Home రాష్ట్రీయ వార్తలు కులకాష్టంలో రాష్ట్రం

కులకాష్టంలో రాష్ట్రం

స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు నుండి వై.యస్‌.రాజశేఖరరెడ్డి వరకు ఎందరో నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలించారు. నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారకరామారావు, కె.రోశయ్య… ఎవరి హయాంలోనూ ఈ రాష్ట్రంలో కులాల సమస్య తలెత్తలేదు. కులాల మధ్య చిచ్చు రేగలేదు. అంతెందుకు 1995-2004ల మధ్య సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు కాలంలోనూ రాజకీయాలలో పెద్దగా కులాలకు ప్రాధాన్యత లేదు.

కాని, రాష్ట్రానికి ఏం దరిద్రం ముసించిందోగాని గత నాలుగేళ్ళుగా కులం జాడ్యం పెరుగుతూ వస్తోంది. కులాల మధ్య చిచ్చు రేగింది. దీనికి బీజం వేసింది చంద్రబాబునాయుడే! 2014 ఎన్నికల్లో ఓట్ల కోసం కాపులకు రిజర్వేషన్‌లు అంటూ రెచ్చ గొట్టాడు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక మంజునాథ్‌ కమిషన్‌ వేసి బి.సిలను రెచ్చగొట్టాడు. పలుచోట్ల కాపులు, బీసీల మధ్య రిజర్వేషన్‌ల విషయమై గొడవలు జరిగాయి. రాష్ట్రంలో తెలుగుదేశంకు బలమైన మద్దతుదారులుగా వున్న బ్రాహ్మణు లను కూడా ఈ కులం కంపులోకి లాగారు. టీటీడీ రిటైర్డ్‌ ప్రధానార్చకులు రమణదీక్షితులు, తెలుగుదేశంపార్టీకి మధ్య జరుగుతున్న గొడవను చూస్తూనేవున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతంలో ఛైర్మెన్‌గా వ్యవహరించిన ఐవిఆర్‌ కృష్ణారావు ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. పరిపాలనలోనూ కుల వివక్ష పెరిగిపోయింది. ఈ ప్రభుత్వంలో రెండు మూడు కులాల వారికే పనులవుతున్నాయి. ప్రభుత్వ శాఖల బదిలీలలో వారికే ప్రాధాన్యత లభిస్తోంది. కొన్ని కులాల వారిని శత్రువులుగా చూస్తున్న విష వాతావరణం నెలకొంది. సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు కులాల పేర్లతో తీవ్రంగా దూషించుకుంటున్నారు. కుల సంఘం నాయకుల మధ్య చర్చా వేదికలు పెట్టి పచ్చమీడియా వివాదాలను పెంచిపోషిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ నామినేటెడ్‌ పదవుల్లో వున్న నాయకులే ఆయా కులాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో ఇంతటి కుల పైత్యం ఎప్పుడూ లేదు. ఓట్ల కోసమే కుల రాజకీయాలకు పాల్పడితే అది తమంతట తాము గోతిని తవ్వుకోవడమే అవుతుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కులం బలం మీదనో, కులం పునాదుల మీదనో ఏ పార్టీ నిర్మాణం జరగలేదు, ఏ ప్రభుత్వం ఏర్పడలేదు. తెలుగుదేశం అధినేత దీనిని తెలుసుకుని తన పాలనను మలచుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here