Home సినిమా వార్తలు కలుపుకు పోవడమే… కేసీఆర్‌ వ్యూహం

కలుపుకు పోవడమే… కేసీఆర్‌ వ్యూహం

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీని ఓడించడమే లక్ష్యమంటూ ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తేవాలని చూస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన విలువలను సైతం వదిలేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పునాది సిద్ధాంతాలకు పాతరేస్తున్నాడు.

కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. మమతాబెనర్జీని ప్రసన్నం చేసుకున్నాడు. ములాయంసింగ్‌కు మోకరిల్లాడు, స్టాలిన్‌కు భజన చేసాడు, దేవేగౌడ, కుమారస్వామిలను కౌగిలించుకున్నాడు, శరద్‌పవార్‌ శరణుకోరాడు, ఫరూక్‌ అబ్దుల్లాతో ఫ్రెండ్షిప్‌ బ్యాండ్‌ కట్టించుకున్నాడు, మాయావతిని మచ్చిక చేసుకున్నాడు… అయితే చంద్రబాబు ఇంత చేసాడు. కాని రేపు వీళ్ళంతా ఇలానే కలిసుంటారా… నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు సొంతంగా కనీసం 200కు పైగానే సీట్లు రావాలి. కాంగ్రెస్‌ కంటే దాని భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి… మమతాబెనర్జీ, మాయావతి, ములాయంసింగ్‌, శరద్‌ పవార్‌… వీళ్ళంతా ప్రధాని రేసులోకి వచ్చేవాళ్ళే! వీళ్ళ మధ్య ఇక చంద్రబాబు వూరుకుంటాడా? 40ఏళ్ళ ఇండస్ట్రీ అయిన తనకూ ప్రధాని పదవి కావాలంటాడు.

అయితే చంద్రబాబు మహాకూటమికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతకుముందే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశాడు. కాని, జాతీయ రాజకీయాలలో మిగతా పార్టీల నాయకులతో చంద్రబాబుకు వున్నంతగా సంబంధాలు కేసీఆర్‌కు వుండవు. కాబట్టే మిగతా పార్టీల నుండి ఆయనకు అంతగా సహకారం అందలేదు. జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలని చంద్రబాబు మహాకూటమి కడితే, కేసీఆర్‌ మాత్రం జాతీయ రాజకీయాలలో తెలుగు రాష్ట్రాలకు మునుపటి ప్రాధాన్యత ఉండేలా, దానికి తానే సారధ్యం వహించేలా చూస్తున్నాడు. ఇందుకోసం ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని అమలుచేస్తున్నాడు. ఏపిలో 25లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. నిన్నటి తెలం గాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. రేపు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఫలితాలు అదేవిధంగా వుండొచ్చు. ఇక టిఆర్‌ఎస్‌తో ఎంఐఎం కలిసే వుంది. తెలుగు రాష్ట్రాలలో మరో ప్రధాన పార్టీని కలుపుకోవాలి. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామన్న చంద్ర బాబు ప్రతిపాదనను కేసీఆర్‌ తిరస్కరిం చాడు. చంద్రబాబుతో వాళ్ళు గనుక పొత్తు పెట్టుకుని వుంటే నిన్నటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సొంతంగా ప్రజాబలం మీద గెలిచినా, టిఆర్‌ఎస్‌ను నేనే గెలిపించానని చంద్రబాబు డప్పు వాయించుకుని వుండే వాడు. ఆ ముప్పు నుండి తప్పించుకున్నారు టిఆర్‌ఎస్‌ వాళ్ళు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో వేలు పెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు కూడా జాతీయ రాజకీయాలను ఓ తిప్పు తిప్పాలనే ఆత్రం వుంది. ఒకేరకమైన ఆలో చన చేసే వీరిద్దరికీ ఏ మాత్రం పొత్తు పొసగదు. అందుకే కేసీఆర్‌ తెలుగుదేశం కంటే కూడా ఏపిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అందుకు మిత్రపక్షంగా భావిస్తు న్నాడు. జగన్‌కు జాతీయ రాజకీయాలతో అవసరం లేదు. అతనికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యం. ఏపికి ప్రత్యేకహోదా రావడం ప్రధానం. ఏపి అభివృద్ధి ముఖ్యలక్ష్యం. కాబట్టి జగన్‌తో కేసీఆర్‌కు సమస్య లేదు. ఏపికి ప్రత్యేకహోదా విషయంలో చంద్ర బాబు కంటే కేసీఆర్‌ క్లారిటీతో వున్నాడు. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పివుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. ఏపి నుండి జగన్‌ను కలుపుకుని పోవాలంటే ఏపి అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలకూ కేసీఆర్‌ మద్దతునివ్వక తప్పదు. కేసీఆర్‌ కూడా ఆ విధమైన సాను కూల ధోరణినే కనపరుస్తున్నాడు కూడా!

2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసిపితో కలుపుకుని తమ మూడు పార్టీలు 30 నుండి 35సీట్లు దాకా సాధిస్తాయని కేసీఆర్‌ అంచనా! ఈసారి ఎన్డీఏ, బీజేపీయేతర పార్టీల కూటమి మధ్య హోరాహోరీగా పోరు నడిచి ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు తమ ఫెడ రల్‌ ఫ్రంట్‌ సీట్లు కీలకంగా మారుతాయని, తెలుగు రాష్ట్రాలలోని పార్టీలకు మళ్ళీ ప్రాధాన్యత లభిస్తుందని కేసీఆర్‌ అంచనా! అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైసిపిని కలుపుకుపోవాలని చూస్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా రాజకీయాల లోనూ ఆయన కలుగజేసుకుంటామని, చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించాడు. ఆయన చెప్పే రిటర్న్‌ గిఫ్ట్‌ వైసిపి గెలుపు, టిడిపి ఓటమే! దాని కోసం ఆయన ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాడన్నది సస్పెన్స్‌!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here