Home జిల్లా వార్తలు కాలం మారినా.. లక్ష్యం ఒకటే! – మనుషులు మారినా.. ధ్యేయం ఒకటే!

కాలం మారినా.. లక్ష్యం ఒకటే! – మనుషులు మారినా.. ధ్యేయం ఒకటే!

ఏ సంస్థ అయినా సరే మారుతున్న కాలానికి తగ్గట్టుగా అవసరమైన మార్పుచేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలే తప్ప, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుంటే ఆ సంస్థకు ఎలాంటి పురోగతి ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. 1920ల నాటి కాలానికీ..ఆ తర్వాత 50 ఏళ్ళు దాటాక 1970ల కాలానికీ ఎంతో తేడా ఉంది. ధరవరల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అప్పట్లో వస్తుసామగ్రి ధరకు ఆ తర్వాత 50 ఏళ్ళ నాటి ధరలకు కొండంత తేడా ఉంటుంది. ఏ నిర్మాణం చేపట్టాలన్నా భారీగా వ్యయం అవుతూ వచ్చింది. పాతకాలపు ధరలు ఇప్పుడిస్తామంటే ఎవరూరుకుంటారు?..ఇకపోతే విద్యాలయం నిర్వహణ అంటే మాటలు కాదు. అందులోనూ బాలికల విద్యాలయం..బాలికల హాస్టల్‌. వీటికి రోజూ డబ్బు వెచ్చిస్తే తప్ప పనులు జరగవు. నానాటికీ ఖర్చులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తొలినాళ్ళ కమిటీలో ప్రముఖులుగా ఉంటూ కమిటీకి అన్నివిధాలా అండదండలందిస్తున్న మహనీయులు ఒకరొకరుగా గతించిపోతున్న నేపథ్యంలో 1973 నాటికి కొత్త కమిటీ రావడంతో సరికొత్త ఊపిరి వచ్చినట్లయింది.

కష్టనష్టాలను ఓర్పుతో అధిగమించారు

విద్యాలయం నిర్వహణ బాగా కష్టమవుతున్న సమయంలో, మారుతున్న కాలానికి తగ్గట్టుగా తగు నిర్ణయాలు తీసుకుని విద్యాలయాన్ని పరిరక్షించేందుకు కమిటీ సంకల్పించింది. నష్టాల భారాన్ని సహించి సంస్థను పురోగతిలోకి తెచ్చేందుకు అవసరమైన విధంగా..కాలానుగుణంగా తగు చర్యలు తీసుకోవడం అనివార్యమైంది. ఆమేరకు కమిటీ నియమ నిబం ధనలకు కూడా తగు మార్పుచేర్పులు చేసుకునే విషయంపై కమిటీ ప్రముఖులు పలుసార్లు సుదీర్ఘంగానే చర్చించుకున్నారు. ఒకవైపు విద్యాలయం, మరోవైపు బాలికల హాస్టల్‌ నిర్వహణ రెండూ ఎలాంటి ఇబ్బం దులు లేకుండా జరగాలంటే పాత నిర్ణయాలు కొంత మార్చుకోవాలనే అవసరం ఉందనిపించి ఆమేరకు తగు చర్చలు జరిగాయి.

ఈ క్రమంలో ప్రముఖ దాత, విద్యాలయానికి ఏళ్ళతరబడి అకుంఠిత సేవలందించిన టి.రామిరెడ్డి గారు పరమపదించడంతో దిగులుపడిన కమిటీకి… ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారు అధ్యక్షులు కావడంతో… విద్యా లయానికి కొత్త ఊపిరి వచ్చింది. విద్యాలయం వ్యవస్థాపకురాలైన శ్రీమతి పొణకా కనకమ్మగారి తోనూ, ఇతర ప్రముఖులందరితోనూ ఆయన బాగా పరిచితులనే విషయం అందరికీ తెలిసిందే. విద్యా లయం స్థాపన మొదలుకొని అన్ని విషయాలు ఆమూలాగ్రం తెలిసిన నాయకుడు, మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహనీయుడు డాక్టర్‌ బెజవాడ గోపాల రెడ్డిగారు 1973లో కస్తూరిదేవి విద్యాలయానికి అధ్యక్షత్వం వహించడం ఈ విద్యాలయం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఆయన రాకతో విద్యాలయం మళ్ళీ జవసత్వాలు పుంజుకుంది. వారి అధ్యక్షత్వంలో విద్యాలయం పురోభివృద్దే లక్ష్యంగా కమిటీ తీసుకున్న అనేకానేక నిర్ణయాలు తిరిగి విద్యాలయాన్ని నాటి కష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు ఎంతగానో ఉప యోగపడ్డాయి. విద్యాలయం ప్రాంగణంలో ఉన్న కొంత స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కావచ్చు, వదాన్యుల సహకారం ద్వారా కావచ్చు.. ఏ విషయ మైనా సరే అందరితో కూలంకుషంగా చర్చించి తీసుకునే నిర్ణయాల ద్వారా.. కమిటీ మరింత

