Home జిల్లా వార్తలు కంభంకు రైతు కిరీటం

కంభంకు రైతు కిరీటం

ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి… పార్టీలో ఏ నాయకులు ఖాళీగా వున్నారు అని వెదికి చంద్రబాబు వారికి పదవులివ్వడం మొదలుపెట్టాడు. ఈ పదవులు కూడా పార్టీకి వారు చేసిన సేవలనో, సీనియార్టీనో గుర్తించి ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ చేత పార్టీకి పని చేయించుకోవడం కోసమే ఇస్తున్నాడు. ఆ పరంపరలో భాగంగానే నెల్లూరుజిల్లాకు చెందిన మాజీశాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డికి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు. ఈ పదవికి కంభం పేరును ఏడాది క్రితం అనుకున్నారు. అప్పుడే ఆయనకు ఆ పదవి ఇచ్చుంటే కొంతన్నా పని చేసుండేవాడు. ఎన్నికలను వాకిట్లో పెట్టు కుని ఇప్పుడిచ్చి ఏం లాభం. జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ మోస్ట్‌ నాయకులలో కంభం విజయరామిరెడ్డి ఒకరు. ఉదయగిరి నియోజకవర్గంలో సొంత బంధుత్వం, బలగం వున్న మనిషి, ఉదయగిరి నుండి 7సార్లు పోటీ చేసిన నాయకుడు… నాలుగు సార్లు టిడిపి అభ్యర్థిగా, రెండుసార్లు ఇండిపెండెంట్‌గా, 2012 ఉపఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఎన్నికల్లో ఉదయగిరి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన బొల్లినేని రామారావు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. పార్టీలో సీనియర్‌, మెట్టప్రాంతం నాయకుడు. రైతాంగం పట్ల అవగాహన, రైతు సమస్యల పట్ల ఆలోచన వున్న నాయకుడు. కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన పదవే… కాని ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చుంటే బాగుండేదేమో!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here