Home జిల్లా వార్తలు కాలుస్తున్న ఎండలు

కాలుస్తున్న ఎండలు

ఎండాకాలం మండిపోతోందంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇంతగా కాలుస్తున్న ఎండల్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఓ పదేళ్ళ క్రితం 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది. అప్పట్లో మరో రెండు డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరుగుతున్నదని తెలిసి ‘నెల్లూరేందబ్బా ఇంతగా మండిపోతోంది’ అనుకున్నవారంతా ఇప్పుడు ఈ మండుతున్న ఎండల్ని చూసి హతాశులైపోతున్నారు.

పక్కనే సముద్రం ఉన్నా, సముద్రపు గాలులతో ఎప్పుడూ చల్లగా ప్రశాం తంగా ఉండే నెల్లూరు ఇప్పుడు అగ్నిగుండంలా మారిపోయింది. చెట్టు చేమ నాశనమైంది..పర్యావరణం కన్పించకుండా పోయింది. చల్లదనం అన్నది ఎటో ఎగిరిపోయింది. వానలు కరువై, ఎండలే విరుచుకుపడుతు న్నాయి. ఈ ఎండాకాలం కూడా పూర్వంలా లేదు.. అగ్గిపుల్ల గీసి ఒంటిమీద పెట్టినట్లు భగ్గుమంటోంది. ఇంతటి భయంకరమైన ఎండలు నెల్లూరోళ్ళు ఎప్పుడూ చూళ్ళేదు. ఈ ఎండల దెబ్బకు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులతో పాటు సామాన్య ప్రజలు కూడా హడలిపోతున్నారు. భగ్గుమంటున్న ఎండలకు..ముఖ్యంగా నెల్లూరు నగరంలోని సిమెంటు రోడ్లు కాలిన పెనుంలా అయిపోతున్నాయి. కాలు పెడితే భగ్గుమని కాలిపోతున్నాయి. అట్టుడికినట్టు ఉడికిపోవడమంటే ఏమిటో నెల్లూరు నగరవాసులు ఇప్పుడు కళ్ళారా కాదు..’కాళ్ళారా’ చూస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ చుర్రుమంటోంది. సాయంత్రం 6గంటలు దాటితే తప్ప ఎండలు ఉపశమిం చడం లేదు. అప్పటికీ సెగగాలులు వీస్తూనే ఉన్నాయి. ఈ ఎండల్లో చిన్న పిల్లలు, ముసిలీ ముతకా… రాత్రి పగలు ఉక్కతో, వేడితో నిద్రపట్టక అవస్తలు పడుతున్నారు. ఫ్యాన్లు వేస్తే సెగగాలులు వస్తున్నాయి. ఏసీలు ఎంతసేపని వేయగలం?. ఆ తర్వాత వచ్చే బిల్లులు ఎండలకంటే ఎక్కువగానే వినియోగదారుల్ని హడలగొట్టేస్తున్నాయి. ఈ ఎండలు త్వరగా తగ్గిపోవాలని జనం వేయిదేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.

ఈ వేసవి తీవ్రత ఎప్పుడు తగ్గేనో..?

రోహిణి కార్తెలో రోళ్ళు పగిలిపోతాయని నానుడి ఉండేదని అందరికీ తెలిసిందే. అయితే, అదెలా ఉంటుందో.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మే నెల అంటేనే వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ మే మాత్రం మరింత ఉగ్రరూపం దాల్చింది. గత పది పదిహేను రోజులుగా ఎండ మిడిమేళంగా కాస్తోంది. నెలలో మొదటి పదిహేను రోజులు కొంచెం కొంచెంగా పెరుగుతూ చిన్నగా 35 నుంచి 40 డిగ్రీలకు చేరుకుంది. 40 డిగ్రీల వేడిని తట్టుకోవాలంటే చిన్నవిషయమేమీ కాదు. ఈ ఎండలదెబ్బకు వడదెబ్బ తగిలి పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. అలాంటిది 40 డిగ్రీలు దాటితే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఈనెల 20నుంచి అది కూడా అనుభవంలోకి వచ్చింది. 40.8 డిగ్రీల వేడితో ఎండ భగ్గుమంది. ఇక ఇక్కడి నుంచి ఏరోజు కారోజు మరింత మండిపోతూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. 25న ఏకంగా 43.1 డిగ్రీల వేడితో భూమి భగభగలాడింది. 28న 46 నుంచి 47డిగ్రీల దాకా పెరిగింది. ఇంకొద్ది రోజులు పోతే 50 డిగ్రీలకు కూడా చేరుకుంటుందేమో నని, ఈ ఎండకు ఇక నిలవలేమని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇంకా మరో వారం పది రోజుల దాకా పరిస్థితి ఇలాగే ఉంటోందని అంటున్నారు. మరి ఇంతటి మండే ఎండల్లో ఎలా బతకాలి దేవుడా అంటూ జనం గోడుగోడుమంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here