Home జిల్లా వార్తలు గూడూరు వైసిపిలో జోష్‌

గూడూరు వైసిపిలో జోష్‌

గూడూరు నియోజకవర్గం వైసిపిలో జోష్‌ మొదలైంది. పార్టీ నానాటికీ బలపడుతోంది. టిక్కెట్‌ ఎవరికిచ్చినా గెలుస్తారనే ప్రచారం వచ్చేసింది. పార్టీలోకి వలసలు కూడా అదే విధంగా సాగుతున్నాయి.

గూడూరు నియోజకవర్గంలో పెద్ద రాజకీయ కుటుంబాలున్నాయి. ఈ నియోజక వర్గంలో బలమైన వర్గాలున్న నల్లపరెడ్లు వైసిపిలోనే వున్నారు. నేదురుమల్లి కుటుంబం వైసిపిలోనే వుంది. ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి చేరడంతో చిల్లకూరు మండలంలో రాజకీయంగా బలమైన కుటుంబమైన వేమారెడ్డి, యరటపల్లి కుటుంబాలు వైసిపిలోకి చేరుతున్నాయి. ఇటీవల గూడూరు మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కోడూరు కల్పలత, మీరారెడ్డి దంపతులు వైసిపిలో చేరడం జరిగింది.

ఈ పరంపరలో భాగంగానే గూడూరు నియోజకవర్గ తెలుగుదేశంకు మరో షాక్‌ తగిలింది. గూడూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పొణకా దేవసేన, ఆమె భర్త, పారిశ్రామికవేత్త పొణకా శివకుమార్‌రెడ్డిలు కూడా వైకాపాలో చేరిపోయారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొరవతో పొణకా దంపతులతో పాటు మరో 9మంది కౌన్సిలర్లు కూడా 8వ తేదీ జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. దీంతో తెలుగుదేశం పార్టీకి గూడూరులో ఎదురుదెబ్బ తగలగా, వైసిపికి మాత్రం అదనపు బలం చేకూరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here