Home రాష్ట్రీయ వార్తలు ఓటమి భయమా?

ఓటమి భయమా?

”నాకు పదవి పోయినా ఏం బాధ లేదు… మా మిస్సెస్‌ వుంది, కొడుకున్నాడు, కోడలుంది, మనుమడు కూడా వున్నాడు. నరేంద్ర మోడీకి ఎవరున్నారు.”

”తమ్ముళ్ళూ నా భద్రత మీ బాధ్యత, నేను జైలుకు పోకుండా వుండాలంటే మీరంతా నాకు ఓట్లేసి గెలిపించాలి.”

”మీకు సిగ్గుందా… రోషముందా? మీకు పౌరుషం లేదా? జగన్‌కు ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్లే! వైసిపిని గెలిపిస్తే మన రాష్ట్రంపై కేసీఆర్‌ పెత్తనం చేస్తాడు…”

2019 ఎన్నికల ప్రచార సభలలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత, 40ఏళ్ళ రాజకీయ అనుభవముందని చెప్పుకునే ఆదర్శవంతమైన నాయకుడు శ్రీమాన్‌ చంద్రబాబునాయుడు గారు చెబుతున్న సుభాషితాలు. ఆయన చెబుతున్న వాటిలో ఇవి కొన్నే… ఇలాంటివి ఇంకా కోకొల్లలుగా దొర్లుతున్నాయి.

ధైర్యమున్న పరిపాలకుడెవడైనా ఐదేళ్ళ పాలన ముగిసిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమనాలి. తన స్వచ్ఛమైన పాలన చూసి ఓటేయమనాలి. లేదంటే ప్రతిపక్షంలోని లోపాలను ఎత్తి చూపి కూడా ఓటడగవచ్చు. ఇంతవరకు దేశ రాజకీయాలలో ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకులైనా చేసిందిదే! ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదేళ్ళ పాలన మీదే ప్రజల తీర్పును కోరుతున్నాడు. 2009లో తన పరిపాలన మీదే దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ప్రజాతీర్పు కోరాడు.

చంద్రబాబు ఇప్పుడు అది చేయడం లేదు. తన ఐదేళ్ళ పాలనను ప్రజల ముందుకు తీసుకుపోయి ఓట్లడిగే ధైర్యం చేయడం లేదు. ఎన్నికల ప్రచార సభలలో ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడు తున్నాడు. కోడికత్తి పార్టీ అంటూ వెకిలిగా మాట్లాడుతున్నాడు. ప్రసంగాల మధ్యలో నిరాశకు గురవుతున్నాడు. ప్రజలను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అన్నింటికంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఈ రాష్ట్ర రాజకీయాలతో ఏ సంబంధం లేని కేసీఆర్‌ పేరును పదేపదే కలవరిస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదితో పోలుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయనలో కనిపిస్తున్న ఓటమి భయం తాలూకు పరిణామాలే!

బలహీన అభ్యర్థులకే భయపడ్డాడా…?

