Home సంపాదకీయం చట్టమా? సంప్రదాయమా?

చట్టమా? సంప్రదాయమా?

సంస్కృతి, సంప్రదాయాలే పునాదులుగా ఏర్పడిన ఒక ప్రాచీన సమాజంలో ఆ పునాదులను మార్చే ప్రక్రియ జరిగినప్పుడల్లా కుదుపులు వస్తూనే వుంటాయి. స్పందనలు, ప్రతిస్పందనలు వినిపిస్తూనే వుంటాయి. విభిన్న భావాల సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే ఆ జరిగిన ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న ఫలితం మీదే ఆ నిర్ణయం విలువ తెలుస్తుంది.

ఇటీవల కాలంలో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ప్రధానమైన మూడు తీర్పులు ఒక వర్గంలో మానసిక సంఘర్షణకు బీజం వేశాయి. దేశంలో ఒక వర్గం ప్రజలనే లక్ష్యంగా చేసుకుని న్యాయస్థానం ముసుగులో చేస్తున్న దాడిగా దీనికి ప్రచారం జరుగుతోంది.

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే! ఆడ… మగ… ఇదే సృష్టి ధర్మం. ఆఖరకు పశు, పక్షాదులలో కూడా ఇదే ధర్మం కొనసాగుతుంది. ఈ ప్రపంచ మనుగడకు మూలం స్త్రీ, పురుషుల కలయికే! వేల ఏళ్ళ చరిత్ర గల భారతావనిలో స్వలింగ సంపర్కం అనే సంకరజాతి సంస్కృతి లేదు. అయితే పాశ్చాత్య దేశాల నుండి అన్ని విషజాడ్యాలు దిగుమతి అయినట్లే ఇది కూడా దిగుమతి అయ్యింది. దీనిని సమర్ధించేవాళ్ళు కూడా పోగయ్యారు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి చేసుకునే ఏ కార్యక్రమాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఎవరన్నా అభ్యంతరం చెప్పినా ఇలాంటి సృష్టి విరుద్ధ అప్రాశ్చ్యపనులు ఆగేవి కావు. అలాగని నేరంగా పరిగణించి కేసులు పెట్టి జైలులో తోసే పరిస్థితి కూడా లేదు. ఎంతమందినని అలా జైళ్లకు పంపించగలరు. అసలు ఎంతమందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోగలరు. అసలు ఈ విషయం కేసే కాదు, దీనిమీద కోర్టుకు పోవడం, కోర్టు తన విలువైన కాలాన్ని దీనికి కేటాయించి విచారించాల్సిన అవసరమూ లేదు. అసలు ఈ కేసుకు అంత సీన్‌ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఇది ఒక శారీరక, మానసిక రుగ్మతకు సంబంధించిన సమస్య. అసలు కోర్టుకే రాకుండా వుండుంటే, కోర్టు దీనికి ఆమోద ముద్ర వేయాల్సిన పని కూడా వుండేది కాదు.

ఇటీవల సంచలనం రేపిన మరో తీర్పు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టపడి జరిగే శృంగారాన్ని నేరంగా పరిగణించనవసరం లేదని పేర్కొనడం. ఒక భర్త భార్యకు తెలియకుండా ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం కాదు. అలాగే స్త్రీకి కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే చాలు. భార్య భర్తల బంధాన్ని మరచి ఎక్కడైనా తిరగొచ్చని సుప్రీం సెలవిచ్చింది. దాదాపు పాశ్చాత్య దేశాలలో జరుగుతున్నది కూడా ఇదే! ఈ తీర్పు ద్వారా మన దేశంలో ఇలాంటి కార్యక్రమాలు యధేచ్ఛగా జరుగుతాయి. మన దేశంలో ప్రజలు, కుటుంబాలను కలిపి వుంచే అత్యంత బలమైన బంధం వివాహ బంధం. మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాక తుదిశ్వాస విడిచే వరకు ఒకరినొకరు వదిలి వుండకపోవడమే మాంగల్య బంధంలో వున్న మహత్యం. ఈ బంధం ద్వారానే ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, అత్త, మామ, తల్లి, తండ్రి, మనుమరాలు, మనుమడు అనే రక్తసంబంధాల అనుభూతిని పొందగలుగుతున్నాడు. పాశ్చాత్య సంస్కృతిలో ఇన్ని అనుభూతులు వుండవు. రక్త సంబంధాలు ఈ స్థాయిలో అల్లుకుని వుండవు. ఎవరికి ఎవరు బిడ్డలో, ఎప్పుడు ఎవరు డైవోర్స్‌ తీసుకుంటారో తెలియని పరిస్థితి. పాశ్చాత్య దేశాలు సైతం భారతీయ వివాహ వ్యవస్థను అనుకరిస్తున్న తరుణంలో మనం అక్రమ సంబంధాలకు పచ్చజెండా ఊపడం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మన వివాహవ్యవస్థను దెబ్బతీయడమే అవుతుంది. అయితే ఇక్కడ తీర్పులో మేలు ఏంటంటే… ఇంతవరకు అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలను విలన్‌లుగా చూసేవాళ్ళు. మగవాళ్ళకు మాత్రం ఆయన శృంగారపురుషుడు అని వీరతాళ్ళు వేసేవాళ్ళు. ఈ తీర్పుతో ఇద్దరికీ సమానత్వం వచ్చేసింది. మన దేశంలో జరిగే నేరాలలో దాదాపు సగ భాగం లైంగిక చర్యలకు సంబంధించినవే! అక్రమ సంబంధాల వల్లే నిత్యం ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. మరి కోర్టే అక్రమ సంబంధాలకు పచ్చజెండా ఊపింది. మరి కనీసం ఇప్పుడన్నా లైంగిక నేరాలు

