Home జాతీయ వార్తలు ఓ నా పుణ్యదేశమా… ఇక సెలవ్‌

ఓ నా పుణ్యదేశమా… ఇక సెలవ్‌

ఒక శకం ముగిసింది. లోకం శోకమైంది. ఒక గొంతు మూగబోయింది. ఒక స్వాప్నికుడి స్వప్నం ఆగిపోయింది. భరతమాతకు గర్భశోకం మిగిలింది. భారతావనిపై ప్రతి కన్ను చెమ్మగిల్లింది. భారత రాజకీయాలలో విలువలకు నిలువెత్తు రూపమై నిలిచి, భారతదేశాన్ని ఆధునిక బాట పట్టించి నడిపించిన మహాఋషి, మహోన్నత నాయకుడు, మాజీ ప్రధాని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. భారతావని 72వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకున్నాక… నా పుణ్య దేశమా ఇక సెలవు అంటూ తన 93వ ఏట ఆ మహానాయకుడు 16వ తేదీన ఈ నేలతల్లిని, నూటపాతిక కోట్ల తన భారతీయ ప్రజానీకాన్ని వీడి దైవసన్నిధికి చేరారు. వాజ్‌పేయి మరణంతో దేశం ఒక స్వాప్నికుడిని కోల్పోయింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

దేశంలో నాలుగులైన్ల జాతీయ రహదారుల సృష్టికర్త వాజ్‌పేయి. స్వర్ణచతుర్భుజీ పేరుతో దేశవ్యాప్తంగా ఆయన వేయించిన నాలుగులైన్ల జాతీయ రహదారులపైనే దేశ ప్రగతి చక్రాలు పరుగందుకున్నాయి. నిజాయితీకి నిలువెత్తు చిరునామా ఆయన! 10సార్లు లోక్‌సభ సభ్యుడు, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు, మూడుసార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు… సొంతానికి రూపాయి సంపాదించుకోని విలువలు కలిగిన నాయకుడు. ఆయన వున్నది బీజేపీలో అయినప్పటికీ అన్ని పార్టీల వారితో సాన్నిహిత్యం, అందరికీ అజాతశత్రువు… రాజకీయాలకతీతంగా అందరికీ ఆయనంటే అభిమానం. పదవుల కోసం విలువలు వదులుకోలేదు. విలువల కోసం పదవులనే వదులుకున్న చరిత్ర ఆయనది. 1996లో జరిగిన లోకసభ ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నుండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆరోజు తృతీయ ఫ్రంట్‌ పేరుతో చంద్రబాబు చేసిన హడావిడి వల్ల ఆయన 13రోజులకే సంపూర్ణ మెజార్టీ లేక పదవి నుండి దిగిపోయారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 13నెలలకే అన్నాడిఎంకె అధినేత జయలలిత ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా లోక్‌సభలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఒక సభ్యుడిని కొనమని చెప్పివున్నా ఆయన ప్రధాని పదవి పదిలంగా వుండేది. కాని జీవితాంతం ఆ మరక ఆయనను వెంటాడివుండేది. కాని ఆరోజు ఆయన విలువలకు కట్టుబడబట్టే ఈ తరంలో వారికే కాదు, రేపటి తరాల వారికి కూడా రాజకీయాలలో విలువల గురించి చెప్పుకోవాల్సి వస్తే వాజ్‌పేయి గుర్తుకువస్తారు. మనిషి శాంతి స్వభావుడు. ఎవరితో కయ్యం కోరుకోడు, అలాగని చేతులు ముడుచుకుని కూర్చోడు. దేశ రక్షణ కోసం ఏం చేయాలో 1998లో అదే చేసాడు. పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించి శత్రుదేశాల గుండెల్లోనే కాదు, అగ్రరాజ్యాల గుండెల్లో కూడా అణుబాంబులు పేల్చాడు. పోఖ్రాన్‌ అణు పరీక్షలపై ఆగ్రహించిన అగ్రరాజ్యాలు భారత్‌పై ఆర్ధిక ఆంక్షలు విధిస్తే ఏమాత్రం ఖాతరు చేయని నాయకుడు వాజ్‌పేయి. అంతేకాదు, మీ అండ లేకుండా మేం ఎదగగలం అంటూ భారత్‌ను స్వయంసమృద్ధి దేశంగా ఆవిష్కరింపజేసి, అగ్రరాజ్యాలకు గుణపాఠం చెప్పాడు. 1999లో పాక్‌ అక్రమ చొరబాటు దారులపై గర్జించాడు. కార్గిల్‌ యుద్ధం ద్వారా పాకిస్థాన్‌కు భారత సైన్యం సత్తా చూపించారు. అద్భుతమైన తన విదేశాంగ విధానం ద్వారా అగ్రరాజ్యం అమెరికాలో మార్పు తెచ్చాడు. భారత్‌ను శత్రుదేశం అనుకునే స్థాయి నుంచి మిత్ర దేశంగా భావించే పరిస్థితి కల్పించాడు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్‌కు అమెరికా చేతినే అక్షింతలు వేయించాడు. మూడు దఫాలలో దాదాపు ఆరేళ్ళు దేశ ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించాడు. ప్రపంచ దేశాలలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు. 2005 నుండి అనారోగ్యంతో వున్న వాజ్‌పేయి సాధారణ మధ్య తరగతి మనిషిగా తన సోదరి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 13ఏళ్ళపాటు ఇంటికే పరిమితమైన ఆయన ఆ ఇంటిని తన వారినే కాదు, తనను అభిమానించే కోట్లాదిమంది భారతీయులను వదిలి మహాభినిష్క్రమణం చేశారు.

