Home రాష్ట్రీయ వార్తలు కాంగెస్ర్‌ కపటనాటకం!

కాంగెస్ర్‌ కపటనాటకం!

ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకోండి… కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌గాంధీ చేసిన సూచన ఇది. ఏపిలో మనకు వైకాపానే ప్రధాన శత్రువు. రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఊమెన్‌చాందీ ఉక్రోషమిది.

రాజకీయాలలో విలువలు పాటించేవాళ్ళయినా, లేదా ప్రజల తరపున పోరాడేవాళ్ళయినా, అదీ కాదు అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళయినా అధికారంలో వున్న పార్టీని టార్గెట్‌ చేస్తారు. అధికార పార్టీపైనే యుద్ధం చేస్తారు. కాని, కాంగ్రెస్‌ నాయకులు ఆ పద్ధతిని వదిలేసారు. ప్రతిపక్షాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

దేశంలోనే కాంగ్రెస్‌కు తలా తోక లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి అంతకన్నా తలకాయ లేదనిపిస్తోంది. వీళ్ళ వింత చేష్టలు చూస్తుంటే కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్న ప్రధాని నరేంద్ర మోడీ కల సాకరమయ్యేందుకు ఎంతో దూరం లేదనిపిస్తోంది.

వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మీద కాంగ్రెస్‌ నాయకులు ఎంతగా కక్ష కట్టారనేదానికి వారి వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వై.యస్‌.జగన్‌ మీద కోపంతో కాంగ్రెస్‌ నాయకులు చంద్రబాబుకు సరెండర్‌ అయినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌-తెలుగుదేశంల మధ్య ఇటీవల కాలంలో సత్సంబంధాలు పరిఢవిల్లడం చూస్తున్నాం. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్‌కు కాస్తా దగ్గరయ్యింది. రేపు జాతీయ రాజకీయాలలో పరస్పర అవసరాల దృష్ట్యా స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లుగా వుంది. ఏపి కాంగ్రెస్‌ను మళ్ళీ బలోపేతం చేయాలని, పాత నాయకులందరినీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చెప్పి ఊమెన్‌ చాందీని అనే కేరళ నాయకుడిని ఏపికి ఇన్‌ఛార్జ్‌గా పంపారు. ఆయన ఊరు వాడ తిరుగుతూ పాత కాంగ్రెస్‌ నాయకులందరినీ కలుస్తున్నాడు. మాజీసీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిలాంటోళ్ళకు మళ్ళీ పార్టీ కండువాలు కప్పుతున్నారు.

ఏపిలో కాంగ్రెస్‌ బలోపేతం అనే ప్రక్రియకు చంద్రబాబే డైరెక్టర్‌ అని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైన ఓట్లకు ఈసారి బీజేపీ, జనసేనలు గండి పెట్టనున్నాయి. ఈ లోటును పూడ్చుకోవాలంటే వైసిపి ఓట్లలో చీలిక తేవాలి. ఇందుకు కాంగ్రెస్సే సరైన మార్గం. రాష్ట్రంలోని 175స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడితే ఆ పార్టీ ఓట్లు వైకాపాకు పోకుండా నిలువరించవచ్చన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే కాంగ్రెస్‌ను ఆ దిశగా అప్రమత్తం చేసాడు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్‌ వుండదని, దాని స్థానంలో తిరిగి కాంగ్రెస్‌ బలం పెంచుకోవచ్చని, అలా కాకుండా ఆ పార్టీ గెలిచి లోక్‌సభలో, అసెంబ్లీలో మెజార్టీ సీట్లు సాధిస్తే ఇక కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో చోటుండదని, అదీగాక ఆ పార్టీకి వచ్చే లోక్‌సభ సీట్లు కూడా కేంద్రంలో బీజేపీకే ఉపయోగపడతాయని చంద్రబాబు నూరిపోయడంతో కాంగ్రెస్‌ నాయకులు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏపిలో సరికొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here