ఉత్సాహంగా ముందుకు సాగింది. ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటూ విద్యాలయానికి అవసర మైన ప్రాధమిక వసతుల కల్పనలో ఉన్న కష్టనష్టాలను కూడా క్రమేణా అధిగమిస్తూ వచ్చింది. దృఢచిత్తం, పేదబాలికలకు విద్యను అందించాలనే సంకల్పం, ఎన్ని కష్టాలనైనా సరే అధిగమించాలనే ఏకైన లక్ష్యంతో పాటు, విద్యాలయాన్ని పురోగామి పథంలో నడపాలన్న దీక్షతో.. కొత్త కమిటీ కూడా ముందుకు సాగింది. కమిటీ మారినా.. లక్ష్యం ఒకటే!.. మనుషులు మారినా.. అందరి ధ్యేయం ఒకటే!.. అన్నట్లుగా ఈ విద్యాలయం పురోభివృద్ధే.. అందరి పరమావధిగా మారింది.

20-12-1973లో జరిగిన కమిటీ సమా వేశానికి ఛైర్మెన్‌గా శ్రీ ఆర్‌.దశరధరామిరెడ్డిని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారిని సభ్యులుగా కో-ఆప్ట్‌ చేసుకోవడమే కాక డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారిని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటూ ఇదే సమా వేశంలో తీర్మానించారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల శ్రీ ఆర్‌.దశరధరామిరెడ్డిగారు కమిటీకి రాజీనామా సమర్పించడంతో రాజీనామాను కమిటీ సమ్మతించి, ఇంతకాలంగా ఈ విద్యాలయానికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతించింది. ఈ సమావేశంలో డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ ఆర్‌ దశరధరామిరెడ్డిగార్లతో పాటు శ్రీయుతులు మేనకూరు ఆదిశేషారెడ్డిగారు,

పి.వి.రమణారెడ్డిగారు, ఏ. అన్నపూర్ణమ్మగారు, సికె శుభప్రదగారు తదితరులున్నారు.

మల్లెతోటల సాగుకు

మూడేళ్ళ లీజుకు అనుమతి

15-9-1974న జరిగిన కమిటీ సమావేశంలో.. హాస్టల్‌కు దక్షిణం వైపున కొంతస్థలాన్ని కొత్తగా మల్లెతోటల సాగుకు మూడేళ్ళ పాటు అంటే 1-10-1974 నుంచి 30-9-1977 వరకు లీజుకు ఇవ్వాలని నిర్ణయిస్తూ కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా, ఇప్పుడున్న కమిటీ కొత్త నియమ నిబంధనావళి రూపొందించేదాకా కొనసాగుతుందని పేర్కొంటూ, ఆ మేరకు శ్రీయుతులు మేనకూరు ఆదిశేషారెడ్డి, పివి రమణారెడ్డి, శుభప్రదమ్మలు కొత్త నియమ నిబంధనావళిని రూపొందించాలని కూడా ఇదే సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో డా.బెజవాడ గోపాలరెడ్డిగారు, శ్రీయుతులు ఎం.ఆదిశేషారెడ్డి, పి.వి.రమణారెడ్డి, ఎన్‌.శ్రీరామమూర్తి, సికె శుభప్రదమ్మగార్లు ఉన్నారు. ఆ తర్వాత, కస్తూరిదేవి బాలికల హాస్టల్‌కు మేనేజర్‌గా, వార్డెన్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన మేనేజర్‌ శ్రీ చౌడేశ్వరరావు16-9-1974న రిటైర్‌ కావడంతో, ఆయన సేవలను కమిటీ అభినందిస్తూ, ఆయనకు 1974 చివరిదాకా పూర్తి జీతం ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. కాగా, దాదాపు 16 సంవత్సరాల పాటు విద్యాలయానికి విశేష సేవలందించిన మేనేజర్‌ ఎం.చౌడేశ్వరరావు 24-7-1975న మృతిచెంద డంతో, 18-8-1975న జరిగిన కమిటీ సమా వేశంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ, విద్యాలయం కమిటీ ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియ జేసింది. 25-2-1976న జరిగిన సమావేశంలో, టెన్త్‌లో ప్రతిభ చూపుతున్న విద్యార్థినులకు ప్రోత్సాహ కంగా ఏటా ఇద్దరికి బహుమతులు ఇవ్వాలని డా.బెజవాడ గోపాలరెడ్డిగారు సూచించారు. అందులో ఒక బహుమతిని దివంగత రామానాయుడుగారి స్మృత్యంకంగా, మరో బహుమతిని దివంగత వ్యవస్థాపకురాలు పొణకా కనకమ్మ గారి స్కృత్యంకంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. 26-4-1976న జరిగిన సమావేశంలో విద్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వం ఆడిటోరియం నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనను కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించింది.

