Home సంపాదకీయం ఓట్ల ఎరకు సంక్షేమం ముసుగు

ఓట్ల ఎరకు సంక్షేమం ముసుగు

ఈ దేశంలో తమ ఆస్తులను అమ్మి ప్రజలకు సంక్షేమ పథకాల క్రింద నిధులిచ్చిన నాయకులు ఎవరన్నా వున్నారా? పింఛన్‌లకు, స్కాలర్‌షిప్‌లకు, ప్రజలకు పంచిన టీవీలు, సోఫాలు, గ్రైండర్‌లు, ల్యాప్‌టాప్‌లకు ఏ నాయకుడన్నా లేదా ఏ పార్టీ అయినా సొంత నిధులు ఖర్చుపెట్టిందా? వీటన్నింటికి ఏ ప్రభుత్వమైనా చెల్లించేది ఎవరి డబ్బు? ఎవరికైతే ఇస్తున్నారో అది వారి డబ్బే! గ్రామంలో రోడ్లు వేయకుండా, కాలువలు తవ్వకుండా, బళ్ళు కట్టకుండా, వైద్యశాలలు నిర్మించకుండా, ఊరికి బస్సులు వేయకుండా… మిగిల్చిన ఆ డబ్బును ప్రజలకు ఓట్ల కోసం తలా కొంత పంచి దానికి సంక్షేమం అనే ముసుగును తగిలిస్తున్నారు.

ప్రపంచంలో 195 దేశాలున్నాయి. ఇందులో మనకంటే కూడా దీనావస్థలో వున్న దేశాలు చాలానే వున్నాయి. ఆ దేశాలలో కూడా ఓట్లు అమ్ముకునే సంస్కృతి లేదు. కాని, ఒక్క భారతదేశంలోనే ఓట్లు అమ్ముకునే, కొనుక్కునే పరిస్థితిని కల్పించారు. ప్రజల పేదరికాన్ని రాజకీయ పార్టీలు బలహీనతగా మార్చుకుంటే, రాజకీయ పార్టీల ఓట్ల అవసరాన్ని ప్రజలు తమ డబ్బు అవసరాలకు వాడుకుంటున్నారు. ఇలా పరస్పరం ఒకరినొకరు అవినీతిపరులుగా మార్చుకుంటున్నారు. తద్వారా ప్రజలు తాము గెలిపించిన ప్రజాప్రతినిధిని తమ సమస్యలపై నిలదీసే హక్కును కోల్పోతున్నారు. భారత రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందంటే ఎన్నికలొచ్చాయా, కోట్లు వెదజల్లామా, ఓట్లు కొన్నామా, అధికారంలోకి వచ్చామా… ఇదీ రాజకీయ పార్టీల శైలి. ఓటరు ధోరణి కూడా ఇలాగే వుంది. ఓటుకు ఏ రేంజ్‌ నోటు పంచు తున్నారన్నది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దేశంలో వున్న ప్రజలందరూ కూడా పచ్చనోట్లకు లోబడి ఓట్లు వేస్తున్నారని చెప్పడం లేదుగాని నూటికి పదిమందిపై ధన ప్రభావం పనిచేసినా ఫలితాలు తారుమారు కావడం ఖాయం. రాజకీయాలలో ఈ డబ్బు సంస్కృతి పెరిగాకే ప్రజలకు సేవ చేయాలనుకునే చిత్తశుద్ధిగల నాయకుల శాతం తగ్గిపోయి రాజకీయాలలో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎక్కువుగా పోగయ్యారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచిత వరాలందించడంలో ఇంతకు ముందు తమిళనాడు పార్టీలకు గొప్ప పేరుండేది. ఒక పార్టీ కలర్‌టీవీ ఇస్తామంటే, ఇంకో పార్టీ వాళ్ళు ఫ్రిజ్‌ ఇస్తామనేవాళ్ళు. ఒక పార్టీ కంప్యూటర్‌ అంటే… ఇంకో పార్టీ ల్యాప్‌టాప్‌ అనేది. ఒకరు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులన్నీ

ఉచితంగా ఇస్తామంటే, ఇంకో పార్టీ వాళ్ళు అన్నం, కూరలు అన్నీ తామే వండి ఇంటికి పంపిస్తామని చెప్పేవాళ్ళు! తమిళనాడులో ఎన్నికల హామీలు వేలంపాటను తలపించేవి.

