Home రాష్ట్రీయ వార్తలు గెలుపుతోనే మలుపు

గెలుపుతోనే మలుపు

ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. నేటి రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్‌ ఇది. ఒకప్పుడు వివిధ దేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే క్రికెట్‌ క్రీడ కూడా ఇప్పుడు వ్యాపారమైపోయింది. డబ్బులిస్తే ఆటగాళ్ళు ఏ జట్టులోనైనా ఆడుతున్నారు. రాజకీయాలలోనూ ఐపిఎల్‌ సంస్కృతి వచ్చేసింది. ఎలక్షన్‌ల నాటికి గెలుపుగుర్రాలను వెదుక్కోవడమే పార్టీల ప్రధాన పని అయ్యింది. ఈయన పార్టీకి పదేళ్ళు సేవచేసాడు, జెండాలు మోసాడు, బ్యానర్లు కట్టాడు, జిందాబాద్‌లు కొట్టాడని చెప్పి టిక్కెట్లు ఇవ్వడం లేదు. పది నిముషాల ముందు అవతల పార్టీలో వుండి ఇవతలకు వచ్చినా గెలుస్తాడనుకుంటే టిక్కెట్లిచ్చేస్తున్నారు. ఇప్పటి రాజకీయాలలో పోటీ చేసే అభ్యర్థికి కావాల్సింది పార్టీలో సీనియార్టీ కాదు… ఓటర్లను కొనే కెపాసిటి. ఓట్లు వేయించుకోగల కెపాసిటి. ఓట్లను తెచ్చుకోగల కెపాసిటి.

మాట తప్పం… మడమ తిప్పం అనే దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలసీని అమలు చేయడం ఆయన కాలంలోనే చెల్లింది. తన హయాంలో తనను నమ్ముకున్న నాయకులకు గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన సీట్లిచ్చాడు. అయితే ఆరోజు పరిస్థితులు వేరు. ప్రజలలో కొంతన్నా విలువలు ఉన్నాయి. పనిచేసే ప్రభుత్వం పట్ల ఆదరణ, అభిమానం

ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెం బ్లీలు ఉండేవి. కాబట్టి ఇరవై, పాతిక సీట్లు దాకా నమ్ముకున్నోళ్ళకు ఇచ్చినా పెద్దగా సమస్య వచ్చేది కాదు. కాని, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్నది 175 అసెంబ్లీ సీట్ల రాష్ట్రం. ప్రతి సీటులో గెలుపు ముఖ్యమే! గెలిచినా గెలవకపో యినా మనల్ని నమ్ముకున్నోడులే అని చెప్పి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు, లేదా గెలుపు కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తాడు అన్న అభ్యర్థినే రంగంలోకి దించాల్సిన పరిస్థితి.

వైకాపా అధినేతగా వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే ఆఖరి మ్యాచ్‌. ఆ ఎన్నికల్లో గెలిస్తేనే రాజకీయ భవిష్యత్‌. రేపు కూడా అధికారంలోకి రాకుంటే ఇక పార్టీని నిలుపుకోవడం కష్టం. కాబట్టి అధికారమే లక్ష్యంగా రేపటి ఎన్నికల్లో పోరాడక తప్పదు. ఇందుకు ముందుగా 2014 ఎన్నికల్లో చేసిన పొర పాట్లను ఒకసారి పరిశీలించుకోవాలి. అప్పుడు వైసిపిలోకి వస్తామన్న చాలా మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను వద్దన్నారు. ఇక్కడ సీట్లు ఖాళీ లేవన్నారు. సీనియర్లు అయితే తనను లెక్క చేయడని, ద్వితీయశ్రేణి నాయకులను పైకి తీసుకు రావాలని చెప్పి జగన్‌ ఎక్కువమంది సెకండ్‌ కేడర్‌ నాయకులకు సీట్లిచ్చాడు. 2014 ఎన్నికల్లో ఇక్కడే తేడా వచ్చింది. చంద్రబాబు సీనియర్‌లను, స్థానికంగా పట్టున్న నాయకులను, ఆర్ధికంగా బల వంతులను అభ్యర్థులుగా రంగంలోకి దించాడు. జగన్‌ మాత్రం ఎక్కువ శాతం మంది సెకండ్‌ కేడర్‌ లీడర్లను అభ్యర్థులుగా దించాడు. తెలుగుదేశంకు బలమైన అభ్యర్థులే బలమయ్యారు. తెలుగుదేశం సాంప్రదాయ ఓట్లకు అభ్యర్థులు సొంతంగా మరికొన్ని ఓట్లు జోడించారు. వైసిపి అభ్యర్థులకు మాత్రం కేవలం వై.యస్‌. ఓట్లే దిక్కయ్యాయి. ఇక్కడే సీట్ల తేడా వచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నుండి 103మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో దాదాపు 80మంది అభ్యర్థులు గట్టివాళ్ళు కావడం వల్ల గెలిచినవే! వైసిపి నుండి 67మంది గెలిస్తే కనీసం 50మంది వై.యస్‌. ఓట్ల వల్ల గెలిచిన వాళ్ళే! వీళ్ళ కంటే మరీ వీక్‌గావున్నోళ్ళు ఓడిపోయారు. అదే మరో 50సీట్లలో గట్టి అభ్యర్థులను గెలుపు గుర్రాలనుకున్నవాళ్ళను రంగంలోకి దించుంటే ఫలితాలు ఇంకో రకంగా

ఉండేవేమో? కనీసం వచ్చే ఎన్నికలలోనైనా గత తప్పిదాలను పునరావృతం చేయ కుండా చూసుకోవాలి. పార్టీకి సేవ చేసిన వాళ్ళను గుర్తించి గౌరవించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాని పార్టీ అధికారంలోకి రావడానికి వున్న మార్గం అసెంబ్లీ ఎన్ని కల్లో గెలవడమొక్కటే! రాష్ట్రంలో 25లోక్‌ సభ స్థానాలలో ఓడిపోయినా ఫర్వాలేదు.. 13జడ్పీలలో రాష్ట్రంలో వున్న అన్ని కార్పొ రేషన్‌లు, మున్సిపాల్టీలు, జడ్పీటీసీలలో ఓడిపోయినా వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని, అసెంబ్లీలో మెజార్టీ సీట్లు వస్తేనే అధికారం. అంటే ప్రతి సీటులోనూ గెలుపు గుర్రాన్నే దించాలి. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌ విశ్వసనీయత ఈసారి వైసిపికి కలిసొస్తాయి. అయితే పూర్తి స్థాయిలో ఇవి పార్టీని గట్టెక్కించలేవు. ఒక అసెంబ్లీలో లక్ష ఓట్లుంటే గెలవ డానికి 50వేల ఓట్లు కావాలి. పార్టీకి 40వేల ఓట్లు పడతా యనుకుందాం. ఏదో ఒక రూపంలో మిగతా 10వేల ఓట్లు అభ్యర్థులు తెచ్చుకో గలగాలి. అలాంటివారికే సీట్లివ్వాలి. అలాకాకుండా సీట్ల ఎంపికలో జగన్‌ 2014 పోకడలే ఈసారి కూడా అవలం భిస్తే అప్పటి ఎన్నికల ఫలితాలకు, రేపటి ఎన్నికల ఫలితాలకు పెద్ద తేడా వుండదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here