Home సంపాదకీయం కోరలు చాచిన ఉగ్రోన్మాదం

కోరలు చాచిన ఉగ్రోన్మాదం

ఉగ్రవాద ఉన్మాద చర్యలతో రక్తపుటేర్లు పారిస్తున్న ఉగ్రవాద ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. భారతీయుల రక్తం మరుగుతోంది. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే ఉగ్రవాదుల పనిపట్టేందుకు భద్రతా బలగాలకు స్వేచ్ఛనిచ్చాం. కుట్రదారులకు శిక్ష తప్పదు.

– ప్రధాని నరేంద్రమోడీ

ఉగ్రవాద విషసర్పం మరోసారి కోరలు సాచింది. పడగవిప్పి బుసలుకొట్టింది. అందరూ ఆదమరచి ఉన్న సమయంలో దొంగచాటుగా వచ్చి కాటేసి తన నీచబుద్ధిని మరోసారి చాటుకుంది. అమాయకులను బలితీసుకుంటూ, భారత వీరజవాన్లపై దాడులు చేస్తూ ఉగ్రవాద రక్కసి ఉన్మాదిగా మారింది. ఆత్మాహుతి దాడులతో, భీభత్సాలతో, హింసాకాండలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ఉగ్రవాద రాకాసిని సమూలంగా నిర్మూలించాల్సిన తక్షణ కర్తవ్యాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేస్తున్న ట్లుగా.. అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. కశ్మీర్‌ లోని పుల్వామాలో జరిగిన ఘోరం చూస్తే.. పాక్‌ ప్రేరే పిత ఉగ్రవాదులు ఎంత ఉన్మాదంతో ఊగిపోతు న్నారో అర్ధమవుతుంది. పుల్వామాలో 40 మంది భారత వీర జవాన్లను బలితీసుకున్న ఉగ్రదాడి పట్ల భారతప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో భగ్గుమం టున్నారు. సెలవుల్లో ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలతో ఆనందంగా గడిపి తిరిగి విధుల్లో చేరేందుకు

వెళ్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన పాశవిక ఆత్మాహుతి దాడి భారతీయుల హృదయా లను కలచివేస్తోంది. 40మంది జవాన్లను పొట్టనపెట్టు కున్న ఉగ్రవాద నరహంతకుల పట్ల భారతీయుల రక్తం సలసలా మరుగుతోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్లకు యావత్‌ దేశం శోకతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించింది.

2547 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు.. 78 బస్సుల భారీ కాన్వాయ్‌తో జమ్ము నుంచి శ్రీనగర్‌కు విధినిర్వహణకు బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే వారు శ్రీనగర్‌కు చేరేవారు. అయితే, అంతలోనే భారీ విస్ఫోటనం.. 350 కిలోల పేలుడు పదార్ధాలు నింపిన కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి ఆ కాన్వాయ్‌లోని ఒక బస్సును ఢీకొట్టింది. అంతే, ఆ బస్సు పేలిపోయింది.. క్షణాల్లోనే ఇనుపముద్దగా మారిపోయింది. బస్సులో ఉన్న జవాన్లందరూ ప్రాణాలు కోల్పోయారు. భారత వీరజవానుల మృతదేహాలతో… నెత్తుటిచారలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఇంతటి ఘోర పాపానికి పూనుకున్నది మరెవరో కాదు.. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాది రాక్షసదాడి ఇది. అదిల్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాదోన్మాది ఈ దాడిచేశాడని, మసూద్‌ అజర్‌ అనే ఉగ్రవాద ముష్కరుని సారధ్యంలోని జైషే మహమ్మద్‌ సంస్థ ఈ రాక్షసకాండ తనదేనంటూ ప్రకటించుకుంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద విషపు భావజాలం తలకెక్కిన పుల్వామా జిల్లా నివాసే ఈ అమానుషానికి తెగబడడం ప్రజల్ని నివ్వెరపరుస్తోంది. గతంలో కూడా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా చేసిన దాడిలో కశ్మీర్‌లోని

ఉరీలో సైనిక శిబిరంలో ఉన్న 19 మంది భారతజవాన్లు మృతిచెందారు. ముంబై ముట్టడి నుంచి పఠాన్‌ కోట్‌, ఉరీ, పుల్వామా దాడుల వరకు ఇలా అన్ని ఘటనల్లోనూ ఉగ్రవాదులు చేస్తున్న అమానుష దాడుల వెనుక…ఆ ఘటనలకు కారణమైన పాత్రధారుల వెనుక అసలు సూత్రధారి సాక్షాత్తూ పాకిస్తానే అన్నది బహిరంగ రహస్యం.

ఒక్కమాటలో చెప్పాలంటే మనదేశంలోనే కాదు.. మొత్తంగా ఆసియాఖండంలోనే అమానుషమైన ఈ ఉగ్రవాదరక్కసి పుట్టుకకు..విజృంభణకు పాకిస్తానే పురిటిగడ్డ అన్నది కూడా ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక విధినిర్వహణ చేసే భరతమాత ముద్దుబిడ్డలైన..వీరజవాన్లపై ఉగ్రవాదులు ఇలా అత్యంత దారుణంగా..దొంగ దాడులుచేయడం పట్ల దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. అమెరికా, రష్యాతో సహా అనేక దేశాలు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిం చాయి. ఉగ్రసంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు ఈ సందర్భంగా అమెరికా గట్టి హెచ్చరిక చేసింది కూడా. ఇలాంటి దాడులు ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి పనిచేయాలన్న తమ నిశ్చయాన్ని మరింత దృఢపరుస్తాయని అమెరికా వ్యాఖ్యానించిం దంటే పాక్‌ ఉగ్రవాదచర్యల పట్ల అమెరికా ఎంత అసహనంతో ఉందో అర్ధమవుతుంది.

ఉగ్రవాదులకు ఎవరూ ఆశ్రయం ఇవ్వకూడదని, వారికి ఎలాంటి తోడ్పాటు అందించకూడదని, ఉగ్ర వాద సంస్థల ఆస్తులను స్తంభింపజేసి ఉగ్రవాదులను దోషులుగా న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎంతోకాలం నుంచి ప్రపంచానికి చెప్తూనే ఉంది. ఇప్పటికైనా ఆ దిశగా అన్ని దేశాలు కార్యాచరణతో ముందుకు రావాల్సి ఉంది.

ఉగ్రవాద నరరూప రాక్షసులను మట్టుబెట్టి ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా తుదముట్టిస్తే తప్ప ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచానికే శాంతి లేదు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాదాన్ని తుదకంటూ నిర్మూలించడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలి. ప్రపంచానికే పీడగా మారిన ఉగ్రవాద రక్కసి తన నెత్తుటికోరలతో వీరవిహారం చేస్తున్నా.. చర్చలతో.. కాలక్షేపపు మాటలతో కాలయాపన చేయడం… ఎంతకాలం ఇలా..! ఇకనైనా.. ఉగ్రవాదం పూర్తిగా అంతమొందేవరకు ఏ ఒక్కరూ.. ఏ ఒక్కదేశమూ విశ్రమించకూడదు. సకల మానవాళి సంక్షేమానికి… విశ్వశాంతి స్థాపనకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకేమాట-ఒకేబాటలో నడిచి ఉగ్రవాద రక్కసిని అంతమొందిం చాలి. ఆ దిశగా..ప్రపంచం మేల్కోవాల్సిన తరుణం ఇదే!.. అందరి తక్షణ కర్తవ్యం కూడా ఇదే!….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here