Home జిల్లా వార్తలు ఓ వైపు స్వాతంత్య్రం కోసం పోరాడుతూ.. మరోవైపు బాలికల చదువు కోసం పరితపించిన ...

ఓ వైపు స్వాతంత్య్రం కోసం పోరాడుతూ.. మరోవైపు బాలికల చదువు కోసం పరితపించిన ఎందరో మహానుభావులు

శ్రీ కస్తూరిదేవి విద్యాలయం మహిళల చదువు కోసం ఏర్పడిన సరస్వతీ నిలయం. ఎందరో మేధావులు, మహనీయులు, త్యాగధనులు తమ జీవితాల్ని ఈ సంస్థ అభివృద్ధి కోసం అంకితం చేసి భావితరాలకు ఈ సంస్థను ఓ ఆశాదీపంలా అందించారు. అయితే ఇన్నాళ్ళకు ఈ సంస్థ ప్రగతిపథంలో పయనించడానికి బంగారు బాటలు వేసుకుంటున్న తరుణంలో అభూత కల్పనలు, అవాస్తవ కథనాలతో ఓ పాతపేపర్‌ ఈ కమిటీపై బురద చల్లుతోంది. పత్రికలు ప్రజలను చైతన్యపరచి వాస్తవాలను వారి ముంగిళ్ళలో అక్షరసత్యాలుగా ఆవిష్కరించాలే తప్పితే, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తప్పుడు వార్తలతో, నిరాధార ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణం, క్షమించరాని నేరం. 1945లో అప్పటి కమిటి ఆధ్వర్యంలో పొగతోటలోని కాసుఖేలవారి అగ్రహారంలోని సుమారు రెండున్నర ఎకరాల భూమిని వేలం వేయటంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ పాత పేపరే! 1980లో ఇంత భూమి విద్యాలయాలకు అనవసరం అంటూ 21ఎకరాల విస్తీర్ణంలోని 3ఎకరాలను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజు పేరుతో దారాధత్తం చేసి అక్కడ సినిమాహాళ్ళు నిర్మించడానికి అనుమతులు ఇప్పించే ప్రక్రియలో ఆనాటి కమిటీలో ఒకడిగా ఉండి ఆమోదించి సంతకం పెట్టిందీ ఈ పాతపేపరు అప్పటి సారధే! ఇప్పుడు మొత్తం మిగిలిన భూమినంతా అమ్మేసి దొరికిన మేరకు దోచుకోవడమే పనిగా వారసత్వం పేరుతో ముందుకు వచ్చిన వారిని వెనుకుండి నడిపిస్తున్నది కూడా ఆ పాతపేపరు ఇప్పటి సంపాదకుడే!

1981లో ఆ పాతపేపరు అండతో జరుగుతుండిన లీజు వ్యవహారాన్ని, దాంతోపాటు సినిమాహాళ్ళ నిర్మాణాన్నీ అడ్డుకుని కస్తూరిదేవి ఆస్తులను కాపాడేందుకు గునుపాటి హరిశ్చంద్రారెడ్డి, జె.కె.రెడ్డి, పుచ్చలపల్లి బాలకృష్ణారెడ్డి(ఇంగ్లీష్‌), ఆదాల రాఘవరెడ్డి తదితరులంతా స్వర్గీయ తుంగా రాజగోపాలరెడ్డి గారి సారధ్యంలో ‘లాయర్‌’ పత్రికను వేదికగా చేసుకుని ఉద్యమించారు. నాటికి, నేటికి, ఏనాటికీ కూడా కస్తూరిదేవి సంస్థను, సంస్థ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా పత్రిక వ్యవస్థాపకుడి ఆశయమే లక్ష్యంగా పనిచేస్తుంది మా(మీ) ‘లాయర్‌’.

