Home రాష్ట్రీయ వార్తలు ‘కాపీ’లతో టోపీ

‘కాపీ’లతో టోపీ

పదో తరగతి పరీక్షలు జరుగుతుంటాయి. ఏడాది పొడవునా రాత్రింబవళ్ళు చదివిన ఒక విద్యార్థి తన తెలివితో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తాడు. అతని వెనుక బెంచీలోనే వున్న మరో విద్యార్థి సంవత్సరమంతా జులాయిగా తిరిగి వుంటాడు. కాని, పరీక్ష రోజున ముందు బెంచీలో వున్న విద్యార్థి జవాబు పత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొడతాడు. పరీక్ష పేపర్లు దిద్దే మాస్టార్లకు ఎవరు సొంతంగా వ్రాసారో, ఎవరు కాపీ కొట్టారో తెలియదు కదా! చదువు కున్నోడికి, చదువుకోని వాడికి ఒకటేగా మార్కులొస్తాయి.

కాపీ కొట్టే మార్గాలు చదువుల్లోనే కాదండోయ్‌… రాజకీయాల లోనూ వుంటాయని నిరూపిస్తున్నాడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఒక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగించడం ఒక పద్ధతి. కాని, ఒక పార్టీ నాయకుడు ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి ముందుగానే అమలు చేయడం ఇంకో పద్ధతి. ఇప్పుడు ఈ కాపీ మార్గాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నాడు. జగన్‌ ఏది చేస్తే చంద్రబాబు అది చేస్తున్నాడు. జగన్‌ ఏ హామీ ఇస్తే చంద్రబాబు ఆ హామీని అమలులోకి తెస్తున్నాడు. ఇదంతా ఎన్నికలనకు ఇంకో రెండు నెలలు పెట్టుకుని చేస్తున్న హడావిడి!

జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రలో వైసిపి అధికారంలోకి వస్తే ‘నవరత్నాలు’ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వీటిలో వితంతు, వికలాంగ, వృద్ధాఫ్య పింఛన్‌లను రెట్టింపు చేయడంతో పాటు పింఛన్‌ వయోపరిమితిని 45ఏళ్ళకు తగ్గిస్తామన్నారు. రైతుల కోసం ‘రైతు భరోసా’ను ప్రకటించాడు. చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంటికి ఏడాదికి 15వేలు ఆర్ధిక సాయం ప్రకటించాడు. ఆటో కార్మికుల కోసం లైఫ్‌టాక్స్‌ ఎత్తేస్తానని హామీ ఇచ్చాడు. వైసిపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన ‘నవరత్నాలు’ను అమలు చేయడానికి జగన్‌ చిత్తశుద్ధితో వున్నాడు.

ఇప్పుడు ఓట్ల కోసం చంద్రబాబు వాటిని కాపీ కొడుతున్నాడు. ఎన్నికలకు ముందు ఈ పథకాలను కాపీకొట్టి అమలు చేస్తున్నాడు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి వుండుంటే ఈ నాలుగేళ్ళ పది నెలల కాలం నుండి ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నాడు. కేవలం ఓట్ల రాజకీయం! హౌస్‌ ఫర్‌ ఆల్‌ క్రింద రాష్ట్రంలో 10లక్షల ఇళ్లు నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఈ ఇళ్లు నిర్మించబడ్డాయనే విషయానికి తెలుగుదేశం ప్రభుత్వం పసుపుపచ్చ ముసుగు తొడిగింది. ఇవన్నీ చంద్రబాబు డబ్బులతో కట్టినట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఋణమాఫీ వాగ్ధానం అటకెక్కింది. ఇప్పుడేమో వారి ఓట్ల కోసం 10వేల చెక్కులు, సెల్‌ఫోన్‌లు అంటున్నారు. పింఛన్‌లు రెట్టింపు చేయాలన్న ఆలోచన వచ్చిందంటే దానికి కారణం జగన్‌ ప్రకటించిన నవరత్నాలే! ఇలా జగన్‌ తాను అధికారంలోకి రాకముందే తానిచ్చిన హామీలను అమలు చేయించిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు.

ఒక్క పథకం విషయంలోనేనా… ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే నాయకుడు మిగతా విషయాలలోనూ జగన్‌ను అనుకరిస్తున్నాడు. ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా నల్లచొక్కాతో అసెంబ్లీకి జగన్‌ ఎప్పుడో వచ్చాడు. చంద్రబాబు అదే నల్లచొక్కాతో నిన్నొచ్చాడు. నల్లచొక్కాతో జగన్‌ ఎప్పుడో ఢిల్లీలో దీక్ష చేశాడు. చంద్రబాబు అదే నల్లచొక్కాతో 12కోట్లతో నిన్న దీక్ష చేశాడు. జగన్‌ ఆటో తోలితే ఈయన ఆటో తోలాడు. జగన్‌ ఏ హామీ ఇస్తే ఈయన కూడా అదే ఫాలో అవుతున్నాడు.

చంద్రబాబు పాలనలో ఒక్క పథకంపై కూడా ఆయన బ్రాండ్‌ లేదు. ఎన్టీఆర్‌ అంటే 2రూపాయల బియ్యం, పక్కా ఇళ్ళు గుర్తుకొస్తాయి. వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డిని తలచుకుంటే ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు గుర్తుకొస్తాయి. ప్రజల కోసం చంద్రబాబు సొంతంగా రూపకల్పన చేసిన కార్యక్రమాలంటూ ఏమీ లేవు. వాళ్ళు వీళ్ళు పెట్టినవి కొనసాగించడమే ఆయన చేస్తున్న పని. చివరకు తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్‌ పథకాలను కూడా కాపీ కొట్టి ప్రజలకు టోపీ పెట్టాలని చూస్తున్నాడంటే ఈయనగారి 40ఏళ్ళ సీనియార్టీ ఏమైందనుకోవాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here