తేది10 డిసెంబర్ 2018… హైటెక్ రత్న చంద్రబాబు రక్తాన్ని చెమటగా మార్చి, ఇటుక ఇటుకకు మధ్యలో సిమెంట్ పూసి కట్టించిన హైదరాబాద్ నగరం. కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం గాంధీ భవన్… ఆఫీసులో పిసిసి అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జీవన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దామోదరం రాజనరసింహ, వి.హెచ్. హనుమంతురావులు సమావేశమై వున్నారు. అప్పుడే అక్కడకు కర్నాటక మంత్రి డి.కె.శివకుమార్ వచ్చాడు.
ఉత్తమ్‌కుమార్ ఆయనను తన పక్కనే కూర్చోబెట్టుకుని మిగిలిన నేతలకు పరిచయం చేస్తూ… ఈయన డి.కె.శివ కుమార్ గారు… ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహించడంలో మంచి ఎక్స్పర్ట్. రేపు ఫలితాలు వస్తున్నాయి… పోటాపోటీగా సీట్లు వస్తే మన ఎమ్మెల్యేలు చేజారి పోకుండా క్యాంప్‌లు నిర్వహించేందుకు హైకమాండ్ ఈయనను స్పెషల్ ఆఫీ సర్గా నియమించింది. ఒకవేళ మన కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నాలుగైదు సీట్లు తగ్గాయనుకోండి… ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి ఆ సబ్జెక్ట్‌లో ఏంఏ, ఎంఫిల్ చేసిన చంద్ర బాబు రంగంలోకి దిగుతారు అని చెప్పాడు. అప్పుడు వి.హెచ్.హనుమంతు రావు… ఇవన్నీ తర్వాత ముందు సీఎం అభ్యర్థిని ఎలా డిసైడ్ చేయబోతున్నారో చెప్పండి అని అడిగాడు. అందుకు మళ్ళీ ఉత్తమ్‌కుమారే బదులిస్తూ… సీఎం రేసులో వున్న అభ్యర్థుల పేర్లన్నీ చీటీల మీద వ్రాసి ఒక డబ్బాలో వేస్తాం, నేను పిసిసి అధ్యక్షుడిని కాబట్టి నా పేరుతో వున్న చీటీలు రెండు వేసుకుంటాను, రాహుల్‌గాంధీ వచ్చి ఈ చీటీలలో ఒక చీటీ ఎత్తుతాడు. ఎవరి పేరొస్తే వాళ్ళే సీఎం అని చెప్పాడు. అందరూ ఆ ప్రపోజల్‌కు చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు.
్య్య్య్య్య
తేది 11 డిసెంబర్ 2018… సమయం ఉదయం 11గంటలు… గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూర్చునివున్నారు. ఉత్తమ్ ముందు ఆ ముందురోజు వ్రాసుకున్న సీఎం అభ్యర్థుల చీటీల డబ్బా వుంది. పక్కనే వున్న పొన్నాల లక్ష్మయ్య… ఉత్తమ్, ఒక తెల్లకాగితం వుంటే ఇస్తావా, చిన్న లెక్క వ్రాసుకోవాలని అన్నాడు. వెంటనే
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ముందున్న డబ్బా లోని చీటీలన్నీ ఆయన ముందు పోసి… ఎన్ని కాగితాలు కావాలంటే అన్ని కాగి తాలు తీసుకోండని విసురుగా చెప్పాడు. అంతలో అక్కడకు కర్నాటక మంత్రి డి.కె.శివకుమార్ వచ్చాడు. రాగానే బెంగుళూరులోని లీలా గ్రాండ్ ప్యాలెస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. క్యాంప్ పెట్టడానికి అందరికీ రూమ్‌లు బుక్ చేశాను కదా… ఓ 50లక్షలు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకు పంపిస్తాను అని అడిగాడు. ఉత్తమ్ తోక తొక్కిన తాచుపాములా లేచి… ఇంకేం క్యాంపు, ఇంకేం ప్రభుత్వం, అవ్వాల్సిం దంతా అయిపోయింది. కారు క్రింద హస్తం నలిగిపోయింది అంటూ వలవల ఏడ్చాడు. రిజల్ట్స్ ఏమయ్యాయి అని శివకుమార్ అడిగాడు. ఇదిగో చూడు అంటూ పొన్నాల లక్ష్మయ్య టీవీ ఆన్ చేశాడు. టీవీ 10.5 స్క్రీన్‌పై టిఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19… ఆ సీన్ చూడగానే శివకుమార్‌కు పరిస్థితి అర్ధమైపోయింది. ఇక నా అవసరం లేదనుకుంటాను… ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేస్తే బెంగుళూరుకు వెళ్ళి పోతానన్నాడు. ఉత్తమ్‌కుమార్ వెంటనే జేబులో నుండి వంద రూపాయలు తీసి శివకుమార్ చేతిలో పెట్టి ఒంటి గంటకు బెంగుళూరు ప్యాసింజర్ వుంది, దాంట్లో ఎక్కి పోండి అని కసురుగా చెప్పాడు. శివకుమార్ అందుకు కనీసం ‘కారు’ అన్నా బుక్ చేయండి అని అడిగాడు. ఆ కారు మాటెత్తొద్దు అంటూ ఉత్తమ్‌కుమార్ కస్సున లేచాడు. శివకుమార్‌కు పరిస్థితి అర్ధమై అక్కడ నుండి బయటకొచ్చేసాడు.
