Home జాతీయ వార్తలు కేసీఆరే కింగ్‌

కేసీఆరే కింగ్‌

ఒకే ఒక్కడు… అనితర సాధ్యుడు… మాటల మాంత్రికుడు… పనిలో యాంత్రికుడు చేతల్లో కార్యసాధకుడు… అవతల యోధానుయోధులు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా తొణక లేదు… బెణక లేదు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఒంటిచేత్తో చక్రం తిప్పాడు… కొమ్ములు తిరిగిన మొనగాళ్ళను ఇంటికి పంపాడు. తెలంగాణ తెరపై హీరోగా నిలిచాడు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలు చూసాక కళ్ళు బైర్లు కమ్మిన వాళ్ళు కొందరు… స్పృహ కోల్పోయిన వాళ్ళు ఇంకొందరు… ఆసుపత్రులపాలైన వాళ్ళు మరికొందరు. అట్లాంటి ఇట్లాంటి గెలుపా అది… ప్రపంచ దేశాలకే పాఠాలు చెప్పిన రాజకీయ యోధుడి మైండ్‌ బ్లాకయ్యేలా చేసిన గెలుపది. ఎన్నికల యుద్ధంలో మేము వస్తాదులం అని రొమ్ములు విరుచుకున్న కాంగ్రెస్‌ పెద్దారెడ్లను ఇంటికి పంపిన విజయమది. కూటమి కట్టి కేసీఆర్‌ను ఓటమి బాట పట్టిస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన అవకాశవాద నేతల గూబ గుయ్‌మనిపించిన జైత్రయాత్ర అది. ఈ ఫలితాలు చూసాక కాంగ్రెస్‌, తెలుగుదేశం నాయకులు చాలామంది కోమాలోకి వెళ్లిపోయుంటారు.

తెలంగాణలో కారు దూకుడుకు సైకిల్‌కు పంక్చరయ్యింది. కారు చక్రాల క్రింద నలిగి హస్తంకు ఫ్యాక్చరయ్యింది. అగ్గిపెట్టి వెలగలేదు… కొడవలికి పదును లేదు… చంద్రబాబు వ్యూహాలు ఫలించలేదు. సోనియమ్మ, రాహుల్‌ల ప్రచారం పని చేయలేదు. పొత్తులో చిత్తుకాక తప్పలేదు. తెలంగాణలో 119 స్థానాలకు గాను టిఆర్‌ఎస్‌ 88 స్థానాలను గెలుచుకుని రాజకీయ పరిశీలకుల అంచనాలను సైతం తలక్రిందులు చేసింది. తెలంగాణలోని పది జిల్లాలకు గాను తొమ్మిది జిల్లాల్లో టిఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈసారి అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకుని, ప్రమాణస్వీకారానికి సైతం ముహూర్తం పెట్టుకున్న కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకుపోయింది. నాలుగు పార్టీలతో జత కట్టి ప్రజాఫ్రంట్‌గా ముందుకు సాగిన కాంగ్రెస్‌కు కేవలం 19సీట్లు దక్కగా, తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టి కేసీఆర్‌ను మట్టి కరిపించి హైదరాబాద్‌పై మళ్ళీ ఆధిపత్యం దక్కించుకోవాలనుకున్న చంద్ర బాబు పన్నాగం బెడిసికొట్టి, 13సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీకి కేవలం రెండంటే రెండు సీట్లే దక్కాయి. ఆ రెండు సీట్లు కూడా చంద్రబాబు సామాజికవర్గం బలంగా వున్న ఖమ్మం జిల్లాలోనివే కావడం విశేషం.

జగజ్జేత కేసీఆర్‌…

ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సాధించిన విజయం చూస్తుంటే 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తాడు. ఆ ఎన్నికల్లో వై.యస్‌. ఏకపక్షంగా ముందుగానే అభ్యర్థు లను ప్రకటించేశాడు. కేవలం వై.యస్‌. పాలనలో ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్‌ను విజయం వైపు నడిపించాయి. ఇప్పుడు కేసీఆర్‌ విజయం కూడా దాదాపు అటువంటిదే! గత నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే ఆయన గెలుపుకు బాటలు వేశాయి. 24గంటలు కరెంట్‌, ప్రతి ఇంటికి నీళ్ళు, మిషన్‌ భగీరథ, కళ్యాణ లక్ష్మి, రైతులకు ఎరువులు, చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, పక్కా ఇళ్ళు… ఇలా ఎన్నో పథకాలు కేసీఆర్‌ను గ్రామాలకు చేరువ చేశాయి. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కేసీఆర్‌ పట్ల వున్న అభిమానం, గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతా లలో కేటిఆర్‌ పట్ల వున్న ఆకర్షణ, హరీష్‌రావు రాజకీయ వ్యూహాలు టిఆర్‌ఎస్‌కు అనూహ్య విజయాన్ని చేకూర్చాయి.

తిరగబడ్డ ముందస్తు సెంటిమెంట్‌

కేసీఆర్‌ నిర్ణీత కాలానికి 8 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. మూడు నెలల ముందే 105 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ పార్టీ గెలవలేదన్న సెంటిమెంట్‌ను తిరగరాసాడు. చాలా మొండి ధైర్యంతో ఆయన అసెంబ్లీని రద్దు చేశాడు. ఆ ఆత్మవిశ్వాసమే ఆయన్ను హీరోగా నిలిపింది.

