Home రాష్ట్రీయ వార్తలు కంచికి చేరని… కత్తి కథ!

కంచికి చేరని… కత్తి కథ!

ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసు వర్గాలు పాత పాటే పాడాయి. సంఘటన జరిగిన రోజున డిజిపి ఆర్పీ ఠాకూర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌నే తిరిగి వినిపించాయి. జగన్‌పై హత్యాయత్నం కేసును నీరు గారుస్తూ… విశాఖ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా ఎట్టకేలకు దీని వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని ప్రకటించారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాకపోతే దానిని ప్రభుత్వం అంగీకరించడం లేదు. హత్యాయత్నం జరిగిన రోజునే డిజిపి ఆర్‌.పి.ఠాకూర్‌ పేర్కొన్నట్లు ఇది పబ్లిసిటి స్టంట్‌ అని విచారణ జరిపిన పోలీసులు ప్రకటించారు. 2018 అక్టోబర్‌ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డిపై జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడిపందేల కత్తితో హత్యాయత్నానికి పాల్పడడం తెలిసిందే! అదృష్టవశాత్తూ క్షణాల్లో జగన్‌ మెడను పక్కకు తిప్పడంతో మెడపై పడాల్సిన పోటు భుజంపై పడి ఆయనకు ప్రాణాపాయం తప్పింది. తనపై జరిగిన దాడిని రాజకీయం చేయకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో జగన్‌ వ్యవహ రించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, హైదరాబాద్‌ కెళ్లి ఆసుపత్రిలో చేరాడు.

కాని, జగన్‌పై హత్యాయత్నం సంఘటనలో చేయాల్సిన రొచ్చు రాజకీయమంతా చంద్రబాబు చేశాడు. సంఘటన జరిగిన తర్వాత కనీసం ప్రతిపక్ష నేతను పరామర్శించకపోగా, దాడికి పాల్పడింది వైసిపి అభిమాని అని, కావాలనే హత్యాయత్నం డ్రామా లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ చెత్తరాజకీయానికి తెరతీశాడు. 40ఏళ్ళ సీనియార్టీ వుందని చెప్పుకునే చంద్రబాబు మాటలు చూసి రాజకీయ మేధావులకే అసహ్యం వేసింది.

నిందితుడు శ్రీనివాసరావు ఇన్ని రోజులుగా పోలీస్‌ విచారణలో వున్నాడు. అతని నుండి నిజాలు రాబట్టడం ఏమంత పెద్దపని కాదు. ఇన్ని రోజుల తర్వాత కుట్రకోణం లేదంటున్నారు. పబ్లిసిటి కోసం చేసిన స్టంటుగా చెబుతున్నారు. ఎవరి ప్రమేయం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారు. కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేశారు. ఇక్కడ వెలుగు చూడాల్సిన విషయ మేంటంటే జగన్‌ను అంతం చేయాలంటూ అతనిని పురిగొల్పిన సూత్రధారులెవరు? ఎందుకంటే స్వత హాగా జగన్‌ను చంపాల్సిన అవసరం నిందితుడు శ్రీనివాస్‌కు లేదు. శ్రీనివాస్‌ మతపరమైన ఉగ్రవాదో, లేక ఎల్‌టిటిఇ లాంటి తీవ్రవాదో, నక్సలైటో కాదు… రాజకీయ నాయకులను టార్గెట్‌ చేసుకోవడానికి. జగన్‌పై ద్వేషం పెంచుకోవడానికి, ప్రతీకారం తీర్చు కోవడానికి కూడా కారణాలు లేవు. జగన్‌ లేకుంటే నేనే సీఎం అనే పరిస్థితి లేదు. ఏ కోణంలో చూసినా జగన్‌ను హత్య చేయాల్సిన అవసరమే నిందితుడు శ్రీనివాస్‌కు లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు చేయించివుండాలి. ఆ తెరవెనుక అదృశ్య శక్తులెవరు? పోలీసులు తేల్చాల్సింది దీన్నే! ఎందుకంటే బలమైన రాజకీయ శక్తుల అండ లేకుండా, హామీ లేకుండా నిందితుడు శ్రీనివాస్‌ ఈ దురాగతానికి సాహసించడు. అసలు అత్యంత భద్రత వుండే ఎయిర్‌పోర్టులోకి అతను కత్తిని తీసుకు వెళ్ళ గలిగాడంటేనే రాజకీయ పలుకుబడి పని చేసిందన్నది అర్ధమవుతుంది. కాబట్టి జగన్‌ కేసులో పట్టాల్సింది పాత్రధారిని కాదు… సూత్రధారిని! మరి ఆ సూత్రధారిని బయటకు తీయాలంటే దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here