Home జాతీయ వార్తలు కారు జోరుకు హస్తం చిత్తు

కారు జోరుకు హస్తం చిత్తు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ మరోసారి జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను, టిఆర్‌ఎస్‌ 86 స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యత సాధించింది. అధికారంపై గంపెడాశలు పెట్టుకుని తెలుగుదేశం, టిజెఎస్‌, సిపిఐ వంటి పార్టీలతో కూటమి కట్టిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కూటమి స్కోరు 23సీట్ల వద్దే ఆగిపోయింది. పొత్తులో భాగంగా 13సీట్లకు పోటీ చేసిన తెలుగుదేశం కేవలం 2సీట్లలో మాత్రమే విజయం సాధించింది. టిజెఎస్‌ పోటీ చేసిన 8 స్థానాల్లోనూ, సిపిఐ పోటీ చేసిన 4స్థానాల్లోనూ తీవ్ర పరాజయం పొందారు. కాంగ్రెస్‌ నుండి పోటీ చేసిన మహామహులు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌గా పేరుబడ్డ రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నాయకులంతా పరాజయంపాలయ్యారు. 2014 ఎన్నికల్లో 5సీట్లు సాధించిన బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో చతికిలబడింది. కేవలం 1సీటు మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలిగింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, బద్దం బాలిరెడ్డి, ఎందోటి లక్ష్మీనారాయణ వంటివారంతా ఓటమి చెందారు. టిఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం 7సీట్లను గెలుచుకుంది. టిఆర్‌ఎస్‌లో మంత్రి హరీష్‌రావు లక్షకుపైగా మెజార్టీతో సిద్ధిపేట నుండి విజయం సాధించారు. ఆరుసార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. హైదరాబాద్‌ సిటీలో సెటిలర్స్‌ అంతా కూడా టిఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపినట్లు ఈ ఫలితాలనుబట్టి తెలుస్తోంది. కేవలం ఎల్‌బినగర్‌లో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. మిగతా స్థానాల్లో టిఆర్‌ఎస్‌, ఎంఐఎంలు జెండాలు ఎగురవేసాయి. సెటిలర్స్‌ అత్యధికంగా నివసించే కూకట్‌పల్లి, శెరిలింగంపల్లి, కుబ్దుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లోనూ టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ఓడిపోవడం నందమూరి అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here