Home జాతీయ వార్తలు చరిత్రను తిరగరాస్తున్నారు?

చరిత్రను తిరగరాస్తున్నారు?

రాము, సోము ఇద్దరు స్నేహితులు అడవిగుండా వెళుతున్నారు. మధ్యలో పెద్దపులి గాండ్రిస్తూ ఎదురొచ్చింది. సోము భయస్తుడు. పులిని చూడగానే దగ్గరలో వున్న చెట్టు ఎక్కేసాడు. రాము మాత్రం పులిని ఎదుర్కొన్నాడు. పులి పంజాతో రామును కొట్టింది. రాము చేతికి తగిలిన కొయ్యముక్కతో పులిని ఇష్టమొచ్చినట్లు పొడిచాడు. ఈ పోరాటంలో చివరకు రాము, పులి ఇద్దరూ చనిపోయారు. అప్పుడు సోము చెట్టు దిగి వచ్చాడు. తన చొక్కాకు రక్తం పూసుకున్నాడు. చనిపోయిన పులిని ఈడ్చుకుంటూ తన గ్రామంలోకి వెళ్లాడు. అడవికి మేతకు వెళ్లిన మన పశువులను చంపి తింటున్న పులిని ప్రాణాలకు తెగించి పోరాడి చంపానని గ్రామస్థులతో చెబుతాడు. అది నమ్మిన ఊరి జనం సోముకు మంగళహారతులు పట్టి జేజేలు పలుకుతారు. ఆయనకు గ్రామసింహం, బెదరని బెబ్బులి వంటి బిరుదులు కూడా ఇస్తారు.

ఈ కథకు భారత స్వాతంత్య్ర పోరాట సంగ్రామానికి ఎక్కడైనా సంబంధముందా? ఉందనే అనుమానాలు ఎప్పటి నుండో వున్నాయి. కాని ఇంతకాలం ఆ సందేహాలను నివృత్తి చేసే వాళ్ళు లేరు. ఇప్పుడా బాధ్యతను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ వద్ద మూడువేల కోట్ల ఖర్చుతో 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కలిసి నెలకొల్పాయి. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు కూడా! ప్రపంచంలో ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై దేశ వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపించాయి. ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా 3వేల కోట్లు ఖర్చుపెట్టి విగ్రహం పెట్టాల్సిన అవసరం వుందా… అంటూ పెదవి విరిచాయి. 3వేల కోట్లతో పేదలకు ఇళ్ళు కట్టి వుండొచ్చు. పటేల్‌ పేరుతో విద్యాలయం స్థాపించి

ఉండొచ్చు. ఆసుపత్రి కట్టి వుండొచ్చు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పటేల్‌ విగ్రహాన్ని ఆమోదించే బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం… అమెరికాలో ‘లిబర్టీ ఆఫ్‌ స్టాచ్యూ’, బ్రెజిల్‌లో ‘లార్డ్‌ క్రైస్ట్‌’, చైనాలో ‘బుద్ధ’ విగ్రహాలను చూసి మాత్రం సూపర్‌ అంటారు, అదే మన దేశంలో వాటికన్నా ఎత్తైన విగ్రహం పెడితే దండగ ఖర్చు అంటారు. ఈ దేశంలో మావో, లెనిన్‌ విగ్రహాలెందుకు, పనికి మాలిన నేతలకు చాలామందికి విగ్రహాలుంటున్నాయి… అదంతా దండగ ఖర్చు కాదా… 500కుపైగా సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసి, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలుగా వున్న చిన్నచిన్న సంస్థానాలను కలిపి ఒక్క దేశంగా, ఒక్క జాతిగా మలచిన పటేల్‌ను ఈ మాత్రం గౌరవించుకోవడంలో తప్పులేదంటున్నారు.

అయితే అందరి దృష్టి, అందరి మాటలు పటేల్‌ విగ్రహం చుట్టూనే వుంటున్నాయి. దాని ఖర్చుపైనే వాదనలు వినిపిస్తున్నాయి. కాని పటేల్‌ భారీ విగ్రహం అన్నది మారబోతున్న భారత చరిత్రకు ఒక శాంపిల్‌ మాత్రమే. సరికొత్త చరిత్రకు మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌వాళ్ళు ముసుగేసి దాచిపెట్టిన వాస్తవ చరిత్రను ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియకు ఆరంభం జరిగినట్లుగా తెలుస్తోంది.