దేశం కోసమే జీవించిన…

భరతమాత ముద్దుబిడ్డ

జీవితాంతం దేశం కోసం తపించి, సామాన్యప్రజల అభ్యున్నతికోసం నిరంతరం పరితపించి..తన జీవితాన్నంతా దేశానికి అంకితం చేసిన భరతమాత ముద్దుబిడ్డ..మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఇకలేరు. ఆ మహనీయుని అస్త మయంతో దేశం యావత్తూ శోకసాగరంలో మునిగిపోయింది. భారతీయ సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి విశిష్టమైన గుర్తింపును తెచ్చిన మహానేత ఆయన. ప్రధానిగా

ఉన్నప్పుడు, పదవిలో లేనప్పుడు కూడా పేదల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. వారి కష్టాలు తీరుస్తూ.. సామాన్యునికి పట్టాభిషేకం చేసిన అసామాన్య నేత..’భారతరత్న’ం అటల్‌బిహారి వాజ్‌పేయి. తన ఛలోక్తులు, అత్యద్భుతమైన మానవీయ కవితలతో రాజకీయా లకే సరికొత్త గుభాళింపు తెచ్చిన రాజకీయచతురుడు. హిందీ, సంస్కృతం, ఆంగ్లభాషల్లో ఆయన పట్టభద్రుడు కూడా. దేశ సంక్షేమం కోసం జీవితాంతం నిరంతరం శ్రమించిన మానవతా మూర్తి.. రాజకీయ భీష్మాచార్యుడు అస్తమించడంతో..ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఒక మహానగం నేలకొరిగినట్లయింది.

అలుపెరుగని రాజకీయప్రస్థానం

1924 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ రోజున గ్వాలియర్‌లో జన్మించిన అటల్‌జీ జీవితం ఎంతో విశిష్టమైనది. అలుపెరుగని రాజకీయ ప్రస్థానం ఆయనది. ఎక్కడినుంచి పోటీచేసిన గెలిచేవారు. ప్రజలంటే ఆయనకు మక్కువ..అటల్‌జీ అంటే ప్రజలకు అభిమానం ఎక్కువ. 32 ఏళ్ళ వయసులోనే ఆయన లోక్‌సభకు ఎన్నిక కావడమే కాక, ఏకంగా పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారంటే ఆయన పట్ల ప్రజలకున్న ప్రేమాభి మానాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి?.. నాలుగు రాష్ట్రాల నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడమే కాక, తన అత్యద్భుతమైన వాగ్ధాటితో ప్రత్యర్థులను చిత్తు చేసేవారు. చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా జీవితం ప్రారంభించి అంచలంచలుగా దేశంలో అత్యున్నతస్థాయికి ఎదిగారు. 1947లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు. క్విట్‌ఇండియా ఉద్యమంలో 23రోజులపాటు జైలుశిక్ష అనుభవించారు. 1951లో జన సంఘ్‌లో సభ్యునిగా చేరి, 1968 నుంచి 1972 దాకా జనసంఘ్‌ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1957లో లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికై 31ఏళ్ళకే లోక్‌సభలో అడుగుపెట్టారు. 1980లో అద్వానీతో కలసి బిజెపిని స్థాపించి 1980 నుంచి 1986 దాకా బిజెపి వ్యవస్థాపక అధ్యక్షునిగా కీలకపదవిని నిర్వహించారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు.

