Home సంపాదకీయం కాంగ్రెస్‌కే కీలకం!

కాంగ్రెస్‌కే కీలకం!

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల సమరం కొనసాగుతోంది. మూడు రాష్ట్రాలలో ప్రధాన పోటీ బీజేపీ – కాంగ్రెస్‌ల మధ్యే ఉండబోతోంది. రెండు రాష్ట్రాలలో స్థానిక ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్సే పోటీపడుతోంది. ఎటుచూసినా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కే జీవన్మరణ సమస్య. 2019లో కేంద్రంలో ఎలాగైనా జెండా పాతి, రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్న సోనియాగాంధీ కలలకు ఈ ఎన్నికలు ఒక ఆశాకిరణం.

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం… ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలన్నీ ఒకెత్తు… అక్కడ కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా అది ఆ పార్టీ సొంతం. వీటిలో ఎక్కడ గెలిచినా స్థానిక బీజేపీ ప్రభుత్వాలపై వున్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ గెలిచినట్లే! కాని వీటికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం వుంటుంది. మహాకూటమి ప్రయోగానికి తెలంగాణ ఒక వేదికయ్యింది. ఇక్కడ బీజేపీ స్థానంలో టిఆర్‌ఎస్‌ అనే ప్రాంతీయ పార్టీ వుంది. అయితే ఆ ఒక్క ప్రాంతీయ పార్టీని దించడం కోసం కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిజెఎస్‌, సిపిఐ పార్టీలు కూటమి కట్టాయి. సీట్ల సర్దు బాటుకు దిగాయి. టిఆర్‌ఎస్‌పై కలిసికట్టు పోరాటానికి సిద్ధమయ్యాయి. తెలుగుదేశం పార్టీ పునాది సిద్ధాంత మైన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని హుస్సేన్‌సాగర్‌లో ముంచేసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు తెగించాడు. ఆ రెండు పార్టీల ప్రేమబంధం ఎంత బలమైనదో రేపు తెలంగాణ ఫలితాలలో తేటతెల్లం కాబోతోంది.

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఓ పక్క, మహాకూటమి మరోపక్క అధికారం కోసం పోటీపడుతుండగా మధ్యలో బీజేపీ సైతం అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలిపి ఆ రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా పోరాడుతోంది. తాము అధికారంలోకి రాలే మని ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. కాని వారి టార్గెట్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేయడం. ఇక్కడ టిఆర్‌ఎస్‌ తిరిగి గెలవడం బీజేపీ లక్ష్యం. ఇక ఎంఐఎం పాత్ర హైదరాబాద్‌ నగరానికి పరిమితం కానుంది. వాళ్ళకు టిఆర్‌ఎస్‌ గెలిచినా, మహాకూటమి గెలిచినా పెద్ద తేడా వుండదు.

