Home జిల్లా వార్తలు కస్తూరిదేవి విద్యాలయంపై.. గాలి రాతలు, గేలి వ్యాఖ్యలు, నిరాధార నిందలు

కస్తూరిదేవి విద్యాలయంపై.. గాలి రాతలు, గేలి వ్యాఖ్యలు, నిరాధార నిందలు

కస్తూరిదేవి విద్యాలయాన్ని భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా పెట్టుకున్న పాత పేపరు మరోసారి విషం కక్కింది. గాలి రాతలు, గేలి వ్యాఖ్యలు, నిరాధార నిందనలతో చెత్త కథనాలను ప్రచురించడమే కాకుండా పచ్చి అబద్దాలతో తప్పుడు ఫోటోలతో ”ఆస్తుల ఆరగింపు ప్రారంభం” అంటూ మోసపూరిత వార్తలతో నెల్లూరీయుల చెవిలో మళ్ళీ పువ్వు పెట్టే ప్రయత్నం చేసింది.

కస్తూరిదేవి విద్యాలయానికి దక్షిణం వైపు వున్న 3ఎకరాల స్థలాన్ని ఎప్పుడో 40ఏళ్ళ క్రితమే అప్పటి కమిటి లీజుకిచ్చేసింది. ఆ స్థలంలోనే ప్రస్తుతం కస్తూరిభా కళాక్షేత్రం, ఎ.ఎల్‌.రావ్‌ కళ్యాణ మండపం, వింటేజ్‌ హోటల్‌, అచ్యుత సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపం, రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు భారత్‌ పెట్రోలియం వారి పెట్రోల్‌ బంకు ఏర్పడ్డాయి. అయితే కొత్తగా ఇప్పుడేదో జరిగిపోయిందంటూ ఆగం చేస్తోంది పాత పేపరు.

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు 20సంవత్సరాల పాటు లీజుకి స్థలాన్ని కేటాయిస్తూ జనవరి 1, 1988న అప్పటి కమిటి తీర్మానించి సదరు లీజును అగ్రిమెంట్‌ ద్వారా రిజిష్టర్‌ కూడా చేసింది. వాస్తవానికి ‘పెట్రోల్‌ బంక్‌’ వుండాలంటే సంస్థ నిబంధనల ప్రకారం 15,000 చదరపు అడుగులు వుండాలి. అయితే 1991లో జరిగిన రోడ్డు విస్తరణలో భాగంగా ఈ సంస్థకు లీజుకి ఇచ్చిన స్థలంలో దాదాపు 2,500 చదరపు అడుగులు రోడ్డులోకి వెళ్లిపోయింది. అప్పటి నుండి భారత్‌ పెట్రోలియం పెట్రోల్‌ బంకును ఆనుకుని వున్న మరో 3,504చదరపు అడుగుల స్థలాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కమిటికి దరఖాస్తు చేస్తూ వచ్చింది. 2006వ సంవత్సరంలో కమిటీపై తీవ్ర వత్తిడి తేవడంతో అప్పటి కమిటి 2006 అక్టోబర్‌ 17న సమావేశమై భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇచ్చిన 20సంవత్సరాల లీజు ముగింపు దశకు చేరడంతో 13,426 చదరపు అడుగుల లీజును మరో 30సంవత్సరాలు పొడిగిస్తూ దానికి అనుబంధంగా 3,504 చదరపు అడుగుల స్థలాన్ని అంతే కాలం పాటు లీజుకిచ్చునట్లుగా తీర్మానించారు. ఆనాటి సమావేశంలో అప్పటి కమిటి సెక్రటరి మరియు కరస్పాండెంట్‌ జె.వి.రెడ్డితో పాటు శ్రీమతి నందనారెడ్డి, శ్రీమతి మాగుంట పార్వతమ్మ, శ్రీమతి డేగా అనురాధమ్మ, శ్రీమతి యడ్లవల్లి అమృతవల్లిలు పాల్గొని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానం ఆధారంగా డాక్యుమెంట్‌ నెం.023601/21.11.2006న రిజిష్టర్‌ ఆఫీసులో లీజు అగ్రిమెంటును రిజిష్టర్‌ కూడా చేశారు.

సదరు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వారు ఈ స్థలాన్ని వాడుకుని తమ పెట్రోల్‌ బంకును విస్తరింపచేయడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకుని ప్రస్తుతం ఆ స్థలాన్ని వాహనాల పార్కింగు కోసం వినియోగించుకుంటున్నారు. రెండేళ్ళ క్రితం కురిసిన భారీ వర్షాలతో ఇక్కడ ప్రహరీ కూలిపోవడంతో రేకులను అడ్డం పెట్టుకుని సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థలం ఫోటోని పాతపేపరు ప్రచురించి ఆ స్థలంలో నుండి వెనుక నిర్మాణాలకు దారిని కేటాయించే ప్రయత్నాలను కమిటి మొదలుపెట్టిందంటూ దుర్మార్గపు రాతలు వ్రాసింది. అసలు ఈ స్థలం నుండి వెనుకవైపు వున్న భవనాలకు దారి ఎలా వస్తుందో దిగువ ప్లాన్‌ను గమనిస్తే పామరుడికైనా అర్ధమైపోతుంది.

మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం నుండి పోలీస్‌ ఆఫీసుకు వెళ్ళే రాజమార్గాన్ని వదిలి సదరు లీజుదారులు అరకోటి ముడుపులిచ్చి దొడ్డిదారిని ఎందుకు అడుగుతారో ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఇలా నిస్సిగ్గుగా గాలిరాతలు వ్రాస్తున్న పాత పేపరుకే తెలియాలి. అందరూ ఈ పత్రికలాగే దొడ్డిదారులే వెదుకుంటారన్నది ఆ పత్రిక ఆలోచన కాబోలు.

క్రిమినల్‌ మైండ్‌ ఎవరిది..?

పేపరు ప్రచురణ కోసం ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్మించుకోడం కొరకు 1991లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి దర్గామిట్టలోని నిప్పో ఫ్యాక్టరీ సమీపంలో ఒకటిన్నర ఎకరా స్థలం ఇస్తే… ఎప్పుడో రిజిష్టర్‌ అయిన ఈ పాతపేపరు ట్రస్టు డీడ్‌ నెంబర్‌ను ఈ స్థలం యొక్క రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లింకు డాక్యుమెంటుగా చూపించి అమ్మేసుకుని… మొత్తం సొమ్మునంతా గుటకాయస్వాహా చేసి యావత్‌ పత్రికా రంగమే సిగ్గుపడేలా చేసిన క్రిమినల్‌ మైండ్‌ నీదా..? లేక స్వయంకృషితో పైకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో నెల్లూరు పేరును మారుమ్రోగించి, ”పద్మ” అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన జి.వి.కె.రెడ్డిదా..? మేధావులైన నెల్లూరీయులు బాగా ఆలోచించుకోగలరు. ఎవరి స్థాయి ఏ పాటిదో.. ఎవరి మైండ్‌ ఎలాంటిదో… అర్ధం చేసుకోగలరు.

దొడ్ల శేషారెడ్డి లాంటి పెద్దమనిషిని విమర్శించే అర్హత ఆ పేపరుకు ఉందా..?

జిల్లాలో కోట్ల రూపాయలు దానం చేసిన కుటుంబం దొడ్ల వారిది. అజాతశత్రువుగా, నీతి నిజాయితీలకు నిలువెత్తు సాక్ష్యంగా, సౌమ్యుడిగా, మృధుస్వభావిగా పేరు పొందిన వ్యక్తి దొడ్ల శేషారెడ్డి. అలాంటి దొడ్ల శేషారెడ్డి సెక్రటరీ, కరస్పాండెంట్‌గా వున్న సంస్థలో అక్రమాలు, ఆక్రమణలు జరిగితే ఆయన సహిస్తాడా? సహకరిస్తాడా? అన్న కనీస ఆలోచన కూడా ఆ పాతపేపరుకి లేదు. అలాంటి వ్యక్తులను గురించి వారి పేరైనా ఉచ్ఛరించే అర్హత ఆసలు ఈ పేపరుకుందా..?

పాత పేపరు నిబద్ధత ఏపాటిదో అందరికీ తెలుసు…

దానాలకు, ధర్మాలకు మారుపేరైన మాగుంట కుటుంబ సభ్యురాలైన మాగుంట పార్వతమ్మ ఇచ్చిన వివరణ ప్రకటనను ప్రచురించుకుని ”కూలి” తీసుకున్న పాతపేపరు నిబద్ధత, నైతికత, ఆ పేపరు ఆరోపణలలోని విశ్వసనీయత ఏపాటిదో ఆలోచించుకోలేని అమాయకులు కాదు నెల్లూరీయులు.

బిస్కట్లు, కుక్కలు అంటూ నీచాతి నీచమైన పదజాలంతో రెచ్చగొట్టే స్థాయిలో గాలి రాతలు వ్రాస్తున్న పాతపేపరు ధ్యేయం నిజంగా కస్తూరిదేవి పరిరక్షణేనా లేక కేవలం జి.వి.కె.రెడ్డిని, కస్తూరిదేవి కమిటి సభ్యులని పదేపదే విమర్శించి తాను కోరిన గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడమే అసలు లక్ష్యమా… అనే అనుమానం ఎవరికైనా రాక మానదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here