Home రాష్ట్రీయ వార్తలు కత్తి దూయాల్సింది ఎవరి మీద?

కత్తి దూయాల్సింది ఎవరి మీద?

ఏదైతే తరతరాలుగా వస్తున్న ఓ విష సంస్కృతిని అంతం చేయాలనుకుంటున్నామో, ఏ సంస్కృతి వల్ల అయితే సమాజంలో భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తుతున్నాయో, ఏ అనాగరిక చర్యల వల్ల అయితే కొన్ని వర్గాలవాళ్ళు సమాజంలో కలిసిపోలేక విదేశీ సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారో… ఏ దురహంకారం వల్ల ఈ మతం నాది కాదని విద్వేషం పెంచుకుంటున్నారో… అదే సంస్కృతి, అదే అనాగరిక చర్య, అదే అగ్రవర్ణ అహంకార ధోరణి ‘కత్తి మహేష్‌’ అనే

సినీ క్రిటిక్‌ విషయంలోనూ పునరావృతమైంది. ఈ చర్య సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేదిగా వుండకపోగా అలనాటి అగ్రవర్ణ దురహంకార ఛాయలకు అద్దంపడుతోంది.

”కత్తి మహేష్‌”… గత కొన్నిరోజులుగా తెలంగాణలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిల కన్నా, ఏపిలో జగన్‌, పవన్‌ల కన్నా పాపులర్‌గా వినపడుతున్న పేరు. అయితే ఈయనగారు ఒలం పిక్స్‌లో దేశానికి గోల్డ్‌మెడల్‌ సాధించడం ద్వారానో, ప్రపం చంలోని ఎత్తైన పర్వతాలన్నిం టిని అధిరోహించడం ద్వారానో, సరిహద్దులో పాతికమంది

ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారానో పాపులర్‌ కాలేదు.

ఒక మనిషి సమాజంలో ఫోకస్‌ కావాలంటే రెండు మార్గాలుంటాయి. మొదటిది ఏ రంగంలోనైనా రాణించి కీర్తిప్రతిష్టలు పొందడం. ఈ విధంగా రాణించాలంటే కఠోర సాధన, నిరంతరం పోరాటం చేయాలి. దీనికి చాలాకాలం పడుతుంది! అలాకాకుండా తొందరగా ఫోకస్‌ కావడానికి అడ్డదారులుంటాయి. ఈ రెండో మార్గంలో సమాజంలో అలజడి సృష్టించే పనులు చేస్తే చాలు… త్వరగా ఆయన పేరు ఫోకస్‌లోకి వస్తుంది. ఇలాంటి అడ్డదారిని ఎంచుకున్న వ్యక్తే కత్తి మహేష్‌!

గతంలో టివి9 న్యూస్‌ ఛానెల్‌ వేదికగా సినీహీరో పవన్‌కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని గెలికి చాలారోజులు మీడియాకు 24గంటలూ పనిపెట్టాడు. అది పాతబడిపోయిందనుకున్న తరుణంలో ఈసారి ఏకంగా కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడికే విమర్శల బాణం ఎక్కుపెట్టాడు. రాముడిలో రామాయణంలో అతనికి ఏవన్నా లోపాలు కనిపిస్తే వాటిపై చర్చిస్తే సరే… ఏకంగా రాముడిని తూలనాడాడు. సీతమ్మను అవమానకర రీతిలో మాట్లాడాడు. సీతా రాములను దైవంగా కొలిచే కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కత్తి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. కత్తి మహేష్‌పై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తడం, ఆందోళనలు నిర్వహించడం జరిగింది. హిందువుల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న నాయకులు, హిందువుల డబ్బుతో సినిమాల్లో రాణిస్తున్న సినీనటులు ఈ విషయంలో పెద్దగా స్పందించలేదుగాని సాధారణ హిందువులు, స్వామీజీల నుండి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిజిపి మహేంద్రరెడ్డి ప్రకటించారు.

ఈ నగర బహిష్కరణే… అర్ధంకాని విషయం. ఇక్కడ మళ్ళీ దళిత కార్డును లోడే పరిస్థితి వచ్చింది. చరిత్రను తిరగేస్తే దళితులను ఊరికి దూరంగా వుంచడం, కొన్ని సందర్భాల్లో దళితులను వూరి నుండి వెలివేయడం వంటి సంఘటనలే అంటరానితనానికి ఆజ్యం పోసాయి. ఇక్కడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నుండి బహిష్కరిస్తే దేశం వదిలిపోడు కదా! ఈ దేశంలోనే ఇంకో చోట వుంటాడు. అక్కడైనా అతనితో అదే సమస్య. అప్పుడే దళిత సంఘాల నాయకులు చరిత్ర మారలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కత్తి మహేష్‌ అనే వ్యక్తిని దళితుడిగా కాకుండా ఒక మనిషిగా, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న వ్యక్తిగా చూస్తే ఏ సమస్యా లేదు. కాని మళ్ళీ అతని తరపున దళిత కార్డును వాడుతున్నారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవుతుంది.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ విధించబట్టే కులం కార్డు మళ్ళీ తెరమీద కొచ్చింది. దానిబదులు చట్టపరిధిలోనే కేసులు నమోదు చేసి కోర్టుకు లాగివుంటే రాజ్యాంగ పరిధిలోనే అతని తప్పుకు తగిన శిక్ష పడేది.

ప్రధానంగా మీడియా పోటీ తత్వంతో పనికిమాలిన చర్చా వేదికలు పెడుతుండడం వల్లే మెదడు నిండా బూజుపట్టిన వాళ్ళంతా వచ్చి ఏదేదో వాగడం, సంఘర్షణ తలెత్తడం జరుగుతోంది. అసలు మత, కుల సంబంధ విషయాలపై టీవీలలో చర్చలు లేకుండా నిషేధం విధించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here