మరుపూరు పిచ్చిరెడ్డి గారి

మృతి తీరని లోటు :

ఇదిలావుంటే, చాలాకాలంగా కమిటీ సభ్యులుగా ఉంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ ఎంతగానో సేవ చేసిన మరుపూరు పిచ్చిరెడ్డిగారు మృతి చెంద డంతో, ఈ కమిటీ సమావేశంలో ఆయనకు కమిటీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు తీరనిది. కమిటీకి, విద్యాలయం అభ్యు న్నతికి ఆయన విశేషమైన సేవలు చేశారు. అదే విధంగా, ఎంతోకాలంగా విద్యాలయానికి వెన్ను దన్నుగా ఉంటూ, తమ తల్లిగారైన పలగాని సుబ్బమ్మ గారి పేరుతో బాగా చదువుకుంటున్న పిల్లలకు ప్రతిభా అవార్డులిచ్చి ప్రోత్సహించే ప్రముఖ దాత పలగాని చంద్రారెడ్డిగారు కూడా మృతిచెందడంతో విద్యా లయం కమిటీ మరింతగా విషాదానికి లోనయ్యింది. 10-10-1976లో జరిగిన సమావేశంలో కమిటీ ఆయన మృతికి తన తీవ్ర సంతాపం వెలిబుచ్చింది.

25-1-1977న జరిగిన సమావేశంలో ప్రధానంగా, స్కూలు వార్షికోత్సవం కారణాంతరాల వల్ల తొలుత అనుకున్న తేది నుంచి వాయిదా పడ డంతో 1977 మార్చి 31న వార్షికోత్సవం ఘనంగా జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యాలయంలోని విద్యార్థినులు తరచూ సెలవులు పెడుతున్న విషయాన్ని కూడా కమిటీ గ్రహించి, వారు సెలవు పెట్టేందుకు సరైన కారణాలున్నాయా లేదా పరిశీలించాలని, వారు బాగా చదువుకునేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందరూ ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ ఆ సమావేశంలో తీర్మానించింది. ఈ సమావేశంలో శ్రీయుతులు డా. బెజవాడ గోపాల రెడ్డిగారు, సికె శుభప్రదమ్మగారు, ఎం.ఆదిశేషారెడ్డి, పి. అన్నపూర్ణమ్మ, పి.సావిత్రిదేవి గార్లు ఉన్నారు. విద్యాలయంలోని ఆడిటోరియాన్ని కేవలం వివాహ ముహూర్తం జరిగే రోజుకు మాత్రమే ఇతరులకు కేటాయించాలని, పెళ్ళికి ముందు గానీ, తర్వాత గానీ జరిగే ఫంక్షన్‌లకు ఆడిటోరియాన్ని ఇవ్వకూడదని నిర్ణయిస్తూ కమిటీ 1-7-1978లో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించింది.

కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి కమిటి ఆమోదం…

కస్తూర్బా కళాక్షేత్రం వైపున విద్యాలయానికి సంబంధించిన కాంపౌండ్‌వాల్‌ నిర్మాణానికి కమిటీ ఆమోదించి ఆమేరకు 22,850 రూపాయల అంచనా వ్యయాన్ని మంజూరు చేస్తూ 30-3- 1979లో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మల్లెతోటల సాగుకు తీసుకున్న లీజుదారునికి తుఫాను వల్ల నష్టం కలిగితే, లీజు మొత్తం కొంత తగ్గించుకోవాల్సిందిగా లీజుదారుని అభ్యర్థనను కమిటీ మానవతా దృక్ఫధంతో పరిశీలించి తమకు చెల్లించా ల్సిన లీజులో 25 శాతం రాయితీ కూడా ఇచ్చింది.

ఇలా విద్యాలయానికి, హాస్టల్‌కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కమిటి ఎప్పటికప్పుడు పరిశీ లనలు, పర్యవేక్షణలు జరుపుతూ తగు నిర్ణయాలు తీసుకునేది. విద్యాలయం కష్టాల్లో వున్నప్పుడు కృంగిపోకుండా ఆ కష్టాలను ఎలా అధిగమించాలనే విషయమై కమిటి ప్రముఖులందరూ తరచూ చర్చించు కునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాలికల విద్యాలయాన్ని వారంతా తమ కన్నబిడ్డలా చూసు కుంటూ… కంటికి రెప్పలా కాపాడుకునేవారు. అందువల్లనే… వారందరి కృషి వల్లనే కస్తూరిదేవి విద్యాలయం నేటికీ కళకళలాడుతూనే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here