ఈ నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడు ఓటమి భయంతో ఏ స్థాయికి దిగజారిపోయాడనడానికి ఓ చిన్న ఉదా హరణగా… హిందూపురం వైసిపి ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌ విషయంలో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. మాధవ్‌ ఒక సిఐగా పని చేస్తూ విఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. హిందూపురం నుండి వైసిపి ఎంపి అభ్యర్థిగా నిలబడుతున్న బలహీనవర్గాల వ్యక్తి. అతనిని నామినేషన్‌ వేయకుండా చూడడానికి చంద్రబాబు నానా తంటాలు పడ్డాడు. అంటే ఒక్క సి.ఐ స్థాయి అధికారి కోసం ఇంతగా భయపడాల్నా? 2009 ఎన్నికలప్పుడు డిజిపిగా వున్న ఎస్‌ఎస్‌పి యాదవ్‌ను మార్చాలంటూ చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను కోరాడు. అప్పుడు ఎన్నికల కమిషన్‌ చంద్రబాబు కోరినట్లే యాదవ్‌ స్థానంలో మహంతిని డిజిపిగా పెట్టింది. అప్పుడేమో ఎన్నికల కమిషన్‌ చేసిన పని చంద్రబాబుకు సూపర్‌ అనిపించింది. మరిప్పుడు ప్రతిపక్షంగా వున్న వైసిపి డిజిపితో పాటు ఇంటలిజన్స్‌ డిజి, పలువురు పోలీసు అధికారులను మార్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేయడం, ఇంటలిజన్స్‌ డిజిని, ఇద్దరు ఎస్పీలను ఎలక్షన్‌ కమిషన్‌ బదిలీ చేయడం జరిగింది. అయితే ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తూ చంద్రబాబు హైకోర్టు కెక్కాడు. ఇంటలిజన్స్‌ డిజి ఎన్నికల పరిధిలోకి రాడంటూ జి.ఓ తెచ్చి, హైకోర్టు చేత మొట్టికాయలేయించుకున్నాడు. ఒక ఇంటలిజెన్స్‌ డిజి సహకారం లేకుంటేనే తాను గెలవలేననుకుంటున్నాడంటే చంద్రబాబులో ఏ స్థాయి భయం ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు.

ఉత్తరాది నాయకులతో ప్రచారం దేనికి సంకేతం..?

ఓ పక్క ఆంధ్రాపై ఉత్తరాది వాళ్ళ పెత్తనం ఏందంటున్నాడు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు మన రాష్ట్రంలో పనేంటంటున్నాడు. ఇంకో పక్క ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ సీఎంలను, కాశ్మీర్‌ పార్టీ నాయకులను తీసుకొచ్చుకొని ప్రచారం చేయించుకున్నాడు. ఇది దేనికి సంకేతం?

ఒక్క సినిమాకే ఇంతగా దడుచుకోవాలా..?

చంద్రబాబులో భయం, అభద్రతా భావం తారాస్థాయికి చేరిందనడానికి ఇంకో ఉదాహరణ… ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే సినిమా! తెలుగుదేశం పార్టీ పుట్టిందే సినిమా గ్లామర్‌ నుండి, చివరకు అదే పార్టీ ఓ చిన్న సినిమాను చూసి కూడా భయపడుతోంది. ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల అనుబంధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాంగోపాల్‌వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు చేయని ప్రయత్నమంటూ లేదు. సెన్సార్‌ బోర్డ్‌ ద్వారా ఆపాలని చూశారు, ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవాలనుకున్నారు… అవన్నీ కుదరక హైకోర్టు కెళ్ళారు. ఆ సినిమాను ఆంధ్రాలో విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నారు. కాని, ఆ సినిమా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలలలో కూడా విడుదలైంది. ఆ సినిమా చూసిన వాళ్లెవరు కూడా చంద్రబాబుకు ఓటెయ్యరంటున్నారు. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రను అంత నెగటివ్‌గా చూపించారు. ఆంధ్రా థియేటర్‌లలో ఆ సినిమా విడుదల కాలేదన్న మాటేగాని, అందరి సెల్‌ఫోన్‌లకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పూర్తి సినిమా వచ్చేసింది. సోషల్‌ మీడియా ప్రపంచాన్నే ఏలుతున్న కాలంలో ఆ సినిమాను ప్రేక్షకుల అరచేతుల్లోకి రాకుండా అడ్డుకోవడం ఎవరితరం. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు అనుభవిస్తున్న ఆందోళన, పడుతున్నంత భయం చంద్రబాబు గతంలో ఎప్పుడూ పడలేదు. ఈ భయంతోటే ఆయన ఒక తప్పు వెంట ఇంకో తప్పు చేస్తూ ఎన్నో సెల్ఫ్‌గోల్స్‌ వేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here