Home జిల్లా వార్తలు కావలి… కనకపట్నం… ఎవరికి కట్నం

కావలి… కనకపట్నం… ఎవరికి కట్నం

కావలి… వస్త్ర వ్యాపారంలో ఆంధ్రాముంబై. ఎంతోమంది విప్లవ వీరులకు జన్మనిచ్చిన జవహర్‌ భారతి విద్యాసంస్థల నెలవు. రాజకీయాలలో టక్కున గుర్తొచ్చే కలికి యానాదిరెడ్డి, గొట్టిపాటి కొండపనాయుడు వంటి నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.

2019 ఎన్నికల పోరు కావలి వేదికపై రసవత్తరంగా వుంది. వైసిపి నుండి సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డే మళ్ళీ దిగాడు. విచిత్రమేంటంటే ఈసారి ఆయనకు వైసిపి టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీలో గట్టిగా అడ్డం పడ్డ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డే అతనికి ప్రత్యర్థిగా మారాడు. వైసిపిలో వున్న విష్ణు తెలుగుదేశంలో చేరడం, కావలి టిడిపి అభ్యర్థి కావడం తెలిసిందే!

కావలి నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట ఒకప్పుడు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించాక ఆ పార్టీ ఇంతవరకు గెలిచింది 1983, 1999, 2009 ఎన్నికల్లో మూడుసార్లు మాత్రమే! అంతలావు 1994 ప్రభంజనంలో కూడా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఒకే ఒక్క సీటు కావలి. కాబట్టి తెలుగుదేశంకు ఈ నియోజకవర్గంపై కొంత పట్టు తక్కువేననుకోవాలి. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన మూలంగా జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరిలో కలవడంతో, అలాగే అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాలు కొత్తగా కావలిలో కలవడం ద్వారా తెలుగుదేశం కొంత బలం పుంజుకుంది. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన బీద మస్తాన్‌రావు ఈ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌ నుండి దిగుతున్నాడు. కావలి అసెంబ్లీ నుండి ఆయనే ఈసారి కూడా దిగుంటే పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదేమో!? వైసిపి నుండి వచ్చిన విష్ణు అభ్యర్థి కావడంతో తెలుగుదేశంలో కొంత గందరగోళంగా వుంది. అల్లూరు మండలంలో విష్ణుకు బీద వర్గీయులు ఎంతవరకు సహకరిస్తారన్నది సందేహం. విష్ణు ఒకసారి గెలిస్తే కావలిపై బీద సోదరుల ఆధిపత్యం పోయినట్లే! మళ్ళీ వాళ్ళకు నియోజకవర్గం దొరకడం చాలా కష్టం.

ఇక వైసిపి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి రెండో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అల్లూరు మండలంలో బీద, విష్ణు వర్గాలు ఏకమైతే ప్రతాప్‌కు కొంత నష్టమే! ఆదాల ఎంపీ అభ్యర్థి కావడం ప్రతాప్‌కు కలిసొచ్చే అంశం. కావలి పట్టణంలో వైసిపి ప్రభావంపై ఎక్కువ ఆశలున్నాయి. ఎమ్మెల్యేగా అతనిపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. జగన్‌ గాలి పనిచేస్తే తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకంతో వున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here