సంచలన నిర్ణయాలు..

ఉర్రూతలూగించే ప్రసంగాలు..

ఎంతో చిత్తశుద్ధితో, దేశభక్తితో, నిబద్ధతతో ఉండే ఆయన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజితుల్ని చేసేవి. ఆయన రాజకీయచతురోక్తులు దేశప్రజలనే కాక, ప్రతిపక్షాల వారిని కూడా ఉర్రూతలూగించేవి. లోక్‌సభలో వాజ్‌పేయి మాటలు వినాలని పెద్దపెద్ద నాయకులు కూడా పదేపదే కోరుకునేవారు. నెహ్రూ కూడా వాజ్‌పేయి వాక్చాతుర్యానికి అబ్బురపోయి వాజ్‌పేయి భావిభారత ప్రధాని అవుతాడని కితాబునిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటల్‌జీ వాగ్ధాటి, ప్రజాసమస్యలు తీర్చాలనే నిరంతర తపన, జాతీయ స్థాయిలోనే కాక ప్రపంచవ్యాప్త పరిజ్ఞానం ఆయన్ను అంచలంచ లుగా మహోన్నత శిఖరాలకు చేర్చింది. ఎల్లప్పుడూ చెదరని చిరునవ్వుతో, ఎంతటి విషమపరిస్థితుల్లోనైనా చెక్కుచెదరని ధీరత్వంతో ఉండే వాజ్‌పేయి సంచలన నిర్ణయాలను సైతం తీసుకునేవారు. ఆయన హయాంలోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రోక్రాన్‌ అణుపరీక్షలు జరిగాయి. అమెరికా బెదిరింపులను సైతం బేఖాతర్‌ చేస్తూ జరిగిన ఈ పరీక్షల్ని దిగ్విజయంగా నిర్వహిం చడంతో అప్పట్లో ప్రపంచమే విస్తుపోయింది. అంతేకాదు, పాక్‌ దుశ్చర్యల ఆటకట్టిస్తూ అత్యంత భీకరంగా జరిగిన కార్గిల్‌ యుద్ధంలో విజయం మనవైపుకే వచ్చి నిలబడిందంటే ఇవన్నీ అప్పట్లో ప్రధానిగా ఉన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దీక్షాదక్షతలు ధీశక్తివల్లనే సాధ్యమయ్యాయని చెప్పాలి.

అజాతశత్రువు..మానవతావాది అటల్‌జీ..

అటల్‌బిహారి వాజ్‌పేయి అంటే అజాతశత్రువని అందరికీ తెలిసిందే. ఆయన భావుకుడు. మంచి కవి. మానవతామూర్తి : అన్నిటికీ మించి ప్రజల మనిషి. అందుకే, ఎంతటి ప్రత్యర్థులైనా ఆయనతో అభిమానంగానే ఉండేవారు. రాజకీయరంగంలో ఆయన ఎదగని ఎత్తుల్లేవు. బెస్ట్‌ పార్లమెంటేరియన్‌గా కూడా అవార్డును సాధించారు. 1992లో పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2015లో భారతప్రభుత్వం ప్రధాని మోడీ సారధ్యంలో వాజ్‌పేయికి ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించింది. చిన్నతనం నుంచి కష్టాలెన్నో చవిచూసి.. అత్యంత దీక్షతో పట్టు దలతో రాజకీయరంగంలో ఎదుగుతూ..దేశంలో అత్యున్నతమైన ప్రధాని పదవిని సైతం మూడుసార్లు అధిష్టించి దేశప్రగతి కోసం నిరంతరం కృషిచేసిన ఆ మహానేత తన 93వ ఏట తీవ్ర అనారోగ్యంతో కనుమూశారు. ఆ రాజనీతిజ్ఞునికి.. ఆ మహాయోధు నికి.. మానవీయమూర్తికి.. ఇదే మా కన్నీటి నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here