ఇప్పుడు మళ్ళీ ఆ సంస్థ పురోగతిని అడ్డుకుంటూ అర్ధంలేని రాతలతో అనవసర రాద్ధాంతం చేస్తూ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న కమిటి సభ్యులను అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్న పాతపేపరు, నీచాతి నీచమైన భాషతో ఆ పేపరు చేస్తున్న వ్యాఖ్యలతో కడుపుమండి మరోసారి కస్తూరిదేవి పరిరక్షణ కోసం పునరంకిత మౌతోంది ‘లాయర్‌”

అభూత కల్పనలతో, అవాస్తవ కథనాలతో చనిపోయినవారు సైతం తమకు ఫోన్‌ చేశారంటూ తప్పుడు వార్తలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తూ తాను రాసిందే వేదం, తాను చేసిందే వాదం అన్నట్లుగా పవిత్ర మైన సంస్థనీ, క్షణం తీరిక లేకుండా వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యంతో నిత్యం తలమునకలై వుండే జి.వి.కె.రెడ్డి, దొడ్ల శేషారెడ్డి, సీబ్రోస్‌ సుబ్బారెడ్డి వంటి వారు కస్తూరిదేవి అభివృద్ధి కోసం ముందుకు వస్తే… వారిని తన స్వార్ధ ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత లబ్ది కోసం భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్న ఈ పాతపేపరు ప్రస్తుత సంపాదకుడి అసలు స్వరూపం అక్షర సాక్ష్యాలతో అందిస్తోంది మా(మీ) ‘లాయర్‌’.

విద్యాలయానికి శాశ్వత నివేశన కోసం భూముల కొనుగోలుకు సంకల్పం :

1928లో జరిగిన శ్రీ కస్తూరిదేవి విద్యాలయం కార్యనిర్వాహక సభలో ఈ విద్యాలయానికి శాశ్వత నివేశనము అవసరమవడం చేత నెల్లూరు నగరంలోని కాసుఖేల అగ్రహారానికి తూర్పున

ఉండే పొలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ గొర్రె కామాక్షమ్మ, గొర్రె సుబ్బయ్య, గొర్రె శేషయ్య, గొర్రె సుబ్బరామయ్యలకు చెందిన స్థలాన్ని ఎకరా ఒక్కింటికి 2వేల రూపాయల ధరకు మించకుండా భూమిని కొనుగోలు చేయాలను కున్నారు. అయితే, ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు విద్యాలయం వారి వద్ద ధనం లేపోవడంతో ఆ స్థలాన్ని కమిటీ నిర్వాహకులైన కె.వి రాఘవాచార్యులు, తిక్కవరపు వెంకట రామిరెడ్డిగార్ల పేర్లతో విక్రయపత్రం రాయించుకుని, వారే విక్రయధనం చెల్లించి ఆ పొలానికి యావత్‌ హక్కు అనుభవదారులుగా ఉండాలని, విక్రయం చేసిన తేది మొదలు ఆరునెలల కాలంలోగా వీరికి విద్యాలయం వారు విక్రయధనం అసలు ఫాయిదాలు ఖర్చులు, సర్కారు శిస్తులు చెల్లించిన యెడల వారు విద్యాలయం కమిటీవారికి ఆ భూమిని విక్రయించి దస్తావేజు రాయించి ఇవ్వాలని తీర్మానించారు.

1929 మార్చి 21న కాసుఖేల అగ్రహారంలోని గొర్రె శేషయ్య కుటుంబానికి చెందిన సుమారు 2 ఎకరాల 16 సెంట్లలో 2 ఎకరాలు మాత్రం శ్రీ కస్తూరిదేవి విద్యాలయానికి ఒక ఎకరాకు 2వేల రూపాయలకు మించని ధరకు కొనుగోలు చేయాలని, అందుకు అవసరమైన అగ్రిమెంట్లు దస్తావేజులు రాయించుకోవా లని తీర్మానించారు. 1929లో అప్పుడున్న కమిటీలో కెవి రాఘవా చార్యులు, బెజవాడ సుందరరామిరెడ్డి, పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి, తిక్కవరపు వెంకట్రామిరెడ్డి, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, రాళ్ళపల్లి రామసుబ్బయ్య, శ్రీమతి పొణకా కనకమ్మ, పొణకా పట్టాభిరామరెడ్డి ఉన్నారు. దాతల నుంచి, ప్రజల నుంచి వచ్చిన విరాళాలు, చందాలతో ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది.

