్వకుంటే కోర్టుకుపోయి సాధించుకుని వుండొచ్చు. దరిద్రపు గొట్టు కాంగ్రెస్‌ అలాంటి అవకాశమే లేకుండా చేసింది. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ ప్రజలకు ఎక్కడ కోపం వస్తుందోనన్నంత కిరాతకంగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరించారు. హైదరాబాద్‌ ఆదాయంలో వాటా కావాలన్న ఆంధ్రా నేతలను ఢిల్లీ పెద్దలు హేళన చేశారు.

అసలు కాంగ్రెస్‌ నాయకులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయడమే తప్పు. కాని, ఆంధ్రా ప్రజలలో బాధలు భరించే శక్తి, సహనం ఎక్కువ కాబట్టి రాహుల్‌గాంధీ లాంటి

వాళ్లు ఈ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని అల్జీమర్స్‌ వచ్చిన కొందరు రాష్ట్ర నాయకులు మరచిపోవచ్చేమో! రాజకీయ ప్రయోజనాల కోసం వారితో అంటకాగొచ్చేమో! పౌరుషం వున్న ఆంధ్రులెవరూ కాంగ్రెస్‌ను నమ్మరు. ఈ జన్మలో ఆ పార్టీని క్షమించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here