Home జిల్లా వార్తలు కారు కన్నీరు పెట్టిస్తోంది..!

కారు కన్నీరు పెట్టిస్తోంది..!

అతను గీత కార్మికుడు… కాని అతని నుదుటి గీత బాగాలేనట్లుంది. రికార్డుల్లో తప్పుడు రాతల వల్ల అతని తలరాత మారిపోయింది. తనకు తెలియ కుండానే తన పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ జరిగి వుండడంతో అతను కనీసం పింఛన్‌ పొందే అర్హత కూడా కోల్పోయాడు. అతనికే తెలియకుండా అతని పేరుతో రిజిష్టర్‌ కాబడ్డ కారు అతని కడుపు మీద కొడుతోంది. కన్నీరు పెట్టిస్తోంది.

కొడవలూరు మండలం బ్రహ్మారెడ్డిపాలెంకు చెందిన కల్లుగీత కార్మికుడైన జాన శ్రీనివాసులు వయసు మీద పడడంతో కల్లుగీత వృత్తిని కొనసాగించే ఓపిక లేక బ్రతుకుదెరువు కోసం పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతనికి పింఛన్‌ మంజూరుయ్యే సమయంలో ఆన్‌లైన్‌లో అతని పేరుతో ఇసుజు కారు రిజిష్టర్‌ కాబడినట్లుగా గుర్తించారు. 2015 ఫిబ్రవరి 20వ తేదీన అతని పేరుతో కారు రిజిష్టర్‌ చేయబడి వుంది. మరి అతని గుర్తింపు కార్డులు, అతని సంతకం లేకుండా అతని పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ చేసిన వాళ్లెవరన్నది భగవంతుడికే తెలియాలి.

నీకు కారుంది… పింఛన్‌ కావాలంటే కారు లేనట్లు సర్టిఫికేట్‌ తెచ్చుకోవాలని అధికారులు చెప్ప డంతో మొదట ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాడు. అటెండర్‌ నుండి డిటిసి వరకు అందర్నీ కలిసాడు. అక్కడ నెలల కాలాలు తిప్పించుకున్నారు. పని జరగలేదు. ఎస్పీ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చాడు. వాళ్లు ఇది రవాణాశాఖకు సంబంధించిన పని అని చెప్పారు. కలెక్టరేట్‌లో అర్జీ ఇస్తే వాళ్లు కూడా రవాణాశాఖ ఆఫీసుకే పొమ్మన్నారు. చివరకు కొడవలూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కూడా వాళ్ళూ ఆర్టీవో ఆఫీసుకే రెఫర్‌ చేశారు. ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఇంతమంది అధికారులను వేడుకున్నా చివరకు అతని పనైతే జరగలేదు.

జాన శ్రీనివాసులు గీతకార్మికుడు. చదువు సంధ్య పెద్దగా లేవు. మరి అతను తిరిగిన ఆఫీసర్లలో టెన్త్‌ నుండి ఐఏఎస్‌ వరకు చదివినవాళ్ళున్నారు. ప్రతి ఒక్కరూ అదొక పనిగా చూసారేగాని, అసలు అతని పేరుతో కారు ఎవరు రిజిష్టర్‌ చేశారు, ఆ కారు ఎవరు వాడుతున్నారన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారా? అసలు జాన శ్రీనివాసులు పేరుతో రిజిష్టర్‌ ఎలా చేయగలిగారు? దానికి సంబంధించిన గుర్తింపు కార్డులు ఎలా ఇచ్చారు అనే దానిపై విచారణ చేయ గలిగారా? సంఘవిద్రోహులు, విదేశీ శక్తులు కూడా ఇలా నకిలీ పేర్లతో కార్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తిరగొచ్చు… జాన శ్రీనివాసులుకు సంబంధం లేకుం డానే అతని పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తిరుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళే!

అడ్డదారులు తొక్కే వాళ్లే అయ్యుంటారు కదా! ఏ కంపెనీ కారు, ఆ కారు నెంబర్‌ అన్నీ వుంటాయి కదా! ఆ కారును పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి కదా! ఇక్కడ సమస్యను కేవలం జాన శ్రీనివాసులు పింఛన్‌ కోణంలోనే కాదు, నకిలీ రిజి స్ట్రేషన్‌లు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటివి ఇంకా ఎన్నివున్నాయి? అనే కోణంలో కూడా ఉన్నతాధి కారులు ఆలోచించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here