Home సినిమా వార్తలు కళ్ళ నుండి కాదు… గుండె నుండి కన్నీళ్ళు!

కళ్ళ నుండి కాదు… గుండె నుండి కన్నీళ్ళు!

దాదాపు 20ఏళ్ళ క్రితం నాజర్‌, మాధవి ప్రధానపాత్రలలో ‘మాతృదేవోభవ’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు కఠిన హృదయం వున్నోడైనా కన్నీళ్ళు కార్చక తప్పదు. అంత ఎమోషన్స్‌ వున్న సినిమా అది. రక్తసంబంధాలతో గుండెలను మెలిపెట్టేలా అల్లిన కథతో తీసిన సినిమా అది. ఆ సినిమాలో కథ సృష్టించింది. కాబట్టి ఎమోషన్స్‌ సన్నివేశాలను ఎంతవరకైనా తీయొచ్చు. ప్రేక్షకులను ఎంత దాకైనా ఏడిపించొచ్చు.

కాని, సృష్టించిన కథతో కాకుండా జరిగిన సంఘటనలతో ఒక ప్రజానాయకుడి వ్యవహారశైలిని సినిమాగా తీసి తెరకెక్కిస్తే… చూసే ప్రతిఒక్కరూ కన్నీళ్ళు కార్చడం ఎక్కడైనా వుంటుందా? అదే జరుగుతోంది. దివంగత మహానాయకుడు డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి 2013లో చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన ‘యాత్ర’ సినిమా థియేటర్‌లో ప్రతిప్రేక్షకుడి గుండెలను పిండేస్తోంది. సినిమాలోని కొన్ని సంఘటనలలో ప్రేక్షకులకు కళ్ళల్లో నుండి కాదు గుండెల నుండే కన్నీళ్ళు కారుతున్నాయి. అంతటి సెంటిమెంట్‌ ఎమో షన్స్‌తో ‘యాత్ర’ జైత్రయాత్రగా కొనసాగుతోంది.

‘యాత్ర’ సినిమా రిలీజ్‌ కాకముందు దీనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన ‘మహానటి’ సినిమా విజయవంతమైంది. అయితే ఆ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా వుంది. ఇటీవలే బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ‘కథానాయకుడు’ పేరుతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించడం పెద్ద మైనస్‌. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఎన్టీఆర్‌ బయోపిక్‌… అందులోనూ బాలకృష్ణ వంటి పెద్ద నటుడు తీస్తేనే ఆ సినిమా అడ్రస్‌ లేకుండా పోయింది. మరి వై.యస్‌.రాజశేఖరరెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఏ మాత్రం ఆడుతుందోనని అందరూ భావించారు.

కాని, అందరి అంచనాలను ‘యాత్ర’ తారుమారు చేసింది. అగ్రనటులు నటించిన సినిమాలకు కూడా సాధ్యంకానటువంటి విజయాన్ని అందుకుంది. ఒకసారి చూసిన ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తుండడంతో మంచి కలెక్షన్‌లతో ఈ యాత్ర విజయ యాత్రగా దూసుకుపోతోంది.

సినిమా దర్శకుడు మహి వై.యస్‌.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను మొత్తం తీసుకోలేదు. వై.యస్‌. రాజకీయ జీవితంలో ఆయనను నాయకుడి నుండి ప్రజానాయకుడు, మహానాయకుడిగా మలచిన కాలాన్ని మాత్రమే తీసుకుని సినిమాను రూపొందించారు. ఫ్లాష్‌బ్యాక్‌ను కేవలం ఒక ట్రెండు సంఘటనలకు మాత్రమే పరిమితం చేశారు.

2004కు ముందు సంఘటనలతో చిత్రం ప్రారంభ మవుతుంది. ప్రారంభంలోనే గౌరుచరిత సన్నివేశం పెట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఉపఎన్నికల్లో ఆమెకు కాకుండా ఆమె ప్రత్యర్థికి సీటు ఇవ్వాలని నిర్ణయిస్తుంది. ఆ టైంలో గౌరు చరిత రాజశేఖర్‌రెడ్డి ఇంటికొచ్చి సాయం కోరుతుంది. నేను చస్తే కదమ్మా నువ్వు భయపడాలి… నేనుండగా నీకెందుకు భయం. వెళ్లి నామినేషన్‌ పత్రాలు రెడీ చేసుకో… అని రాజశేఖరరెడ్డి అభయమిస్తాడు. ఆ సమయంలో వై.యస్‌. అనుచరుడు… అన్నా, వాళ్ళ నాయన బ్రతికున్నంత కాలం మన నాశనం కోరాడు. ఇప్పుడు మనం సాయం ఎలా చేస్తామన్నా అంటే… మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా అని రాజశేఖరరెడ్డి అంటారు. ఆ తర్వాత కదిరి సీటు విషయంలో అధిష్టానంకు వై.యస్‌.రాజశేఖరరెడ్డికి మధ్య జరిగే వాదనలు, సన్నివేశాలు అద్భుతంగా సాగుతాయి. గౌరు చరిత చేత రాజశేఖరరెడ్డి స్వయంగా నామినేషన్‌ వేయించడం, వై.యస్‌. మీద గౌరవంతో కాంగ్రెస్‌ అధిష్టానం నిలబెట్టాలనుకున్న సుబ్బారెడ్డి నామినేషన్‌ గడువు అయిపోయాక వచ్చి రాజశేఖరరెడ్డిని కలవడం వంటివన్నీ… ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరించిన రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తాయి.