మహాత్మాగాంధీజీ చేతుల మీదుగా శిలాఫలకం

అందరూ అనుకున్నట్లుగానే, ఎంతో కష్టపడి కృషిచేసి బాలికల పాఠశాలకు స్థలం కొనుగోలు చేశారు. 1929లో జాతిపిత మహాత్మాగాంధీజీ ఆంధ్రా పర్యటనలో ఉన్నప్పుడు గాంధీజీ చేతుల మీదుగా శ్రీ కస్తూరిదేవి బాలికల పాఠశాలకు శిలాఫలకం వేశారు. బాపూజీ చేతులమీదుగా ఈ బాలికల పాఠశాలకు శిలాఫలకం వేయడం జిల్లా చరిత్రలోనే ఒక అపూర్వమైన సంఘ టనగా ప్రఖ్యాతి చెందింది. జాతీయ భావాలతో, ఉన్నతాదర్శాలతో, బాలి కలకు విద్య బోధించడం ద్వారా వారి జీవితాలకు వెలుగులు ప్రసాదించవచ్చనే ప్రగాఢ విశ్వాసంతో ఆనాడు సమాజ శ్రేయోభి లాషులు.. మహానుభావులందరూ కలసి ఈ విద్యాలయానికి జీవం పోశారు. ఈ మహాయజ్ఞంలో నాడెంతో మంది తమవంతు చేయూత, సహాయ సహకారాలు అందించి తమ ఉదారతను, సమాజ సేవాభావాన్ని చాటుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ 1930 ప్రాంతాల్లోనే ఈ పాఠశాల మూతపడింది. ఈ విద్యా లయానికి సంబంధించిన స్వాతంత్య్రోద్యమకారుల్లో కొంతమంది సత్యాగ్రహోద్యమంలో జైలు పాలవడంతో, పాఠశాల నిర్వహణ కష్టతరమైంది. ఆ తర్వాత మళ్ళీ 1944 నాటికి రాజకీయ వాతావరణం బాగా మారింది. దీంతో ఈ విద్యాలయాన్ని పున: ప్రారంభించాలనే ఆకాంక్ష వారిలో కలిగింది. మళ్ళీ ఈ విద్యా లయం ప్రారంభానికి వారెంతగానో పట్టుదలతో, దీక్షతో కృషి చేసి అనుకున్నది సాధించారు.

