Home రాష్ట్రీయ వార్తలు ‘కాపు’ రిజర్వేషన్‌పై కాకి గోల

‘కాపు’ రిజర్వేషన్‌పై కాకి గోల

నిజం వేపపువ్వు లాంటిది. తినడానికి చేదుగా వుంటుంది. కాని తింటే ఆరోగ్యానికి మంచిది. అబద్ధం చక్కెరలాంటిది. తినేటప్పుడు తియ్యగా వుంటుంది, తిన్నాక శరీరాన్ని రోగాల పుట్టగా మారుస్తుంది. అయితే వీటి స్వభావాల గురించి తెలిసి కూడా వేపపువ్వును ఎవరూ ముట్టరు. పంచదారనే ఇష్టపడుతుంటారు.

ఇలాంటివే రాజకీయాలు కూడా! ఇక్కడ నిజాలతో పనిలేదు… అబద్ధాలతోనే నెట్టుకురావచ్చు. అందంగా అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళకే అందలాలు కూడా దక్కుతుంటాయి. 2014 ఎన్నికల్లో ఋణమాఫీ చేస్తానని అలా అందమైన అబద్ధం చెప్పబట్టే, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపులకు రిజర్వేషన్‌లను అమలు చేస్తానని ఆకర్షణీయమైన అసత్యాన్ని చెప్పబట్టే చంద్రబాబు అధికారపీఠం ఎక్కగలిగాడు. సాధ్యం కాదని తెలిసి ఋణమాఫీ వాగ్ధానం చేయకపోబట్టే జగన్‌ ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు. కాని తాను అధికారంలోకి రావడానికి కారణమైన పై రెండు హామీలను చంద్రబాబు ఇంతవరకు నెరవేర్చలేదు.

అయినా కూడా ఇంకా అబద్ధాల మాయాలోకంలోనే బ్రతకడానికి చాలామంది ఉత్సాహం చూపడం చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదు.

చాలా రాష్ట్రాలలో ఒక్కో కులం వాళ్ళు రిజర్వేషన్‌ ఉద్యమాలు జరుపుతున్నారు. ఏపిలోనూ కాపు రిజర్వేషన్‌ ఉద్యమం జరగడం చూసాం. 2014లో కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పడం వల్లనైతేనేమీ, జనసేన పవన్‌కళ్యాణ్‌ మద్దతు ఇవ్వడం వల్లగాని రాష్ట్రంలోని కాపులు దాదాపు 80శాతం మంది తెలుగుదేశంకు ఓట్లేసారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌లు అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఉద్యమం చేయడం, తుని రైలు ఘటన, కాపు నేతలపై కేసులు, ముద్రగడ కుటుంబసభ్యులను చాలా దారుణంగా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్‌ చేయడం వంటి ఘటనలెన్నో జరిగాయి. కాపు రిజర్వేషన్‌ల అంశం తన పరిధిలో లేదని, రాజ్యాంగ సవరణ చేయనిదే కాపులకు రిజర్వేషన్‌లు సాధ్యం కాదనే విషయం చంద్రబాబుకూ తెలుసు. అయినా కాపు రిజర్వేషన్‌ లపై అధ్యయనం అంటూ మంజునాథ్‌ కమిషన్‌ వేసి చాలా కాలం లాగాడు. కాపుల నుండి ఒత్తిడి అధికం కావడంతో మంజునాథ్‌ కమిషన్‌ ఛైర్మెన్‌ నివేదికను తీసుకోకుండానే హడావిడిగా అసెంబ్లీలో కాపులకు రిజర్వేషన్‌లు ఇవ్వాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. అంటే కేంద్రానికి తీర్మానం పంపడంతోటే చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్‌ హామీని అమలు చేసినట్లన్న మాట!

రిజర్వేషన్‌ కోటా 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. చంద్రబాబు ఉన్నఫళంగా కాపులకు రిజర్వేషన్‌లు ఇవ్వాలంటే వారిని బీసీలలో చేర్చాలి. అలా చేస్తే 1983 నుండి టీడీపీకి ఓటుబ్యాంకుగా వున్న బీసీలు ఎగరేసి తంతారు. కాబట్టి వాళ్ళలో చేర్చకుండా కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్‌లు ఇవ్వాలంటే సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం చెల్లదు. ఇక రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే కాపులకు కోటా అమలు చేయాలి. ఒక కులం కోసం రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదు. అలా రాజ్యాంగాన్ని కలబెట్టడమంటే దేశంలో కులాల కార్చిచ్చు రాజేయడమే. చంద్రబాబు కేవలం కాపు రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నాడు. అంతేగాని కాపు రిజర్వేషన్‌ల గురించి ఈయన ఒక్కసారి కూడా కేంద్రంతో చర్చించలేదు.

కాపు రిజర్వేషన్‌లపై వున్న వాస్తవం ఇది. ప్రజాసంకల్ప పాదయాత్రలో వున్న జగన్‌ మొన్న జగ్గయ్యపేట సభలో ఇవే వాస్తవాలను ప్రస్తావించాడు. కాపు రిజర్వేషన్‌ల అంశం కేంద్రం పరిధిలోనిదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, సాధ్యం కాని హామీలను తాను ఇవ్వలేనని ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టాడు. అంతేకాదు, కాపుల సంక్షేమానికి చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండింతలు ఇస్తానని కూడా చెప్పాడు.

కాని, జగన్‌ చెప్పిన నిజం కొందరు కాపు నాయకులకు చేదుమాత్రలా అనిపించింది. ముఖ్యంగా కాపు ఉద్యమనాయకుడు ముద్రగడకు జగన్‌ చెప్పిన నిజాలు రుచించలేదు. ఆయనకు వాస్తవాలకంటే చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన పోలీసుల చేత కొట్టించిన దెబ్బలే సమ్మగా అనిపించాయి. వాస్తవాలు మాట్లాడిన జగన్‌పై ఆయన విషం కక్కాడు. జగన్‌పై రాజకీయ విమర్శలు చేయడమే కాక, కాపు రిజర్వేషన్‌లపై ఇంకా చంద్రబాబుపై నమ్మకం ఉందంటూ మాట్లాడాడు. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందనే సామెత ఇలాంటి వారిని చూసే వచ్చిందేమో!

కాపు రిజర్వేషన్‌లపై జగన్‌ చెప్పిన వాస్తవాలనే రెండోరోజు టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పాడు. కాపు రిజర్వేషన్‌లపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇంతవరకు తన వైఖరి చెప్పలేదు. ఆయన చెప్పినా ఒరిగేదేమీ లేదు.

కాపు ఓట్లతో లాభపడ్డ చంద్రబాబే వారిని దగా చేసాడు. కాపుల వల్ల ఓడిపోయిన జగన్‌ మాత్రం భవిష్యత్‌లో వారిని మళ్ళీ నమ్మి మోసపోవద్దంటూ, వున్న వాస్తవాలను వివరించాడు. అంతేకాదు, కాపులకు నేను ఇదైతే చేయగలను అని సాధ్యమయ్యే హామీనిచ్చాడు. మరి కాపులు ఇప్పటికి కూడా అబద్దాల చంద్రబాబును నమ్ముతారో, కాపులపై కపటప్రేమను చూపే పవన్‌ వెంట నడుస్తారో, వున్నదివున్నట్లు కుండ బద్ధలు కొట్టిన జగన్‌కు జై కొడతారో కాలమే తేల్చాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here