ఆగుతాయో లేదో చూడాలి!

ఇక హిందువులలో అలజడిరేపింది శబరిమలై అయ్యప్ప ఆలయానికి మహిళా భక్తులకు ప్రవేశం కల్పిస్తూ తీర్పునివ్వడం. ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు హిందూ మత ఆచార వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా మసీదులలోకి ముస్లిం మహిళలను పంపించగలరా! అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇతర మతాలకు హిందూ మతానికి మధ్య వున్న తేడాను గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద చర్చిలోకి వెళ్లినా అక్కడ చూడడానికి ప్రత్యేకత ఏమీ వుండదు. శిలువ మీద జీసెస్‌ తప్పితే. ప్రాచీన శిల్పకళాచాతుర్యం కూడా వుండదు. ఇక మసీదుల విషయానికొస్తే వారి సంస్కృతిలో విగ్రహారాధనే లేదు. నమాజు వారి దైవ సేవలో ప్రధాన భాగం. కాని హిందూ ఆలయాల పరిస్థితి అది కాదు. ఒక్కో ఆలయంలో ఒక్కో దేవుడు… ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ప్రాచీన శిల్పకళా సంపద… గర్భగుడి ముందు వివిధ పూజలు… అంటే గుళ్ళలో ప్రత్యేక ఆకర్షణ వుంటుంది. తిరుమల తిరుపతి దేవ స్థానంలో అలాంటి ఆకర్షణ వుంది కాబట్టే శ్రీవారిని చూడడానికి రోజూ అన్ని లక్షలమంది ఎగబడుతుం టారు. శబరిమలై ఆలయం కూడా అటువంటిదే. కాబట్టి లింగ వివక్షతో దేవుడి దర్శనానికి మహిళలను దూరం చేయకూడదు అన్నది సుప్రీం తీర్పులోని

ఉద్దేశ్యం. కాని ఏ మత సంస్కృతిలో వేలు పెట్టే

ధైర్యం లేని కోర్టులు కాని, ప్రభుత్వాలు కాని హిందూ సంస్కృతి, ఆచారాలలోనే తల దూరుస్తున్నాయి. ఈరోజు ఆచారాలను మారుస్తున్నారు. రేపు పూజలు వద్దంటారు, ఎల్లుండి అసలు గుళ్ళనే మూసేయ మంటారు. కోర్టులు చెప్పినట్లే నడుచుకుంటూపోతే హిందూ సంస్కృతే తెరమరుగవుతుంది అన్నది హిందూ మతపెద్దల ఆందోళన.

అయితే ఇక్కడ సుప్రీం తీర్పును పూర్తిగా హిందూ వ్యతిరేక కోణంలో చూడకూడదు. దేవుడి వద్ద లింగవివక్ష వద్దని మాత్రమే తీర్పులో ప్రధాన ఉద్దేశ్యంగా పరిగణించాలి. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కదా అని చెప్పి ఆచార వ్యవహారాలను కాదని మహిళా భక్తులు శబరిమలైకు వెళ్లే పరిస్థితి లేదు. 15 నుండి 50ఏళ్ళలోపు మహిళలను మాత్రమే ఇప్పటివరకు శబరిమలైకు అనుమతించలేదు. సుప్రీం తీర్పు ఇచ్చినంత మాత్రాన మహిళలు ఆచారాన్ని పక్కన పెడతారనుకోలేము. దేశవ్యాప్తంగా హిందూ మహిళలు ఆ విధమైన సంకేతాలిస్తున్నారు కూడా! ఆచారాల మీద గౌరవంలేని పిడివాదులు మొండిగా శబరిమలైకి పోతే వారిని ఆపలేరు. అంతమాత్రాన దేవుడు మైలపడిపోడు.

కాబట్టి సుప్రీం ఇచ్చిన ఈ తీర్పులతో హిందూ సమాజానికిగాని, దేశానికి గాని కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. సాంప్రదాయాన్ని రక్తంలో ఎక్కించుకున్న ఈ సమాజాన్ని ఈ తీర్పులు అంతత్వరగా మార్చ లేవు. వీటి గురించి అతిగా ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here