సెటిలర్ల నీరాజనం…

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో సీమాంధ్ర ప్రజలు ఎక్కువుగా వున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 10అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సెటిలర్ల ప్రభావం వుంది. ఈ ఎన్నికల్లో సెటిలర్స్‌ అంతా కూడా టిఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపారు. సెటిలర్స్‌ ఎక్కువుగా వున్న నియోజకవర్గాలన్నీ కూడా టిఆర్‌ఎస్‌ ఖాతా లోనే జమపడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలప్పుడే సెటిలర్లు టిఆర్‌ఎస్‌ వైపుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు అలాగే నిలబడ్డారు.

కాంగ్రెస్‌ కుదేల్‌…

వాస్తవం చెప్పుకోవాలంటే కేసీఆర్‌ ఉద్యమం వల్ల తెలంగాణ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ల సామాజికవర్గాన్ని దెబ్బతీయాలన్న సోనియాగాంధీ దుర్మార్గపు, దుష్ట ఆలోచన నుండే తెలంగాణ పుట్టింది. చెడపకురా చెడేవు… అన్న సామెత ఈ విషయంలో నిజమైంది. శుద్ధంగా వున్న, తమ పార్టీ బలంగా వున్న రాష్ట్రాన్ని సోనియాగాంధీ చీల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికలలోనే భూస్థాపితమైంది. తెలంగాణలోనూ రెండు వరుస పరాజయాలతో మట్టి కొట్టుకుపోయింది. 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం లోకి వస్తేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిలబడి వుంటుంది. బీజేపీయే వచ్చిందంటే కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా కూడా నిలవలేదు.

ఓటమి బాట పట్టిన ధీరులు…

11వ తేదీ వెలువరించిన ఫలితాలలో ప్రజాఫ్రంట్‌కు మెజార్టీ సీట్లు వచ్చుంటేనా… సీఎం పదవి కోసం కనీసం పాతికమంది నాయకులు ‘క్యూ’లో వుండేవాళ్ళు. కులాల వారీగా సీఎం కుర్చీ కోసం తన్నుకుంటుండేవాళ్ళు. తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఆ శ్రమ లేకుండా చేశారు. ఒక్క పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని తప్పించి సీఎం అభ్యర్థులంతా పరాజయం వైపు క్యూ కట్టారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి, డి.కె.అరుణ, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌ ఆలీ, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ లాంటి సీనియర్లు ఓడిపోయారు.

కూటమే కొంప ముంచిందా?

కూటమి కట్టడమే కాంగ్రెస్‌ కొంప ముంచిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలి, అధికారంలోకి రావాలన్న తపనతో కాంగ్రెస్‌ నాయకులు చంద్ర బాబును కలుపుకున్నారు. కూటమిలోకి అంతగా ప్రజాబలం లేని కోదండరాంను, సిపిఐని కలుపుకున్నారు. కలగూరగంపగా వచ్చిన వీళ్ళను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. కేసీఆర్‌ ఏకనాయకత్వమే వారికి బాగుందనిపించింది. అదీగాక తెలం గాణను నేనే అభివృద్ధి చేసాను, హైదరాబాద్‌ను నేనే కట్టాను అంటూ డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు ప్రసంగాలు కూడా తెలంగాణ ప్రజలలో వ్యతిరేకతను పెంచాయి. కాంగ్రెస్‌ పొత్తులో తెలుగుదేశంకు 13సీట్లు, టిజెఎస్‌కు 8, సిపిఐకి 3 సీట్లు ఇచ్చింది. అంటే 24సీట్లు… ఈ సీట్లలో ఆ పార్టీల బలం చాలా తక్కువ. టిఆర్‌ఎస్‌ విజయం ఈ మూడు పార్టీలకు ఇచ్చిన సీట్ల నుండే మొదలైంది. 24సీట్లు వాళ్లకిస్తే వాళ్ళు గెలిచింది 2సీట్లే! అప్ప నంగా టిఆర్‌ఎస్‌ ఖాతాలో 22సీట్లు వీళ్ళే చేర్చారు. కాంగ్రెస్‌ ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసుంటే, ఒకవేళ అధికారం రాకపోయి వుండొచ్చేమో గాని కనీసం ఇంకొన్ని సీట్లన్నా పెరిగి పరువు నిలబెట్టుకుని వుండేవాళ్ళు.

ఫలించిన వ్యూహం…

ప్రజాసంక్షేమ పథకాలే కాదు, పార్టీ అధినేతల వ్యూహాలు కూడా పార్టీల గెలుపోటములను నిర్ధేశిస్తుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ‘రెడ్డి’ సామాజికవర్గం ప్రధాన బలం. కేసీఆర్‌ వెలమ సామాజికవర్గం ప్రాబల్యం చాలాతక్కువ. కేసీఆర్‌ ఆ సామాజిక వర్గంపైనే గురిపెట్టాడు. ఏకంగా 39మంది ఆ వర్గానికి చెందిన వారికి సీట్లిచ్చాడు. వారి బలాన్ని ఓట్ల రూపంలో రాబట్టుకున్నాడు.

తెలంగాణలో వార్‌ వన్‌సైడ్‌ అని ప్రచారం చేశారు… కేసీఆర్‌ దానిని నిజం చేశాడు. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ప్రజలు పూర్తిగా నమ్మలేదు. హైదరాబాద్‌ సిటీలో అయితే ఆ పార్టీ ఖాతా తెరువలేదు. కాని ఈసారి హైదరాబాద్‌లోనూ హవా చూపింది. మొత్తానికి గతానికి భిన్నంగా పూర్తిస్థాయి విజయా న్నందుకుంది. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగిపోయింది.

మొత్తానికి తెలంగాణలో అవకాశవాద ప్రజాఫ్రంట్‌ కథ ఇంత ఛండాలంగా ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here