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక, ఆ పోరాట ఫలితం అంతా కూడా ఇద్దరు నాయకులకు, ఒక కుటుంబానికే అంకితమైపోయింది. బ్రిటీష్‌ వారితో హింసాత్మక పోరాటానికి దిగకుండా శాంతియుత మార్గంలో పోరాడిన మహాత్మాగాంధీ జాతిపితగా కీర్తి గడించారు. ఈ దేశం నుండి తెల్లదొరలను తరిమికొట్టింది ఆయనే అనేంతగా చరిత్రను రూపొందించారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం రెండు ముక్కలుగా విడిపోగా మహ్మదాలీ జిన్నాకు పాకిస్థాన్‌ను అప్పగించి, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు భారత్‌ను అప్పగించారు. ప్రజాస్వామ్య విధానంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అత్యధిక మెజార్టీతో ఎన్నికైనప్పటికీ గాంధీజీ మూలంగా ఆయన ఆ పదవి నుండి తప్పుకుని నెహ్రూకు ఇచ్చాడు. అలాగే భారత దేశానికి తొలి ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కావాల్సినప్పటికీ, మెజార్టీ సభ్యులు ఆయనకే మద్దతు తెలిపినప్పటికీ మళ్ళీ నెహ్రూ పట్ల వున్న ప్రేమతో గాంధీజీ పటేల్‌కు మోకాలడ్డాడు. నెహ్రూను ప్రధానిని చేసి పటేల్‌ను ఉపప్రధానిని చేసారు. స్వాతంత్య్రం వచ్చిందన్న మాటేగాని చీలికలు పేలికలుగా వున్న ఉపఖండాన్ని ఏకం చేసే బాధ్యతను పటేల్‌ తన భుజస్కంధాలపై మోసాడు. 500కు పైగా సంస్థానాలను నయానో, భయానో భారత్‌లో విలీనం చేశాడు. ఒక్క జమ్మూ, కాశ్మీర్‌ను విలీనం చేసే బాధ్యతను మాత్రం నెహ్రూ తీసుకు న్నాడు. అప్పుడు ఆయన ఏ దృష్టితో ఆ బాధ్యత తీసుకున్నా డనే దానిపై అనేక వాదనలున్నాయి. తీసుకున్న ఒక్క బాధ్యతను కంపుచేసి పెట్టాడు. జమ్మూ, కాశ్మీర్‌ను తన స్వప్రయోజనాల కోసం భారత్‌లో పూర్తిగా విలీనం చేయకపోవడం వల్ల, దాని పర్యవసానాలను మనం నేటికీ అనుభవిస్తున్నాం.

కాని, నెహ్రూ కుటుంబ పాలనా వైఫల్యాలేవీ ప్రజ లకు కనపడనీయ లేదు. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది గాంధీ, నెహ్రూలు మాత్రమేనన్న ప్రచార ముద్రను జాతి గుండెలపై బలంగా ముద్రించారు. ఈ దేశంలో గాంధీ జయంతికి, నెహ్రూ జయంతికి తప్పితే ఇంకే త్యాగధనుల జయంతులు, వర్ధంతులకు ప్రచారం వుండదు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతికి కూడా ఓట్ల బ్యాంకు దృష్టితో సెలవు ఇస్తున్నారు కాని, లేకపోతే ఆయన చరిత్రను కూడా కాలగర్భంలో కలిపేసి ఉండేవాళ్ళే! స్వాతంత్య్రం వచ్చాక మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్సే కాబట్టి గాంధీజీ, నెహ్రూలను మాత్రమే స్వాతంత్య్ర పోరాటయోధులుగా చూపించడంలో సఫలీకృతమయ్యారు. మధ్యలో వచ్చిన ఏ సంకీర్ణ ప్రభుత్వం కూడా గత చరిత్ర తేనెతుట్టిని కదిపే ప్రయత్నం చేయలేదు.

కాని, తొలిసారి నరేంద్ర మోడీ ఆ పని చేస్తున్నాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగధనుల చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలను కుంటున్నాడు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు పటేల్‌ విగ్రహంతో ఆయనను వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఎంతోమంది త్యాగధనుల చరిత్రను చరిత్రపుటల్లోకి తీసుకురానున్నారు.

నరేంద్ర మోడీ అనే వ్యక్తి 2019 ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా వుంటే… మన స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కొత్త పేజీలు చేరడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here