Home జాతీయ వార్తలు కేంద్రమంత్రుల దృష్టికి నెల్లూరు సమస్యలు

కేంద్రమంత్రుల దృష్టికి నెల్లూరు సమస్యలు

పదవి అలంకారప్రాయం కాదు… అనుభవించడానికి కాదు… అదొక బాధ్యత… సమాజానికి చేతనైనంత సాయం చేయడానికి వచ్చిన సదవకాశం. ప్రజాసేవ కోసం రాజ్యసభ రూపంలో తనకు దేవుడిచ్చిన అవకాశాన్ని నలుగురికి మంచి చేసేందుకు చక్కగా వినియోగించుకుంటున్నాడు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.

ఈ నెల 3వ తేదీన ఆయన ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా మరియు రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్మెన్‌ యువదీర్‌సింగ్‌ మాలిక్‌, అలాగే కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయెల్‌లను కలిసి నెల్లూరుజిల్లాకు సంబంధించిన పలు విషయాలను, సమస్యలను వారితో చర్చించారు. ముఖ్యంగా జాతీయ రహదారిలో నెల్లూరు నగరంలోని కనుపర్తిపాడు క్రాస్‌, చింతారెడ్డిపాలెం జంక్షన్‌ల వద్ద ఫ్లైఓవర్‌ వంతెనల అవసరాన్ని నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు జంక్షన్‌ల వద్ద వెంటనే ఫ్లైఓవర్‌లు నిర్మించాల్సి వుంది. ఫ్లైఓవర్‌లు లేకపోవడం వల్ల అనేక మంది జాతీయ రహదారిర దాటుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు చోట్ల ఫ్లైఓవర్‌లు నిర్మిస్తే దాదాపు 20గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని విపిఆర్‌ తెలుపగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

అలాగే రైల్వేమంత్రి పీయూష్‌గోయెల్‌ దృష్టికి జిల్లాలోని పలు రైల్వే సమస్యలను తీసుకెళ్లారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌ను ఏ1 గ్రేడ్‌ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలి, నగరంలోని పలు చోట్ల రైల్వే స్థలాలలో దాదాపు 30ఏళ్ళ నుండి 1500 కుటుంబాల వారు నివసిస్తున్నారు. మూడోలైన్‌ పనుల కోసం ఇప్పుడు వారిని ఖాళీ చేయమంటున్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపించాక ఖాళీ చేయిస్తే బాగుంటుందని, నెల్లూరులో ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా కొండాయ పాలెం గేటు వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి, బి.వి.నగర్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలి. కావలిలో శబరి ఎక్స్‌ప్రెస్‌కు స్టాపింగ్‌ ఇవ్వాలని ఆయన రైల్వేమంత్రిని కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.

4వ తేదీ కేంద్ర సమాచార శాఖామంత్రి మనోజ్‌కుమార్‌ సిన్హాను కూడా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కలిసారు. పోస్టల్‌ ఉద్యోగులు, పోస్టల్‌ పెన్షనర్స్‌ సమస్యలను, అలాగే టెలికం పరంగా నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. నెల్లూరుజిల్లాలో పలుచోట్ల బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయనను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here