హైస్కూలు స్థాపనకు కృషి…

”కస్తూరిదేవి విద్యాలయము స్థలములో బాలికా విద్యా లయమును ప్రారంభించి ప్రభుత్వపు రికగ్నైజేషన్‌ చేయించుటకు ఆ స్థలము చాలడం లేదు నుక, హైస్కూలును స్థాపించేందుకు సుమారు 8 ఎకరాలకు తక్కువ లేకుండా స్థలము కావలసి వున్నది. చుట్టుపక్కల సదరు భూమిలో కలిపే అనుకూలమైన ప్రదేశమేదీ దొరికేట్టు లేదు. ఇట్టి సందర్భమున సదరు హైస్కూలు నిర్మాణమునకు గాను కొంతభాగము భూమిని విక్రయించి గానీ, లేదా మార్చుకొని గానీ స్థలము సంపాదించవలసిన అవసరము ఏర్పడింది. ఆ తర్వాత, కస్తూరిదేవి విద్యాలయం కమిటీవారు విద్యాలయం స్థలాలను 22 ప్లాట్లుగా చేసి వాటిలో 11 ప్లాట్లను విద్యాలయానికి, మరో 11ప్లాట్లను రేబాల పట్టాభిరామరెడ్డికి కేటాయించారు. పట్టాభిరామిరెడ్డిగారికి ఇచ్చిన 11ప్లాట్లకు బదులుగా ఆయన తన సొంత స్థలమైన 17ఎకరాల 10సెంట్లను స్థలమార్పిడి పత్రము ద్వారా ఈ పాఠశాలకు రాయించి ఇచ్చారు. 24-4-1945లో నిర్వహించిన వేలానికి సంబంధించి అప్పటి కమిటీ కార్యదర్శి రేబాల దశరధరామిరెడ్డి 10-4-1945న రెండు పత్రికల్లో ఆ మేరకు వేలం ప్రకటన కూడా ఇచ్చారు. అదే ప్రకటనలో ”నావి 11 ప్లాట్లు గూడా”.. అదేరోజున వేలం ద్వారా విక్రయిస్తామంటూ, రేబాల పట్టాభిరామిరెడ్డి ప్రకటించారు. అనంతరం జరిగిన వేలంలో… కస్తూరిదేవి విద్యాలయానికి చెందిన 11 ప్లాట్లను వేలం వేశారు. ఆ ప్లాట్లను నెల్లూరుకు చెందిన ఏ.వి రమణయ్య 2 పాట్లు, నెల్లూరు నివాసి వారణాసి రామయ్య, గాజులపల్లె ఆదిశేషశర్మ, చినచెరుకూరుకు చెందిన వేమారెడ్డి రామరాఘవరెడ్డి, గూడూరు వెంకట్రామిరెడ్డిలు ఒక్కొక్కటి వంతున మొత్తం 4 ప్లాట్లు, పెదచెరుకూరుకు చెందిన మనుబోలు ఆదినారాయణరెడ్డి 2ప్లాట్లు, నెల్లూరుకు చెందిన మన్నెం శ్రీనివాసులురెడ్డి 3 ప్లాట్లు మొత్తం కలసి 11 ప్లాట్లను వేలంద్వారా కొనుగోలు చేసుకున్నారు.

ఇదే సందర్భంలో రేబాల పట్టాభిరామరెడ్డిగారికి చెందిన ప్లాట్లను కూడా వేలం ద్వారా విక్రయించారు. (ఆ తర్వాతిరోజుల్లో పట్టాభిరామిరెడ్డి కుటుంబసభ్యులు తమకు వేలంద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా కస్తూరిదేవి విద్యాలయం అభివృద్ధి కోసమే విరాళంగా అందజేసినట్లు పలు సందర్భాల్లో రేబాల దశరధ రామిరెడ్డిగారు చెప్పడం ఇక్కడ గమనార్హం). ఆ తర్వాత అందరి కృషిమేరకు, ఆశించిన రీతిలో 1944 జులై 16న మళ్ళీ పాఠశాల ప్రారంభమైంది. ఈసారి ఇది హయ్యర్‌ సెకండరీగ్రేడ్‌ స్కూల్‌గా ప్రారంభమైంది. అప్పట్లో ఈ కమిటీకి ప్రెసిడెంట్‌గా ఉన్న తిక్కవరపు రామిరెడ్డిగారు ఎంతో గొప్ప వదాన్యులు, సమాజసేవాపరాయణులు కనుక, అప్పట్లోనే ఈ పాఠశాలకు ఉదారంగా 50 వేల రూపాయలు విరాళం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అప్పటి కథనంతా స్వయంగా నాటి కమిటీ అధ్యక్షుడే ఒక నివేదికలో ఈ క్రింది విధంగా స్పష్టం చేసి ఉన్నారు.. చూడండి!…

