Home జిల్లా వార్తలు గూడూరు వైసిపిలో పెరిగిన పోటీ

గూడూరు వైసిపిలో పెరిగిన పోటీ

2014 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నుండి వైసిపి అభ్యర్థిగా పాశం సునీల్‌కుమార్‌ గెలవడం తెలిసిందే! గెలిచాక టిడిపిలోకి జంప్‌ చేశాడు. ఒకవేళ వైసిపిలోనే వుండుంటే ఈ సీటు విషయంలో ఇంకో చర్చ వుండేది కాదు. ఆరునూరైనా ఆయనే అభ్యర్థి అయ్యుండేవాడు.

ఇప్పుడు గూడూరు వైసిపి సీటుకై ఎవరి ప్రయత్నాలలో వాళ్ళున్నారు. ఇన్‌ఛార్జ్‌గా వున్న మేరిగ మురళి తనదే టిక్కెట్‌ అనుకుంటున్నాడు. ఈమధ్య గూడూరుకు వచ్చిన పార్టీ జిల్లా పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో మేరిగ మురళిని గెలిపించాలని పిలుపునిచ్చి, ఆశావహులకు షాకి చ్చాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే జగన్‌ అభ్యర్థులను ప్రకటించాడు. అలాంట ప్పుడు సజ్జల ఏ ఉద్దేశ్యంతో మురళిని గెలిపించాలని కోరాడో వైసిపి కార్యకర్తలకే అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరులో మురళీ చాలడనే అభిప్రాయం పార్టీ నాయకులలోనే వ్యక్తమవుతోంది. ఇక తమ సీట్లు గెలవడమే కష్టమైన మేకపాటి వాళ్ళు కూడా మురళికి సీటు ఇవ్వాలంటూ పట్టుబడుతుండడం ఇక్కడ కొసమెరుపు.

మాజీ జడ్పీటీసీ వీరి చలపతి కూడా గూడూరు సీటు రేసులో వున్నాడు. ఈయన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్త. ఆర్ధికంగా మోటుకోగలడనే పేరు మాత్రం వుంది. స్థానికుడైన బత్తిని విజయకుమార్‌ కూడా యధావిధిగా రేసులో వున్నాడు.

వీళ్ళు కాకుండా 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ బి.జ్యోత్స్నలత పేరు కూడా వైసిపి తరఫున ప్రచారంలోకొస్తోంది. వైసిపి నాయకులే కొందరు ఆమె పేరును తెరమీదకు తెచ్చారు. ఈసారి ఎలాగూ టీడీపీ ఆమెకు సీటివ్వదు. ఆమెను వైసిపి నుండి నిలబెడితే జిల్లాలో ఒక మహిళకు సీటిచ్చినట్లుంటుంది. విద్యావంతురాలు, గూడూరు నియోజకవర్గంతో పరిచయం పెరిగింది. గత ఎన్నికల్లో ఓడి పోయిందనే సానుభూతి కూడా కొంత కలిసొస్తుంది. దీనికి తోడు ఆమె భర్త నాగరాజు ఆర్యవైశ్య వర్గానికి చెందినవాడు. గూడూరులో వారి బలమెక్కువ. కులపరంగా కూడా కలిసొ స్తుంది. వీటన్నింటి దృష్ట్యా ఆమెను పార్టీలోకి తీసుకుని సీటివ్వడం మేలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అయితే ఆమె పుట్టినిల్లు టిడిపి కాబట్టి రేపు ఎన్నికల్లో ఆమె గెలిస్తే గూడూరులో మళ్ళీ పాశం ఎపిసోడ్‌ పునరావృతం అవుతుందన్న ఆలోచన కూడా పార్టీలో వుంది.

ఇప్పటికైతే గూడూరు వైసిపిలో వీళ్ళ పేర్లే వినపడు తున్నాయి. ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇంకెన్ని పేర్లు ప్రచారంలోకి వస్తాయో చూడాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here