అంతలో గాంధీభవన్ ఆవరణలో హడావిడి కనిపించింది. అంత బాధ లోనూ కాంగ్రెస్ నేతలంతా బయటకు వచ్చారు. అక్కడ చూస్తే హైటెక్ రత్న చంద్రబాబు నాయుడు వున్నాడు. ఆయన వెనుక మీడియా వాళ్ళున్నారు. వాళ్లంతా… సార్, ప్రజాఫ్రంట్ ఓటమికి ప్రధాన కారణమేంటి? అని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు… మావైపు నుండి పెద్ద బ్లండర్ జరిగిపోయింది. దానివల్లే ఓటమి అని చెప్పాడు. ఏంటా బ్లండర్ అని మీడియా వాళ్ళు ఒకవైపు అడుగు తుండగా… చంద్రబాబు మాత్రం అక్క డున్న కాంగ్రెస్ నేతలవైపు కోపంగా చూస్తూ… ఏం ఉత్తమ్‌కుమార్ నువ్వైనా చెప్పబల్లేదా… ఏం హనుమంతురావు నువ్వు సీనియర్వి, నీకైనా తెలియదా… రేవంత్… మన గురించి అన్నీ తెలిసిన వాడివి, ఇంత బ్లండర్ జరుగుతుంటే నువ్వేమన్నా గాడిదలు కాస్తున్నావా అంటూ వారిపై చిందులు తొక్కసాగాడు. అసలే ఫలితాలు అవతారంగా వచ్చాయి. ఈ చంద్రబాబు పొత్తుతోనే తాము మునిగిపోయామని కాంగ్రెస్ నాయకులు లోలోన ఉడికిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి వేస్తున్న కేకలతో
ఉత్తమ్‌కుమార్‌కు కోపం నషాళానికి అంటింది. కోపంతో అతను… ఆ బ్లండర్ ఏంటో చెప్పి ఏడవండి అని అడిగాడు. తెలంగాణలో ప్రచారానికి సోనియా వచ్చిందా… రాహుల్ వచ్చాడా… నేను తిరిగానా… మా బాలయ్యా తిరిగారా… నువ్వు తిరిగావా… సిపిఐ నారాయణ తిరిగాడా… కాని ఇంతమంది తిరిగి ఏం లాభం… అసలు తిరగాల్సినవాడు తిరిగితేగా… అదే మనవైపు జరిగిన పెద్ద బ్లండర్ అని అన్నాడు. ఆ స్టార్ క్యాంపె యినర్ ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండని ఉత్తమ్‌కుమార్ రెండు చేతులు జోడించి అడిగాడు. ఇంకెవరూ మా లోకేష్… అతని చేత ప్రచారం చేయించడం అందరం మరచిపోయాం… అందుకే ఓటమిపాలయ్యాం అని చంద్రబాబు చెప్పాడు. ఆ మాటకు ఉత్తమ్‌కుమార్… హహహ… అంటూ నవ్వసాగాడు. అలా గంటలపాటు నవ్వుతూనే వున్నాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆయనను అపోలో ఆసుపత్రికి తీసుకుపోయారు.