అధ్యక్షుని నివేదికలో ఉన్న నాటి చారిత్రక వివరాలు ఇవీ…

శ్రీమతి పొణకా కనకమ్మ నేతృత్వంలో స్వాతంత్య్ర సమర యోధులు కొంతమంది ఒక బృందంగా ఏర్పడ్డారు. బాలికల విద్య కోసం ఒక జాతీయ విద్యాలయం స్థాపించాలని సంకల్పిం చారు. అందుకు నెల్లూరు నగరంలో ప్రజల నుంచి చందాల రూపంలో నిధులు సేకరించి పాఠశాలను స్థాపించాలని సంకల్పించి, ఆ పాఠశాలకు మహాత్మాగాంధీజీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిపించారు. ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమంలో వీరిలో అనేకమంది జైలు పాలుకావడంతో ఆ పాఠశాల మూత పడింది. ఆ తర్వాత రాజకీయ వాతావరణంలో మార్పులు రావడంతో తిరిగి వారంతా కలసి తిరిగి పాఠశాలను పునః ప్రారంభించాలనుకున్నారు. ఈసారి ఆ పాఠశా లను హైస్కూలుగా ప్రారంభించారు. అందుకు పట్టణ ప్రముఖులైన రేబాల పట్టాభిరామరెడ్డి సాయాన్ని కోరారు. అప్పుడు ఆయన తమకున్న స్థలాన్ని భవన నిర్మాణాలకు ఇచ్చారు. ఆ స్థలంలోని ఒక పాత భవనంలో 1944లో హైస్కూలు ప్రారంభమైంది.

అప్పట్లో ఈ స్యూల్‌లో 51 మంది బాలికలు విద్యను అభ్య సిస్తుండేవారు. ఇక్కడ చదువుకునేందుకు వచ్చే దూరప్రాంతాలు, ఇతర గ్రామాల నుంచి వచ్చే బాలికల కోసం ఒక హాస్టల్‌ భవనాన్ని కూడా ప్రారంభించారు. జాతీయభావాలతో ఈ పాఠశాల నడిచేది. ఎందరో బాలికలకు విద్యానిలయంగా ఉండేది. హిందీ, సంస్కృత భాషలు కూడా ఇక్కడ బోధించేవారు. పాఠశాలకు వచ్చే విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో విద్యాలయం కోసం స్కూలుకు, వసతి గృహానికి పక్కా భవనాల నిర్మాణం అత్యవసరమైంది. ప్రజల నుంచి వచ్చే చందాలు, విరాళాలు, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి వంటి ప్రఖ్యాత సంగీతజ్ఞులచే ప్రదర్శితమయ్యే ఉచిత సంగీత కార్యక్రమాల ఏర్పాటు ద్వారా వచ్చే మొత్తాలు, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ వగైరాలతో తొలుత స్కూలుకు గ్రౌండ్‌ఫ్లోర్‌ నిర్మాణాన్ని పూర్తిగావించారు. అదేవిధంగా బాలికలు వసతి కోసం నూతనంగా హాస్టల్‌ భవనం నిర్మించారు.

హాస్టల్‌ భవనం మొదటి అంతస్తు నిర్మాణం కోసం ప్రముఖ వదాన్యురాలు దివంగత రేబాల పట్టాభిరామరెడ్డి సతీమణి రేబాల సుజాతమ్మ గారు అప్పట్లో 30,400రూపాయలను విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

అభూత కల్పనలు.. అబద్దపు రాతలు!

అప్పటి నుండి ఇప్పటి దాకా.. రక్షిస్తున్నామంటూ భక్షిస్తున్న ప్రబుద్ధులు వీళ్ళే!