2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్‌వాళ్లు చేతికి అధికారం వచ్చినట్లే భావించారు. అయితే వారి ఆశలను కేసీఆర్‌ అడియాశలు చేశాడు. తెలంగాణ ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి ఇచ్చిన మాటను ‘తూచ్‌’ అన్నాడు. దేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన ఎలిజబెత్‌ రాణిని ఎవరూ అనుకోలేదు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీనే ప్రజలు గౌరవించారంటూ లాజిక్‌లో మాట్లాడి కాంగ్రెస్‌ అధిష్టానానికి ఊహించని షాకిచ్చాడు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయ్యకుండా సొంతంగా పోటీకి దిగాడు. ఆంధ్రాను నిలువునా ద్రోహం చేసి తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టిచ్చినా కూడా ఆ రాష్ట్ర ప్రజలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కనికరించలేదు. 2014 ఎన్నికలలో అటు తెలంగాణలో వస్తుందనుకున్న అధికారం రాకపోగా, దేశంలోనే ఎంతో బలంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ మట్టిగొట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇక తెలంగాణలో ఆ పార్టీ మనుగడే కష్టంగా మారే అవకాశముంది. అందుకే ఎంతకు దిగజారైనా గెలవాలనే లక్ష్యంతో తెలుగుదేశంతో సైతం పొత్తు కుదుర్చుకుంది. అయితే ఈ పొత్తు ఫలితం రేపు ఓటింగ్‌లో ఎలా వుండబోతుందోగాని సీట్ల పంపకాలలో మాత్రం తేడా చూపించింది. పలుచోట్ల టిక్కెట్లు రాని కాంగ్రెస్‌ నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. మరికొందరు టిఆర్‌ఎస్‌, బీజేపీలలో చేరిపోయారు. ఇక తెలంగాణ ఎన్నికలు నాలుగున్నరేళ్ళ కేసీఆర్‌ పాలనకు రెఫరెండంగా మారనున్నాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. రేపు ఎన్నికల్లో ఆ ఫీలింగ్‌ వుండదు. కేవలం ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజాతీర్పు ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చి చూస్తే కేసీఆర్‌ ప్రభుత్వమే ఎంతో సమర్ధవంతంగా పనిచేసిందని చెప్పొచ్చు. ఒక్కసారి కూడా కేసీఆర్‌ సచివాలయానికి పోలేదు. ప్రగతిభవన్‌ నుండే పరిపాలన సాగించాడన్న అప వాదును పక్కనపెడితే, ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి విషయాలలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో బెటర్‌గా వుంది. ముఖ్యంగా చంద్ర బాబు ప్రభుత్వంపై వున్నన్ని అవినీతి, అక్రమాల ఆరోపణలు కేసీఆర్‌ ప్రభుత్వంపై లేవు. ఇచ్చిన హామీ లను కూడా చాలావరకు నెరవేర్చ గలిగాడు. అయితే కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి వుందన్న మాట వాస్తవమే. ఈ అసంతృప్తి టిఆర్‌ఎస్‌ను ఓడించేంత బలంగా వుందా? అన్నదే ప్రశ్న!

టీఆర్‌ఎస్‌కు అన్ని జిల్లాలలోనూ బలముంది. బలమైన నాయకత్వముంది. అయితే రాజధాని హైదరాబాద్‌లోనే ఆ పార్టీ కేడర్‌ ఎంత పటిష్టంగా వుందనేదానిపై అనుమానాలున్నాయి. 2014లోనూ హైదరాబాద్‌ సిటీలో ఆ పార్టీ జెండా ఎగరలేకపోయింది. గ్రేటర్‌లో సెటిలర్స్‌ ఎక్కువ. అందులోనూ ఆంధ్రులెక్కువ. కాబట్టి సహజంగానే కాంగ్రెస్‌, టిడిపి పార్టీలు బలంగా వుండేవి. కాని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎలక్షన్‌లలో పరిస్థితి పూర్తిగా మారడం చూసాం. సెటిలర్లు సైతం ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే జై కొట్టారు. కాబట్టే 99 సీట్లతో టిఆర్‌ఎస్‌ సొంతంగా మేయర్‌ సీటును కైవసం చేసుకోగలిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మారిన వాతావరణం రేపటి ఎన్నికల్లో కూడా అలాగే వుంటే ఇక టిఆర్‌ఎస్‌కు తిరుగుండదు. హైదరాబాద్‌ సిటీలో కనీసం 10సీట్లు సాధిస్తే 60 మెజార్టీ మార్క్‌ను దాటడం టిఆర్‌ఎస్‌కు పెద్ద సమస్య కాదు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం తదుపరి వచ్చే ఆంధ్రా ఎన్నికలపై తప్ప వుంటుంది. తెలంగాణలో కూటమి గెలిస్తే ఆంధ్రాలోనూ చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసే ముందుకుపోతాడు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ గెలిచిందో… చంద్రబాబు కాంగ్రెస్‌ చేతిని అప్పుడే వదిలేస్తాడు. జరగబోయేది ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here