Home రాష్ట్రీయ వార్తలు గెలిస్తే బాబు ఘనత… ఓడితే కాంగ్రెస్ తలరాత

గెలిస్తే బాబు ఘనత… ఓడితే కాంగ్రెస్ తలరాత

డిసెంబర్‌ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకల్లా తెలంగాణలో నెగ్గేదెవరో? తగ్గే దెవరో? తేలిపోతుంది. టిఆర్‌ఎస్‌ మళ్ళీ గెలి చిందా… అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనతే. టిఆర్‌ఎస్‌ గెలుపులో క్రెడిట్‌ భాగస్వాములు ఆయన తప్ప ఎవ్వరూ ఉండరు.

మరి నాలుగు పార్టీల కలయికకు వేదిక అయిన మహాకూటమి గెలిస్తే… ఆ నిమిషాలలోనే మొదలవు తుంది పచ్చ ఛానల్స్‌లో ప్రచార ప్రభంజనం. ‘మహా కూటమి గెలుపు ఘనత చంద్రబాబుదే’, ‘చక్రం తిప్పిన చంద్రబాబు… చక్రాలు ఊడిపోయిన కేసీఆర్‌’, ‘నిన్న కర్నాటక… నేడు తెలంగాణ… రేపు ఢిల్లీ.. అప్రతి హతంగా కొనసాగుతున్న చంద్రబాబు జైత్రయాత్ర’… ఇలాంటి కథనాలు, ట్యాగ్‌లు, హెడ్‌లైన్‌లు…. అబ్బబ్బో ఒకటేమిటి… చంద్రబాబు తలచుకుంటే ఎవరి బ్రతుకైనా తలక్రిందులేనంటూ డప్పుకొట్టి దరువేస్తారు. చంద్రబాబును తెలంగాణలోనూ హీరోను చేస్తారు. కాంగ్రెస్‌ నాయకులంతా జీరోలై పోతారు. ఈ నాలుగున్నరేళ్ళపాటూ కేసీఆర్‌ ప్రభుత్వంపై వాళ్ళు చేసిన పోరాటాలన్నీ పక్కకు పోతాయి. ప్రభుత్వ ఏర్పాటులో, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో చంద్రబాబు కీరోల్‌ పోషిస్తాడు. ఎందుకంటే తెలంగాణలోనే మీ పార్టీని అధికారంలోకి తెచ్చినవాడిని, రేపు కేంద్రంలో నిన్ను ప్రధానిని చేయలేనా… అని రాహుల్‌కు ఆఫరిస్తాడు. ఇప్పటికే చంద్రబాబుకు లొంగిపోయిన రాహుల్‌, ఇంకొంచెం వంగుతాడు. మొత్తంగా తెలంగాణలో మళ్ళీ చంద్ర బాబు హవా మొదలవుతుంది.

అలా కాకుండా మహాకూటమి ఓడిపోయిందనుకుందాం… అది కాంగ్రెస్‌ పార్టీ తలరాత అనుకోవాలి. కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించడంగా పచ్చమీడియా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్‌ మీదున్న వ్యతిరేకతతోనే తెలుగుదేశానికి రెండు సీట్లు కూడా రాలేదనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం విడిగా అన్ని స్థానాలలో పోటీ చేసుంటే 30స్థానాల దాకా గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పేదని కూడా అంటారు. రేపు మహాకూటమి గెలిచినా, ఓడినా రెండు స్క్రిప్ట్‌లు కూడా చంద్రబాబు వద్ద సిద్ధంగా వున్నాయి.

ఎటుపోయి గెలిచినా, ఓడినా నష్టం జరిగేది కాంగ్రెస్‌ నాయకులకే! కూటమి గెలిచిందంటే చంద్రబాబు పవర్‌ రాజకీయాలు నడిపి తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చూస్తాడు. సిఎం రేసులో వున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్య వంటి వాళ్ళంతా నోర్లు తెరచి చూడాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here