Home రాష్ట్రీయ వార్తలు గొంతు కోసే ప్రయత్నమే!

గొంతు కోసే ప్రయత్నమే!

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. రోజులు గడిచేకొద్ది జగన్‌ హత్యాయత్నం వెనుక లెక్కలేనన్ని అనుమానాలు కమ్ముకుంటున్నాయి. అందరి అనుమానపు చూపులు కూడా అధికారపార్టీ వైపే వుంటున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో వుండి చంద్రబాబు దీనిని డ్రామాగా కొట్టిపడేసినా, డిజిపిగా వున్న ఆర్‌.పి.ఠాకూర్‌ సంఘటన జరిగిన గంటలోనే ఎటువంటి విచారణ జరపకుండానే దీనిని పబ్లిసిటీ కోసం చేసాడని చెప్పి సంఘటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినా, నిందితుడు జగన్‌ అభిమాని అని, జగన్‌కు సానుభూతి రావడం కోసమే అలా దాడి చేయించుకున్నాడని అధికారపార్టీ మంత్రులు, అనుకూల మీడియా కోడై కూసినా… ఈ సంఘటన జరిగాక రేకెత్తుతున్న అనుమానాలు, వెలుగులోకి వస్తున్న నిజాలు ఈ క్రైమ్‌ సీన్‌ వెనుక ఏదో ఒక కుట్ర కోణం వుందన్న సంకేతాలను అందిస్తున్నాయి.

అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యా యత్నం జరిగింది. పందెంకోళ్ళకు కట్టే కత్తితో దాడి చేయబోయిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గాయమైన జగన్‌కు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి కుట్లు వేశారు. అనంతరం ఆయన తన ప్రయాణాన్ని ఆపుకోకుండా హైదరాబాద్‌కు వెళ్లి ఆసుపత్రిలో చేరారు. అక్కడ గాయానికి 8 కుట్లు వేశారు. జగన్‌పై దాడి సంఘటన తెలియగానే రాష్ట్రంలోనూ, దేశంలోనూ పలు పార్టీల నాయకులు పరామర్శించారు. తమ సంస్కారాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం చంద్రబాబుతో సహా అందరూ కనీస విలువలు మరిచి ఈ దాడి ఒక డ్రామా అంటూ సిగ్గు విడిచి ఎదురుదాడికి పాల్పడ్డారు. రాజకీయ వ్యవస్థపైనే అసహ్యం వేసేలా వ్యవహరించారు.

అనుభవం నేర్పింది ఇదేనా?

రాజకీయాలలో నాది నలభైఏళ్ళ ఇండస్ట్రీ అని, దేశంలో నేనే సీనియర్‌నని చంద్రబాబు చెప్పుకుంటుంటాడు. ఆయన సీనియార్టీ ఆయనకు ఏం నేర్పిందో జగన్‌పై దాడి అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటల్లోనే అర్ధమైంది. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి వ్యవహరించనంత దారుణంగా చంద్రబాబు వ్యవహరించాడు. జరిగిన సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేసి ప్రతిపక్షనేతను పరామర్శించడం కనీస సంప్రదాయం. ప్రభుత్వం ఆయనదే! పోలీసు వ్యవస్థ ఆయన చేతిలోనే వుంది. ఆ తర్వాత ఆయన తీరిగ్గా దర్యాప్తు చేయించు కుని అది డ్రామానా, లేక కుట్రపూరితంగా చేసారా అన్నది తేల్చివుండొచ్చు. ఫలితం ఏదొచ్చినా తనకిష్టమైన రీతిలో కథను మలచి వుండొచ్చు. కాని, ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన సమయంలో ఆయన తన అనుభవానికి విలువలేకుండా చేసుకున్నాడు.

నమ్మకం పోవడానికి డిజిపి ప్రకటనే కారణం

రాష్ట్ర పోలీసు విభాగానికి డిజిపి అధిపతి. చిన్నచిన్న నేరాలు జరిగినప్పుడే నిందితులను పట్టుకుంటే, నేరం ఎలా జరిగిందని మీడియా అడిగితే విచారణ జరిపాక వివరాలు వెల్లడిస్తామని ఒక ఎస్‌.ఐ స్థాయి అధికారే చెబుతాడు. అలాంటిది డిజిపి స్థాయిలో వున్న ఆర్‌.పి.ఠాకూర్‌ సంఘటన జరిగిన గంటలోనే దీనిని పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్‌గా చెప్పాడు. ఒక డిజిపియే అలా కేసు లోతుల్లోకి పోకముందే కేసును నీరుగారిస్తే ఇక ఏపి పోలీసులపై నమ్మకం ఎలా వస్తుంది. అందుకే వైసిపి నాయకులు ఈ సంఘటనపై థర్ట్‌ పార్టీ దర్యాప్తు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కోరారు.

పసలేని కథనాలు..