ఇప్పుడు అదే సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకిందేమోననిపిస్తోంది. తమ ఆస్తులు అమ్మి ఇచ్చేస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలను ఎడాపెడా ప్రకటించేస్తున్నాయి. ఇదంతా ఓట్ల కోసం ఆరాటమే! ఇటీవలే తెలంగాణలో ఎన్నికల ఫలితాలను చూసాం. కేసీఆర్‌ సంక్షేమ పథకాలకు ఆ రాష్ట్ర ప్రజలు జేజేలు పలికారు. అయితే కేసీఆర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు అమలు చేసిన పథకాలు కావవి. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒకదానివెంట ఒకటి చేసుకుంటూ వచ్చాడు. పథకాల అమలులో ఆయన చిత్తశుద్ధి చూపించాడు కాబట్టే ప్రజలు ఆదరించారు.

మరి నేడు ఏపిలో టిడిపి ప్రభుత్వం అదే సంక్షేమ బాటను కాపీ కొడుతోంది. ఉన్నఫళంగా పింఛన్‌లను రెట్టింపు చేయడం, కొన్ని రకాల పింఛన్‌లు మూడింతలు చేయడం, డ్వాక్రా మహిళలకు పదివేలు, స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడం… ఇవన్నీ ఓట్ల కొనుగోలులో భాగమే. ఒకరకంగా ప్రజల డబ్బును ప్రజలకే ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయడమన్నమాట! చంద్రబాబులో ఈ ఆలోచనలకు బీజం వేసింది ప్రతిపక్షనేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి. ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ‘నవరత్నాలు’ అనే స్కీంను ప్రకటిం చాడు. పింఛన్‌లు పెంచడం, చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15వేలు, రైతులకు ఆర్ధిక భరోసా, 45ఏళ్ళకే పింఛన్‌లు ఇవ్వడం వంటి హామీలిచ్చాడు. పింఛన్‌ వయోపరిమితి అన్నది 60ఏళ్లు కరెక్ట్‌! మనిషి ఖచ్చితంగా ఆ వయసుదాకా కష్టపడగలుగుతాడు. ఆ తర్వాత పింఛన్‌ ఇవ్వడం తప్పులేదు. కాని టిడిపి, వైసిపిలు పోటీపడి ఓట్ల కోసం నోటికొచ్చినట్లుగా సంక్షేమ వరాలు కురిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఏటా కొన్ని వేలకోట్లు వృధా అవు తున్నాయి. సబ్సిడీల రూపంలో ఇంకా ఎన్నో వేలకోట్లు దుర్వినియోగమవుతున్నాయి. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే! అయితే సంక్షేమ పథకం అన్నది వయసుడిగిపోయి, శరీరంలో శక్తి లేక ఏ పని చేయలేని నిస్సహాయులకు కడుపు నింపే మార్గంగా వుండాలే గాని, ఒళ్ళు వంచి పనిచేసే వారిని కూడా సోమరులను చేసేవిగా వుండకూడదు.

ప్రభుత్వం ఖర్చు చేసే వ్యయం ఉత్పాదకతకు ఊతమివ్వాలి. ఉత్పాదక రంగాలను ప్రోత్సహించేలా వుండాలి. వ్యవసాయరంగాన్ని ఎంత ప్రోత్సహించినా ఇబ్బంది లేదు. ఎందుకంటే తొలి ఉత్పత్తిదారు రైతే! దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలస్థంభం రైతే! కాబట్టి అన్నదాత కూలిపోకుండా కాపాడుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా నష్టం లేదు. 2004లో ఏపిలో అధికారంలోకి వచ్చిన వై.యస్‌.రాజశేఖరరెడ్డి రైతులకి ఉచిత కరెంట్‌ హామీని అమలు చేశాడు. తద్వారా వ్యవసాయ రంగం ఎంతో ప్రగతి సాధించింది. నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి అవసరాల కోసం ఎకరాకు ఏడాదికి ఆరువేల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించింది. రైతుకు ఎంతో ఆదరువు ఇది. రైతు పెట్టుబడిలోనే కాదు, వారి నష్టంలోనూ ప్రభుత్వం భాగస్వామిగా వుండబోతుంది. వారిపై భారాన్ని తగ్గించబోతోంది. ఏ ప్రభుత్వమైనా రైతుకు ప్రాధాన్యతనివ్వాలి. రైతు నష్టపోకుండా నిలదొక్కుకునేలా చేయూతనందించాలి. సంక్షేమం ముసుగులో ఓట్లకు వేలకోట్లు వృధా చేసే బదులు అందులో పదోవంతు నిధులు వ్యవసాయ పెట్టుబడికి కేటాయించండి. వ్యవసాయం ఎందుకు పండుగ కాదో చూద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here