అసలు కస్తూరిదేవి విద్యాసంస్థలకు ఈ పాతపేపరు వ్యవస్థాప కుడికి ఉన్న అనుబంధం భవిష్యత్‌లో రాబోయే కస్తూరిదేవి కథలో మనకు తెలుస్తుంది. పొణకా కనకమ్మకి అండదండగా ఉంటూ తిక్కవరపు రామిరెడ్డికి సంబంధించిన లెక్కా పక్కా చూస్తూ తాను కూడా కమిటీలో సభ్యుడిగా చేరి, 1945లో పొగతోటలోని సుమారు రెండున్నర ఎకరాలను 22ఫ్లాట్లు చేసి వేలంవేసి అమ్మడంలో తన పాతపేపరును వేదికగా చేసుకుని ఆనాడు సంస్థని నగర నడిబొడ్డు నుండి ఊరి చివరకు మార్చడంలో ఆ పాతపేపరు వ్యవస్థాపకుడిదే ముఖ్యపాత్ర.

మళ్ళీ 1980లో 21 ఎకరాల నుండి మూడు ఎకరాలను వేరుచేసి అప్పటి కమిటి సభ్యులుగా వున్న యడ్లపల్లి వారికి, మేనకూరు వారికి అంటగట్టి వారిని కారణంగా చూపించి, తనకు అత్యంత సన్నిహితంగా వున్న గునుపాటి రామచంద్రారెడ్డి కుటుంబా నికి ఒక ఎకరాని ధారదత్తం చేసింది కూడా ఆ పేపరు 1980 నాటి సంపాదకుడే! అయితే, ఆ పాత పేపరు ఇప్పటి సారధి మరోవార్త రాస్తూ… ఆ గలీజు లీజు వ్యవహారానికి తమ పేపరు అప్పటి సంపాదకుడికి సంబంధం లేదని, గునుపాటి రామచంద్రారెడ్డి అప్పుడు కమిటీ సభ్యుడుగా వున్నాడని మరో అబద్ధపు రాత రాసాడు. గునుపాటి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి పేరుతో ఎకరా లీజుకు తీసుకున్నాడే తప్ప, ఏనాడూ కూడా రామచంద్రారెడ్డి కమిటి సభ్యుడు కానేకాదు. రామచంద్రారెడ్డి కమిటి సభ్యుడిగా వున్నాడనడం మరో అబద్దం.

మళ్ళీ తాజాగా నందనారెడ్డి కమిటి సభ్యురాలిగా వచ్చినప్పుడు బెంగుళూరుకు చెందిన బిల్డర్‌ వేణుంబాక వెంకటకృష్ణారెడ్డిని సభ్యుడిగా తీసుకొచ్చి కస్తూరిదేవి ప్రస్తుత ఆస్తులను అమ్మేసి ఊరు బయట మళ్ళీ మరో వంద ఎకరాలు కొనాలనే ప్రతిపాదన చేస్తూ, అలాకాని పక్షంలో ప్రస్తుతం కస్తూరిదేవి గార్డెన్స్‌ పేరుతో వున్న 7ఎకరాల స్థలాన్ని కృష్ణారెడ్డికి జాయింట్‌ డెవలప్‌మెంట్‌ క్రింద ఇచ్చి అక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ మరియు అపార్ట్‌మెంట్స్‌ కట్టాలని ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదనని అప్పటి కమిటి నిరాక రించడం జరిగింది. అయితే, బైలాస్‌ ప్రకారంగా సభ్యులను తీసు కోవాలి? అని ఈరోజు బల్లగుద్ధి వాదిస్తున్న నందనారెడ్డి మరి ఆరోజు బెంగుళూరుకు చెందిన ఈ బడా బిల్డర్‌ని ఏ ప్రాతిపదికన కమిటి సభ్యుడిగా తీసుకొచ్చిందో… ఇదే విషయాన్ని తన పాత పేపరులో ప్రస్తావించి, ఆమె తప్పు చేసింది అని కూడా వ్రాసిన ఈ పాతపేపరు ప్రస్తుత సంపాదకుడు ఇప్పుడు ఆమెకు ఏ విధంగా మద్దతు పలుకుతున్నాడో సమాధానం చెప్పవలసి వుంది. మరి తప్పు చేసిన ఆమెతో చేతులు కలిపి తానేదో ఉద్ధరిస్తానని ఈయన చెబుతున్న విషయంలో నిజానిజాలేమిటో ప్రజలకే అర్ధమవ్వాలి.! సంస్థలను పరిరక్షిస్తుందెవరో? భక్షించే ప్రయత్నం చుస్తున్నదెవరో? ప్రజలే ఆలోచించుకోవాలి.

