Home జిల్లా వార్తలు గూడూరు… ఎవరిదో జోరు

గూడూరు… ఎవరిదో జోరు

నేదురుమల్లి, నల్లపరెడ్డి వంటి రాజకీయ కుటుంబాలకు పుట్టినిల్లు గూడూరు నియోజకవర్గం. కోట, వాకాడుల యుద్ధం ఆరంభమైంది ఇక్కడే! అయితే గూడూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం కావడం వల్ల ఈ రెండు కుటుంబాలు కూడా తమ రాజకీయ పోరాటాలకు వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాలకు వలస వెళ్లాయి.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. ఆ పార్టీని పెట్టాక 1983, 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, 2014 ఎన్నికల్లో వైసిపి గెలిచాయి.

ఇప్పుడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో ఏ వైసిపి నుండి అయితే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడో, ఆ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి. గెలిచిన రెండో యేడాదే ఆయన టిడిపిలోకి వెళ్లాడు. ఇక ఐదేళ్ళు తిరుపతి పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేసిన వెలగపూడి వరప్రసాద్‌ ఇక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి. అభ్యర్థుల పరంగా చూస్తే పాశం సునీల్‌పై పార్టీ మార్చిన వ్యతిరేకత వుంది. వరప్రసాద్‌ గతంలో ఈ నియోజకవర్గానికి కూడా ఎంపీనే! ఎంపీగా ఆయన పెర్ఫార్మెన్స్‌ బాగానే వుంది. వ్యతిరేకత లేదు. నియోజకవర్గంపై అవగాహన ఉన్నోడు.

ఇక పార్టీల పరంగా చూస్తే వైసిపి ఒక్క ఏడాదిలోనే వూహించని వేగమందుకుంది. నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులందరూ వైసిపిలో చేరివున్నారు. నల్లపరెడ్లు, నేదురుమల్లి, పేర్నాటి, వేమారెడ్డి, పొణకా, ఎల్లసిరి, కోడూరు… ఇలా పెద్ద రాజకీయ కుటుంబాలన్నీ వైసిపిలో చేరడం ఆ పార్టీ బలాన్ని పెంచింది. ఇక నియోజకవర్గంలో అంతో ఇంతో బలమున్న మాజీఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ తెలుగుదేశాన్ని వదిలేసి వైసిపి నుండి తిరుపతి లోక్‌సభ అభ్యర్థి కావడం కూడా స్థానిక వైసిపి అభ్యర్థికి కలిసిరావచ్చు. 2014 ఎన్నికల్లో గూడూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ బి.జ్యోత్స్నలతను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. దీంతో ఆమె వైసిపిలో చేరింది. గూడూరు పట్టణంలో టిడిపికి మద్దతుదారులుగా వుండే ఆర్యవైశ్యులు ఈసారి వైసిపికి మద్దతు నిస్తున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్‌ కకావికలం కావడం, సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌ పట్ల వున్న వ్యతిరేకత స్థానిక వైసిపి అభ్యర్థికి వరంగా మారుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here