Home జిల్లా వార్తలు గెలుపు ‘వరప్రసాద’మేనా?

గెలుపు ‘వరప్రసాద’మేనా?

అతను ప్రజారాజ్యం పార్టీ తరపున ఎంపీ నవుతాననుకున్నాడు. కాని, అతని నుదుటి మీద వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి ఎంపీ అవుతా డని వ్రాసిపెట్టి ఉంది. అదే జరిగింది. తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాద్‌ 2009లో తిరుపతి లోక్‌సభ నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే! చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత జగన్‌ వైసిపిని స్థాపించడంతో ఆయన వైసిపిలో చేరడం, 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు వైసిపి అభ్యర్థిగా విజయం సాధించడం జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, సత్యవేడు… నాలుగు స్థానాలలో వైసిపి గెలవగా వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరుపతి సీటును బీజేపీకి ఇవ్వడం వరప్రసాద్‌కు కలిసొచ్చింది. బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం వీక్‌ కావడంతో లోక్‌సభలో క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగింది.

తిరుపతి లోక్‌సభకు ఈసారి తెలుగుదేశం అభ్యర్థే రంగంలో నిలుస్తాడు. వైసిపి అభ్యర్థికి ఇది కొంత ప్రతికూల అంశం. అయితే నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గతంకంటే వైసిపి బలపడడం గెలుపుపై నమ్మకాన్ని పెంచే విషయమే. నెల్లూరుజిల్లా పరిధిలోని ఒక్క సర్వేపల్లిలో మాత్రం టీడీపీ, వైసిపిల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా వుంది. వెంకటగిరి బరిలో ఆనం రామనారాయణరెడ్డి వైసిపి అభ్యర్థిగా దిగనుండడం వైసిపి ఎంపి అభ్యర్థిగా వరప్రసాద్‌కు బాగా కలిసొచ్చే అంశం. దీనికితోడు వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో బలమైన వర్గంగల నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి వైసిపిలో చేరడం కూడా వరప్రసాద్‌కు కలిసొచ్చిన వరమేననుకోవాలి.

సూళ్లూరుపేటలో వైసిపి గతం కంటే బలంగానే వుంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో సైతం వైసిపి పరిస్థితి గతంకంటే మెరుగ్గావుంది. ఇవన్నీ కూడా వరప్రసాద్‌కు సానుకూల అంశాలే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here