Home సంపాదకీయం కాంగ్రెస్‌కు బాబుతోనే ముప్పు

కాంగ్రెస్‌కు బాబుతోనే ముప్పు

దేశ రాజకీయాలలో ఇప్పుడొక రియాల్టీ షో నడుస్తోంది. ఈ షోలో వివిధ పార్టీల అధినేతలే పాత్రధారులు. ఈ షోలో ఎవరి పెర్ఫార్మెన్స్‌ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అంతిమంగా అందరి లక్ష్యం ప్రధానమంత్రి పదవే! ఈ షోలో నటిస్తున్న మిగతా పాత్రధారులందరికీ కామన్‌ విలన్‌ ప్రధాని నరేంద్ర మోడీ!

ఈ రియాల్టీషోలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ యాక్షన్‌ చేస్తున్న నటుడు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జాతీయ రాజకీయాలన్నీ తన చుట్టూనే తిరుగుతుండాలనే తపనతో దేశంలోని అన్ని పార్టీల చుట్టూ తిరుగుతున్న నాయకుడు. చక్రం తిప్పుతానంటూ అందరిచుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రపంచ మేధావి.

దేవేగౌడ, గుజ్రాల్‌, వాజ్‌పేయి, నరేంద్ర మోడీలను నేనే ప్రధానులను చేసానని చెప్పుకు తిరిగే చంద్రబాబు, చివరకు కాంగ్రెస్‌తో జత కట్టాడు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ చంద్రబాబును నమ్మాడు. ఇంతమందిని దేశానికి ప్రధానులను చేసిన వాడిని, నిన్ను ప్రధానిని చేయలేనా? అని ఆయన రాహుల్‌తో అని వుంటాడు. డైరక్ట్‌గా ఇంత బంపర్‌ ఆఫర్‌ తగులుతుంటే ఎందుకు కాదనాలనుకుని రాహుల్‌ కూడా చంద్రబాబు ఆఫర్‌కు తలొంచాడు. కాంగ్రెస్‌ – తెలుగుదేశంల దోస్తీ కుదిరి గట్టిగా మూడు నెలలు కాలేదు. ఈ పాటికే కాంగ్రెస్‌ నాయకులకు ఒక విషయం అర్ధమైవుండాలి.

చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపక ముందు వరకు జాతీయ రాజకీయాలలో ప్రధాని మోడీకి ప్రధాన ప్రత్యర్ధి రాహుల్‌గాంధీనే! చంద్రబాబు ఎంటరయ్యాక పార్టీకొక ప్రధానమంత్రి తయార య్యారు. ప్రధాని రేసులో రాహుల్‌గాంధీని సైతం వెనక్కునెట్టేసే ప్రయత్నాలు బలంగా జరుగుతు న్నాయి. చంద్రబాబు జాతీయ రాజకీయాలలో వేలుపెట్టక ముందు ఎన్డీఏ, యూపిఏ కూటములు మాత్రమే వున్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ యూపిఏలో వున్నాయి. తటస్థంగా ఇంకొన్ని పార్టీలు వున్నప్పటికీ వాళ్ళు ఎన్నికల తర్వాత ఆనాటి పరిస్థితులను బట్టి ఏ కూటమికి మద్దతునివ్వాలన్నది నిర్ణయించుకుంటుంటారు. ఈ తటస్థ పార్టీలను మినహాయిస్తే మొన్నటి వరకు ఎన్డీఏనా, యూపిఏనా అన్నట్లు వాతావరణం నడిచింది. చంద్రబాబు వచ్చి దానిని కలబెట్టాడు. కాంగ్రెస్‌తో స్నేహం అంటూనే మూడో కూటమికి ప్రాణం పోసాడు. యూపిఏలో కొనసాగుతున్న పార్టీలను కూడా బయటకు లాగే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా దేశ రాజకీయాలలో 1996నాటి వాతావరణం సృష్టించాడు. ఆరోజు కాంగ్రెస్‌, బీజేపీలకు సంపూర్ణ మెజార్టీ రాని స్థితిలో చంద్రబాబు రంగంలోకి దిగి అప్పటికప్పుడు తృతీయ ఫ్రంట్‌కు రూపకల్పన చేశాడు. బీజేపీని గద్దెనెక్కకుండా చేయాలనే టార్గెట్‌తో కాంగ్రెస్‌ మద్దతుతో యూనైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్‌కు తొలి ప్రధానిగా దేవేగౌడను ఎంపిక చేశారు. ఆరోజు ప్రధానిగా చంద్రబాబుకు కూడా ఛాన్స్‌ వచ్చింది. కాని, ఆయన ఎంతో ముందుచూపుతో వద్దనుకున్నాడు. ఆరోజు ఆయన పిఎం అయ్యుంటే గట్టిగా ఓ సంవత్సరానికి దిగిపోయి వుండేవాడు.

ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో కనుమరుగైవుండేవాడు. నాడి తెలిసిన వాడు కాబట్టే ప్రధానిగా వెళ్ళలేదు. ఏపి రాజకీయాలకే పరిమితమయ్యాడు. దేవేగౌడను దించి ఐ.కె.గుజ్రాల్‌ను ప్రధానిని చేయడంలో కూడా ఆరోజు చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. అప్పట్లో తమ తమ రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు, ములాయంసింగ్‌యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, మాయావతి, మమత బెనర్జీ వంటి వాళ్ళు బిజీగా వున్నారు. కాబట్టి వాళ్లెవరూ అప్పుడు ప్రధాని పదవిపై ఆశపడలేదు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. వయసుపై బడడం మూలంగా గాని, లేదా రాష్ట్ర రాజకీయాలను చూసుకోవడానికి వారసులుండడం వల్లనైతేనేమీ, రాష్ట్ర రాజకీయాల నుండి ఇక జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కోరిక వల్లనైతేనేమీ చంద్రబాబుతో సహా మమతా, మాయావతి, శరద్‌పవార్‌, ములాయంసింగ్‌ వంటి నేతలంతా ప్రధానమంత్రి ‘క్యూ’లో వున్నారు. చంద్రబాబు కలబెట్టనంత వరకు వీళ్లెవరికీ ప్రధాని పీఠంపై ఆశలు లేవు. చంద్రబాబే వాళ్ళలో ఆశలు రేకెత్తించాడు.

గత రెండు మూడు నెలల్లో చంద్రబాబు చేసిన రాజకీయం అంతా కూడా కాంగ్రెస్‌కు నష్టం కలిగిం చేదే! చంద్రబాబుతో జతకట్టబట్టే తెలంగాణలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతటితో పోయిందా? తెలంగాణ ఎన్నికల విజయం తెచ్చిన ఊపుతో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ దేశ పర్యటన మొదలుపెట్టాడు. చంద్రబాబు పుణ్యమా అని ఎన్డీఏకు వ్యతిరేకంగా యూపిఏ కూటమితో కలిసి సాగాల్సిన పార్టీలన్నీ ఇప్పుడు చెల్లాచెదురవుతున్నాయి. రాహుల్‌ ఒక్కడే వుండాల్సిన ప్రధాని రేసులో ఆయనకు మరో అరడజను మంది తోడయ్యారు.

కాంగ్రెస్‌తో చేరి చంద్రబాబు చేసిందేమీ లేదు… యూపిఏలో వున్న పార్టీలను మూడో కూటమి పేరుతో బయటకు లాగి కాంగ్రెస్‌ను బలహీనపరిచాడు. ప్రధానిగా రాహుల్‌ను ఆయన ఇంతవరకు ఎక్కడా బలపరచలేదు. ఎన్నికల తర్వాతే కూటమి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామంటున్నాడు. కాంగ్రెస్‌ అధిష్టానం ఇక్కడైనా తెలివి తెచ్చుకోవాలి. చంద్రబాబును నమ్ముకుంటే వాళ్ళు నిండా మునిగిపోవడం ఖాయం.

ఈరోజు కూటమి అంటున్న చంద్రబాబు ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి, తన ప్రయోజనాలను బట్టి తిరిగి బీజేపీ గూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here