Home గ్రామ సమాచారం కోవూరు ‘దేశం’లో కొట్లాట

కోవూరు ‘దేశం’లో కొట్లాట

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోవూరులో వున్నంతగా ఇంకే నియోజకవర్గంలోనూ వర్గరాజకీయాలు లేవు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నలుగురు వర్గ నాయకులున్నప్పటికీ వీధిన పడడం లేదు. ఎవరి పనులు వాళ్ళు సైలెంట్‌గా చేసుకుంటున్నారు. కాని గత నాలుగేళ్ళుగా కోవూరు టీడీపీలో వర్గ రాజకీయాలు రచ్చకెక్కుతూనే వున్నాయి.

మొన్నటిదాకా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కడం చూసాం. పోలంరెడ్డి చర్యలను పెళ్ళకూరు వర్గీయులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ జెండాలు మోసిన తమను పక్కనపెడుతున్నారనే అసంతృప్తి కొందరు కోవూరు తెలుగుదేశం నాయకులలో వుంది. పోలంరెడ్డి, పెళ్ళకూరుల వివాదం నడుస్తుండగానే ఇప్పుడు కోవూరు పట్టణం కేంద్రంగా కొత్త వివాదానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వర్గానికి చెందిన 15మందిని ఎమ్మెల్యే పోలంరెడ్డి బూత్‌ కన్వీనర్లుగా తొలగించాడు. దీంతో వాళ్ళు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కోవూరులో పార్టీ కార్యక్రమాలు బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయంలో పోలంరెడ్డికి వ్యతిరేకంగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, యర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డిలంతా ఒక్కటయ్యారు. వీరికి పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వర్గం కూడా జత కలిసిందని చెప్పొచ్చు. వీళ్ళంతా ఒక్కటైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గరాజకీయం రసవత్తరంగానే ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here