అలిపిరి దాడి తర్వాత సానుభూతిని సొమ్ము చేసుకోవచ్చనే ఉద్దే శ్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తాడు. అప్పటికి కాంగ్రెస్‌ ఎన్నికలకు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మనం గెలవడం కష్టమేనన్న కెవిపి రామచంద్రరావుతో… అలాగైతే ఏం చేద్దాం క్యాప్‌స్టన్‌… రాజకీయాలు వదిలేద్దామా అని వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఎంతో ఆవేదనతో చెబుతాడు. ఇదే విషయాన్ని ఆయన తన పులివెందుల ప్రజలతో చర్చిస్తాడు. ఇప్పటిదాకా మనం పదవుల కోసం పోరాడాం… మనకేం కావాలో తెలుసుకున్నాం కాని, ప్రజలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. అందుకే ప్రజల్లోకి వెళ్లాలని వుంది… ప్రజల గుండెచప్పుడు వినాలని వుంది… అంటూ ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుడుతారు. చేవెళ్ల నుండి పాదయాత్ర మొదలై 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం, వై.యస్‌. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వంటి సంఘటనలతో సినిమా సాగుతుంది. అప్పటి దాకా చిత్రంలోని పాత్రలతో సన్నివేశాలు నడుస్తాయి. ఆ తర్వాత 2009లో మళ్ళీ కాంగ్రెస్‌ గెలవడం, వై.యస్‌. తిరిగి ముఖ్యమంత్రి కావడం, హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించడం, వై.యస్‌. లేడని తెలిసి వందలాది గుండెలు ఆగిపోవడం, వై.యస్‌. భౌతిక కాయాన్ని మట్టిలో మమేకం చేయడం వంటి సంఘటనలన్నీ రెండు నిముషాల నిడివిలో ఒరిజినల్‌ వీడియోలే ప్రదర్శించారు.

ఈ సినిమా ప్రధాన ఇతివృత్తాంతం పాదయాత్ర. దాని మూలంగా పుట్టుకొచ్చిన ప్రజాసంక్షేమ పథకాలు. చేవెళ్ల నుండి పాదయాత్రను ప్రారంభిద్దామన్న వై.యస్‌.తో… అన్నా అక్కడ నుండి వద్దు… మాలాంటి వాళ్ళు అశుభం… మీరు తాండూరు నుండి మొదలుపెట్టండని సబితా ఇంద్రారెడ్డి సూచిస్తుంది. దానికి వై.యస్‌… దొంగతనాలు చేయాలంటే ముహూర్తాలు, శకునాలూ చూసుకోవాలి గాని మంచిపని చేయాలంటే ఇవన్నీ ఎందుకమ్మా, మనం చేవెళ్ల నుండే మొదలుపెడుతున్నాం అంటూ వై.యస్‌. అన్న మాటలు మానవతకు ప్రతీకగా నిలుస్తాయి. తన ఇంటి కొచ్చి భోజనం చేయమన్న ఓ పెద్దావిడ ఇంటికెళ్లి వై.యస్‌. అన్నం తినడం, తన దగ్గర పని చేసే పోలీసు బాషాను తన సంతకం ఫోర్జరీ చేసాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్‌ చేస్తే… అతని కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం, తాను అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వున్నప్పుడు ఓ చిన్నారి గుండెజబ్బుతో చనిపోవడం చూసి ఆయన చలించిపోవడం, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ కార్పొరేట్‌ వైద్యం చేయిస్తానని హామీ ఇవ్వడం, ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఏదో చెప్పబోతుంటే… ఆయన చెప్పేది వినపడవు సార్‌ అని డాక్టర్‌ అంటే, నాకు వినపడుతుందయ్యా అని వై.యస్‌. అనడం, ఇంజనీరింగ్‌ చదవాలని తన వద్దకొచ్చిన వారితో మా ప్రభుత్వం వస్తే ‘సీటు కోసం కాలేజీలో కలువు… రాకపోతే నన్ను కలువు’ అని చెప్పడం వంటి మాటలు ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకుతాయి. ”నేను విన్నాను.. నేను ఉన్నాను” అనే డైలాగ్‌ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. వై.యస్‌.రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వానికి, ఆయనలోని మానవత్వానికి ఈ సినిమా ప్రతిరూపంగా నిలుస్తుంది.

ఇక రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించడం కాదు, అట్టే ఒదిగిపోయాడు. ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. కె.వి.పి.రామచంద్రరావుగా రావు రమేష్‌, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, గౌరు చరితగా అనసూయ… ఇలా ఇంకా పలువురి పాత్రలను చిన్న నటులతోనే వేయించి అతిపెద్ద విజయాన్ని అందుకుంది ‘యాత్ర’ సినిమా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here