జరిగిన, జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తూ వస్తే, 1945 నుండి 2018 వరకు కస్తూరిదేవి సంస్థల పరిరక్షణ కోసం ఈ పాతపత్రిక పని చేస్తుందా? లేక ఆ సంస్థలను పతనం చేయడమో? లేదంటే స్వాహా చేయడమో లక్ష్యంగా తన ప్రయత్నాలు సాగిస్తుందా? ఈ విషయాలన్నీ విజ్ఞుల విజ్ఞతకే వదిలేస్తున్నాం.

నిమిషానికో మాట… వారానికో రాత

ముందుగా 600 కోట్ల ఆస్తి అని ఓ వారం, వెంటనే 700 కోట్ల ఆస్తి అని మరో వారం, వారానికో వందకోట్ల లెక్కన కస్తూరి దేవి సంస్థల ఆస్తులను విలువ కడుతూ సంస్థ అభివృద్ధి కోసం కంకణబద్ధులైన వారిని తన నీచపు రాతలతో నిరాధారపు నిందలతో తరిమికొట్టే ప్రయత్నం చేస్తూ, తనకేమీ ఎరుగనట్టు దీపా వెంకట్‌ ఎందుకు రాలేదు? సీబ్రోస్‌ సుబ్బారెడ్డి వెనక్కు ఎందుకు వెళ్ళాడు? వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆసక్తి ఎందుకు చూపలేదు? అంటూ అర్ధం లేని ప్రశ్నలతో అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆ పాతపేపరు సంపాదకుడు ఎందుకు చేస్తున్నాడో? అతనికే తెలియాలి.

జె.వి.రెడ్డి ఈ సంస్థలను ఇన్నాళ్ళూ కంటికి రెప్పలా కాపాడా డంటూ ఓ వారం, సంస్థను కాజేయాలని చూస్తున్నాడని మరో వారం నందనారెడ్డి తప్పులు చేసింది అంటూ ఓ వారం, అదే నందనారెడ్డిని తప్పక కమిటీలోకి తీసుకోవాలంటూ మరో వారం… ఇలా తాను రాసే రాతలకు తానే సమాధానం చెప్పుకోలేని తల తిక్క వ్యవహారాన్ని నడపడానికి పాతపత్రికని వేదిక చేసుకున్నాడీ అభివృద్ధి నిరోధకుడు. సంస్థ అభివృద్ధి కోసం సలహాలివ్వండి అంటూ కొంతమంది ప్రముఖులను ఆహ్వానించి వారితో సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశపు కాగితాన్ని పట్టుకుని ఆరోజు సమావేశంలో పాల్గొన్న వాళ్ళంతా ఈరోజు సభ్యులుగా ఎందుకు లేరు? అని ప్రశ్నించడం ఈ సంపాదకుడి తెలివితక్కువ తనానికి అతిపెద్ద నిదర్శనం. తాను పతాక శీర్షికల్లో బురద చల్లితే అది కడుక్కోలేక అందరూ పారిపోతారన్నది ఆయన అపోహ. 2001లో జి.వి.కె.రెడ్డి సంస్థను తన ఫౌండేషన్‌ పేర లీజుకు తీసుకున్నాడని, ఈ లీజును అడ్డుకోవడం కోసం మనమంతా పోరాటం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపిస్తున్న ఈ చపలచిత్తం కలిగిన సంపాదకుడు తన పేపరులోనే ఆ లీజు కొంత మంది అభ్యంత రంతో 2001లోనే రద్దయ్యిందని రాసిన సంగతి మర్చిపోయి మళ్ళీ పిచ్చి ప్రేలాపలనలు పేలడం చూస్తుంటే అతని మానసిక స్థితి ఏ స్థాయిలో వుందో మనం ఊహించుకోవచ్చు.

