Home జిల్లా వార్తలు కమ్ముకొచ్చిన కరువు

కమ్ముకొచ్చిన కరువు

జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాలు కురవక సాగునీరు లేక పంటల పరిస్థితి అయోమయంలో పడింది. రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో రైతులు దిగులుపడిపోతున్నారు. మబ్బులు కూడా రైతుల్ని ఉళకాడిస్తున్నాయే తప్ప కరుణించడం లేదు. ప్రతిరోజూ నల్లగా.. దట్టంగా కనిపిస్తాయి కానీ వాటినుంచి మాత్రం నీటి చుక్కలు రాలడం లేదు. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావులు అన్నీ ఎండిపోయి భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. ఇక పంటలు ఎలా పండాలి?.. జీవితాలు ఎలా గడవాలి?.. అనుకుంటూ రైతులు రోజురోజుకీ డీలాపడిపోతున్నారు.

జిల్లాలో ఈ రబీ సీజన్‌లో కనీసం 5 లక్షల ఎకరాలకు పైగానే రైతులు సాగుచేయాల్సి ఉండగా, సాగునీటి కొరతతో ఆ మేరకు సేద్యం జరుగుతుందో లేదో తెలియడం లేదు. ఇప్పటికి ఉన్న నీరు రెండు లక్షల ఎకరాలకు కూడా సరిపోయే పరిస్థితి లేదని అధికారులే చెప్తున్నారు. సోమశిల ప్రాజెక్టు నుంచి మూడన్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని పాలకులు ధీమాగా చెప్తున్నా ఆచరణలో అది వీల య్యేట్లు కనిపించడం లేదు. నవంబర్‌ నెల చివరికి వచ్చినా.. ఆశించిన మంచి వానలు కురవక పోవడంతో సేద్యం పనులు మొదలుపెట్టాలనుకున్న రైతులంతా ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. గత ఏడాది ఎలాగో కష్టపడి ఇదే సీజన్‌లో ఒకటిన్నర లక్షల ఎకరాలను రైతులు సాగుచేశారు. కానీ ఈ సారి 5వేల ఎకరాల్లో కూడా సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లోనే సాగునీరు సక్రమంగా లేక క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఇప్పుడు రబీలో సాగునీరు ఎక్కడినుంచి వస్తుందో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట ప్రాంతాలన్నీ అధికశాతం వర్షాధారంగా పంటలు పండించుకుంటున్నాయి. వానలు కురవకపోతే అక్కడ పంటలు ఈసారి కూడా అంతే సంగతులు!

సాగునీటికీ..తాగునీటికీ కరువే!…

జిల్లాలో కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం జిల్లాలోని 46 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకున్నదే తప్ప రైతులకు ఎలాంటి అండదండ లందించడం లేదు. రబీ వ్యవసాయ సీజన్‌ దాటిపో తుండడంతో ఎలాగైనా సరే పంటలు పండించుకోవా లని, అప్పోసప్పో చేసైనా సేద్యం పనులు చేయాలని అనుకున్నా నిరుపేద రైతులకు సాధ్యం కావడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వక తిప్పుకుంటుం డడంతో అనేకమంది రైతులు దిగులుతో కుదేలైపో తున్నారు. అటు ప్రభుత్వం కానీ ఇటు జిల్లా అధికారగణం కానీ రైతుల దయనీయస్థితిని నిర్లి ప్తంగా చూస్తున్నాయే తప్ప పట్టించుకోవడం లేదు. రైతన్న సంక్షేమమే ధ్యేయం అంటూ నాయకులు గొప్పగా ప్రకటించుకుంటున్నారే తప్ప ఆచరణలో రైతులకు అన్ని పథకాలూ ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అన్నదాతల కష్టాలను వినేవారే లేరు..ఆర్చేవారూ తీర్చేవారూ అసలే లేరు. వర్షాభావంతో పంటలు వేసుకోలేని పేద, మధ్యతరగతి రైతుల బతుకుజీవనం ప్రశ్నార్థకంగా మారినా ప్రభుత్వంలో దయ కలగడం లేదని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలో ఒక్క సాగునీటికే కాక తాగునీటికి కూడా కరువు ఏర్పడు తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాలు త్రాగునీటి కోసం అల్లాడుతూనే ఉన్నాయి. నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప రైతు కంటనీరు తుడిచేవారెవరూ కనిపించడం లేదు.

నీళ్ళు లేని చెరువులు..

వర్షాభావంతో జిల్లాలో ఈ ఏడాది కూడా పంట పొలాలు నీరందక పూర్తిగా ఎండిపోయే దుస్థితి ఏర్ప డింది. జిల్లాలో 1881 చెరువులు ఉండగా, వాటిలో 95 శాతం పైగా చెరువులు నీళ్ళు లేక ఎండిపోయి బీటలువారాయి. చివరికి అల్పపీడనాల వల్లనో తుఫాన్ల వల్లనో ఏదోవిధంగానైనా వాన కురుస్తుందేమోనని అని రైతులు ఆశపడి ఎదురుచూసినా అవికూడా వచ్చీరానట్లుగానే ఆటాడిస్తున్నాయే తప్ప జోరు వానలు అంతంతమాత్రమే. ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి వాన జల్లు కురిసినా ఎండిపోయిన చెరువుల్లో ఆ నీరు ఏమాత్రం నిలవడం లేదు. జిల్లాలోని చెరువులకు పూడిక తీసి ఎంతకాలమైందో ఏలినవారికే తెలియాలి. చెరువుల్లో గుంటలేమైనా ఉంటే వాటిల్లో ఉన్న కొద్దిపాటి బురదనీళ్ళలో గుర్రపుడెక్క మొలిచిపోయి ఉంటుందే తప్ప ఆ నీరు దేనికీ పనికిరావడం లేదు. చెరువులు, కాలువలు అనేక ప్రాంతాల్లో గుర్రపుడెక్క ఆకులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

ఇకనైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఈ దుస్థితిని గమనించి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు, అన్నదాతలకు చేయూత నందిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here