Home రాష్ట్రీయ వార్తలు ‘ఖాకీ’ వనంలో… పసుపు మొక్కలు

‘ఖాకీ’ వనంలో… పసుపు మొక్కలు

ప్రభుత్వ వ్యవస్థలను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాస్టర్‌ డిగ్రీలు చేసున్నాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వివిధ వ్యవస్థల సేవలను రాజకీయ ప్రయోజనాల కోసం భలే వాడుకుంటుంటాడు. ఇందులో పోలీసు శాఖ పాత్ర ఎక్కువుగా వుంటుంది.

2019 ఎన్నికల్లోనూ ఆయన పోలీసు సేవలతో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకోసమే డిజిపిని మొదలుకుని కీలకమైన విభాగాలలో తనకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను నియమించుకున్నాడు. వీళ్ళు గత కొంతకాలంగా చంద్రబాబుకు తమ సేవలు అందిస్తున్నారు.

సీనియార్టీ జాబితాలో వున్న గౌతమ్‌ సవాంగ్‌ను కాకుండా తనను డిజిపిని చేసినందుకు ఆర్పీ ఠాకూర్‌ పలు సందర్భాలలో చంద్రబాబు పట్ల తన భక్తిభావం చాటుకున్నాడు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటలోనే ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి… హత్యాయత్నం పబ్లిసిటి స్టంట్‌ అని చెప్పడంతోనే… ఎన్నికల్లో ఆయన సేవలు ఏ విధంగా వుండబోతున్నాయన్నది అర్ధమైపోయింది. ఇటీవల అమరావతిలో నిర్వహించిన ఐపిఎస్‌ అధికారుల సమావేశంలోనూ ఆయన వచ్చే ఎన్నికల్లో మనమంతా సీఎం కళ్ళల్లో ఆనందం కోసం పని చేయాలన్నట్లు చెప్పారని సమాచారం. ఇక ఇంటలిజెన్స్‌ డిజి ఏబి వెంకటేశ్వరరావు ఖాకీ చొక్కా బదులు పసుపు చొక్క వేసుకోనిదే తక్కువ. ఆయనపై మొదటి నుండి తెలుగుదేశం బ్రాండ్‌ వుంది. అలాగే కొన్ని జిల్లాల ఎస్పీలపై కూడా తెలుగుదేశం అనుకూలురనే ఆరోపణలున్నాయి.

డిజిపిగా ఠాకూర్‌, ఇంటలిజెన్స్‌ డిజిగా వెంకటేశ్వరరావు, మరికొందరు ఐపిఎస్‌ అధికారులు విధుల్లో వుంటే ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవని వైసిపి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఇంటలిజన్స్‌ డిజిని, శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించడం జరిగింది. వైసిపి వాళ్ళు డిజిపిని మారిస్తే గాని రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి లేదని పట్టుబడుతున్నారు.

ఇంకోపక్క ఎన్నికల సంఘం చర్యలు చంద్రబాబుకు మింగుడుపడడం లేదు. నా రాష్ట్రంలోకి సిబిఐకి ప్రవేశం లేదని జి.ఓ జారీ చేసినట్లే, నా నియంత సామ్రాజ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు కూడా చెల్లవని జి.ఓ ఇచ్చాడు. మొన్ననే జమ్మూకాశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్‌ అబ్దుల్లా వచ్చి ఒక రోజంతా పక్కనే వున్నాడుగా… ఆయన పోకడలు చంద్రబాబుకు అంటుకున్నట్లున్నాయి. ఫరూక్‌ కాశ్మీర్‌ స్వతంత్ర రాజ్యం అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వంతో మాకు పనిలేదన్నట్లుగా మాట్లాడుతుంటాడు. చంద్రబాబుకు ఆ అలవాట్లు వచ్చినట్లున్నాయి. వీరి బదిలీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం తరపున హైకోర్టులో పిటిషన్‌ వేయించాడు. ఇంటలిజెన్స్‌ డిజి ఎన్నికల పరిధిలోని వ్యక్తి కాదంటూ చంద్రబాబు వితండవాదం చేస్తున్నాడు. 2009 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు అప్పటి డిజిపి ఎస్‌.ఎస్‌.పి.యాదవ్‌ను మార్చేంతవరకు ఒప్పుకోలేదు. అప్పుడేమో ఎన్నికల కమిషన్‌ మంచిగా కనిపించింది, ఇప్పుడేమో హద్దులుదాటుతున్నట్లు కనిపిస్తోంది! ఏదైనా రెండు నాలుకలు, రెండు కళ్ళు, రెండు దారులు… చంద్రబాబు సిద్ధాంతాల్లాగా మారిపోయాయి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here