మల్లెతోటలు ఖాళీ చేయించిందెవరు?

కస్తూరిదేవి అభివృద్ధి కోసం జి.వి.కె.రెడ్డి చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదని కారు కూతలు, తప్పుడు రాతలతో రోత పుట్టిస్తున్న ఈ దుష్టుడికి 2001లో జి.వి.కె.రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తక్షణమే మల్లె తోటల పేరుతో బయటవారి కబ్జాలో వున్న 7ఎకరాల కస్తూరిదేవి స్థలాన్ని ఖాళీ చేయించడానికి లక్షలాది రూపాయలు(సుమారు 70లక్షలు) ఖర్చు చేసిన సంగతి ఇతనికి తెలియదా? అప్పటినుండి ఇప్పటి వరకు ప్రతి నెలా సంస్థ సిబ్బందికి జీతాల కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు నెలకు కనీసం 2లక్షల రూపాయలు తక్కువ లేకుండా చెల్లిస్తున్నది జి.వి.కె.రెడ్డి కాదా? ఒక సంస్థని అభివృద్ధి చేయాలంటే సమర్ధవంతమైన బృందం అవసరం. అందుకోసమే సంస్థని అన్ని విధాలా ప్రగతిపథం వైపు నడిపించే వ్యక్తులను కమిటి సభ్యులుగా తీసుకుంటే ఏదో నేరం జరిగిపోయినట్లు, ఘోరం జరగబోతున్నట్లు పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలు రాయడం ఈ సంస్కారహీనుడికే చెల్లింది. ఓ వైపు ప్రభుత్వ ఎయిడ్‌ వద్దని ట్రస్ట్‌ లేఖ రాసిందని, మాగుంట పార్వతమ్మని సభ్యురాలిగా తీసేసారని… ఇలా నిరాధారమైన పచ్చి అబద్దాలను తన పాత పేపరు ద్వారా ప్రజల ముందుంచి ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆయన ప్రయత్నానికి వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో? ఆయన అంతరాత్మకే తెలుసు!

ఇవీ ఆయన డిమాండ్లు…

తనను కమిటి సభ్యుడిగా తీసుకోవాలని, తన సమీప బంధువుకు కస్తూరిదేవిలో శాశ్వత ఉద్యోగం కల్పించాలని, తన ప్రతిభా పాటవాలతో మూలన పడిపోయిన తన టివి ఛానెల్‌ను పదికోట్ల రూపాయలు పెట్టి జి.వి.కె.రెడ్డి కొనుక్కోవాలని, లేదంటే కస్తూరిదేవి అభివృద్ధిని అడ్డుకుంటూనే వుంటానన్నది ఆయన చేసిన ప్రతిజ్ఞ! ఇటీవల కస్తూరిదేవి ప్రాంగణంలో జరుగుతుండిన కమిటి మీటింగ్‌లోకి తన అనుయాయులతో దౌర్జన్యంగా జొరబడి, చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం మూర్ఖపు వాదనలు చేయడం, అదే పనిగా కమిటీ సభ్యులపై తప్పుడు కథనాలు రాయడాన్ని మేధావులు ఖండిస్తున్నారు. తన స్వార్ధం కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాతపేపరును వేదికగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించి చనిపోయిన వాళ్ళు కూడా తమకు ఫోన్‌ చేశారంటూ నీచాతినీచమైన అబద్దాలను అల్లుతూ తన పబ్బం గడుపుకోవాలని ఆయన చేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చేసేవాళ్ళ మాట నమ్మాలా? లేక అభివృద్ధి నిరోధకుల తాటతీయాలా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here