జగన్‌పై హత్యాయత్నం ఘటన నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి పసుపు నేతలే కాదు, పచ్చ ఛానెళ్లు సైతం తెగ ఆపసోపాలు పడ్డాయి. నిందితుడు జగన్‌ అభిమాని అంటూ కథలు అల్లాయి. జగన్‌కు సానుభూతి పెంచడం కోసమే దాడికి పాల్పడ్డాడంటూ విచిత్ర వార్తలు వినిపించాయి. ఇందుకు సాక్ష్యాలంటూ నకిలీ ఫ్లెక్సీలను సృష్టించాయి. అభిమాని ఎవరైనా తమ అభిమాన నాయకుడిని హత్య చేయాలనుకుంటాడా? ఇంత చిన్న లాజిక్కు కూడా తెలియనంత అజ్ఞానంతో తెలుగుదేశం నాయకులున్నారా? పోనీ నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌ అభిమానే అనుకుందాం… సంఘటన జరిగిన తర్వాత అతనిని అభిమానిగా చూడాల్నా? నిందితుడిగా చూసి విచారించాల్నా? ముందు బురద చల్లాలనే ప్రయత్నం మాని విచారణ జరిపితే కదా అతను జగన్‌ అభిమానా లేక చంద్రబాబు అభిమానా అనే విషయం తెలిసేది!

ఆదమరచివుంటే ప్రాణాపాయమే!

సంఘటన జరిగిన రోజున జగన్‌ అప్రమత్తంగా తల పక్కకు తిప్పబట్టి మెడపై పడాల్సిన కత్తి పోటు భుజంపై పడింది. నిందితుడి టార్గెట్‌ ప్రకారం కత్తి వేటు పడుంటే జగన్‌ ప్రాణానికే ప్రమాదం ఏర్పడి వుండేది. పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ హత్యా ప్రయత్నంగానే నమోదు చేశారు. దీంతోనే డిజిపి ప్రకటన తుస్‌మని తేలిపోయింది.

వెలుగుచూస్తున్న అనుమానాలెన్నో!

సంఘటన జరిగాక తెలుగుదేశం నాయకులు భుజాలు తడుము కుంటున్నారు. అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. సంస్కారహీనంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటనతో వాళ్ళకు ఏ సంబంధం లేనప్పుడు వాళ్లు ఇంత రాద్ధాంతం చేయడమెందుకు? దాడి పట్ల విచారణ జరిపి హూందాగా వ్యవహరించి వుండొచ్చు కదా!

వాళ్ళు అలా వ్యవహరించలేదు కాబట్టే అనుమానాలన్నీ కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. ఆ అనుమానాలు ఎలా బలపడు తున్నాయో పరిశీలిద్దాం… నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం. కొంతకాలం క్రిందటే జగన్‌ 63రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేశారు. ముమ్మిడివరంలోనూ ఆయన పాదయాత్ర సాగింది. జగన్‌ అభిమాని అయ్యుంటే నిందితుడు ఒక్కరోజైనా పాదయాత్రకు పొయ్యుండాలి. జగన్‌తో సెల్ఫీ ప్రయత్నం చేసుండాలి. పోనీ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నందువల్ల నిందితుడు అక్కడకు పోలేకపోయాడనుకుందాం. పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా చివరికొచ్చినప్పటి నుండి మొన్నటి దాకా కూడా జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారానే హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాడు. దాదాపు 20సార్లు వరకు ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులోకి వచ్చివుంటాడు. ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ లోనే శ్రీనివాస్‌ పని చేసేది. మరి జగన్‌ అభిమాని అయ్యుంటే శ్రీనివాస్‌ ఒక్కసారన్నా జగన్‌తో సెల్ఫీకి ప్రయత్నించి వుండాలి కదా! అదేమీ లేదే!

కుట్ర దాగుందా?

జనుపల్లి శ్రీనివాస్‌ అనే యువకుడికి జగన్‌ను హత్య చేసేంత అవసరం ఏమొచ్చింది. జగన్‌ మూలంగా అతని కుటుంబాని కేమన్నా అన్యాయం జరిగిందా? వాళ్లిద్దరి మధ్య పాత కక్ష్యలేమన్నా వున్నాయా? అలాంటివేమీ లేవు. ఎవరి ప్రోద్భలం, ఎవరి సహకారం, ఎవరి హామీలు లేకుండా శ్రీనివాస్‌ ఈ దాడికి పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే నేరచరిత్ర వున్న అతను ఎన్‌ఓసి తీసుకుని ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో ఉద్యోగంలో చేరా డన్నా, అత్యంత భద్రత వుండే ఎయిర్‌పోర్టులోకి కత్తిని తీసు కెళ్ళి దాచిపెట్టగలిగాడన్నా, వెనుక అధికార శక్తి వున్న అదృశ్య శక్తులు నడపనిదే అతను ముందుకు పోలేడు. కాబట్టి నిందితుడి వెనుకవున్న అదృశ్య శక్తులు విచారణలో బయటకు వస్తాయా? రావా? అన్నది చూడాలి.

కేంద్ర దర్యాప్తు సంస్థతోనే నిజాలు వెలుగులోకి..

ఈ సంఘటనలో నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థల వల్ల మాత్రమే అవుతుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పని చేయగలిగినా, ఖచ్చితంగా పోలీసుపై ప్రభుత్వం ప్రభావం వుంటుంది. వాళ్ళు కూడా సరైన కోణంలో దర్యాప్తు సాగించడం ఒత్తిడితో కూడుకున్న పనవుతుంది. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ద్వారా మాత్రమే ఈ కేసులో సస్పెన్స్‌ వీడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here