Home రాష్ట్రీయ వార్తలు ఒక్క దాడికే… దడపుట్టిందా?

ఒక్క దాడికే… దడపుట్టిందా?

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌… ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌… ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌… ఏపి పోలీసుల సంయుక్త దాడులు… కేంద్ర ప్రభుత్వ ప్రతీకారచర్య… కోర్టుల్లో కులపక్షపాత నాయ్యమూర్తులు… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి… కేంద్రమంత్రులు… రాష్ట్ర మంత్రులు… ప్రధాన ప్రతిపక్షంగా వున్న పార్టీ సైతం ప్రభుత్వ చర్యలకు మద్దతు… కుల మీడియా పూర్తి వ్యతిరేక కథనాలు…

వీటన్నింటిని, వీరందరినీ ఒకే ఒక్కడు ఎదుర్కొన్నాడు. అది కూడా నలభై ఏళ్ళ వయసులో… తనపై కక్షగట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర, రాష్ట్ర యంత్రాంగా లను, జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల విషప్రచారాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. కక్షగట్టి జైలుకు పంపిస్తే మొండి ధైర్యంతో నిలబడ్డాడు. పంతం పట్టి బెయిల్‌ కూడా రాకుండా చేస్తే, 16నెలల తర్వాతే జైలు నుండి వచ్చాడు. ఓ పక్క కేసులు… మరోపక్క ఆస్తుల జప్తులు… ఇంకో పక్క కులమీడియా విద్వేషకథనాలు. అయినా తొణకలేదు, బెణకలేదు… ఆయనలోని ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. అది వై.యస్‌.రాజశేఖరరెడ్డి రక్తం. అది రాజన్న ఇచ్చిన గుండె ధైర్యం. కాబట్టే తనపై ఇంత జరిగినా వెన్నుచూపక, రాజీపడక రాజకీయాలను వదలక రాజమార్గంలో నడుస్తున్న నాయకుడిగా వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. గత ఏడెనిమిదేళ్ళలో వై.యస్‌. కుటుంబం లక్ష్యంగా జరిగిన ప్రతి అధికారిక దాడి కూడా రాజకీయ కోణంలో జరిగిందే! అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో జరిగిందే! అయితే జగన్‌ ఎప్పుడూ ఆ దాడుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. కుట్రపూరిత దాడులుగా చెప్పలేదు. చట్టాన్ని, న్యాయస్థానాన్ని గౌరవించి, వారి ఆదేశాలను పాటించాడు. తన మీద ఈ స్థాయిలో ఆదాయపన్ను, సిబిఐ, ఈడి దాడులు జరిగినా ‘బాహుబలి’లాగా జగన్‌ ఎదుర్కొన్నాడు.

మరి ఈ తెలుగుదేశం నాయకులేంటి… ఒక్క ఆదాయపన్ను శాఖ దాడికే ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. మరి జగన్‌ మీదలాగా కేంద్రంలోని బీజేపీ వాళ్ళు పగబట్టి సిబిఐ, ఈడిల చేత దాడులు చేయిస్తే… ఈ నాలుగున్నరేళ్ళలో చేసిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపిస్తే… ఎంతమందికి హార్ట్‌స్ట్రోక్‌లు వస్తాయో!?

తెలుగుదేశం నాయకుల ప్రవర్తన జగన్‌కో న్యాయం, సీఎం రమేష్‌కో న్యాయం అన్నట్లుగా వుంది. తెలుగుదేశం నాయకులు చట్టాలకు అతీతులు అన్నట్లుగా మాట్లాడు తున్నారు. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌పై మొన్న ఆదాయపన్ను శాఖాధికారులు మూడురోజుల పాటు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన ఇళ్ళు, సంస్థలలో సోదాలు నిర్వహించారు. కీలకమైన ఫైళ్ళు, పత్రాలు సీజ్‌ చేశారు. సీఎం రమేష్‌కు ముందు రాష్ట్రంలో ఒకరిద్దరు టిడిపి నాయకుల సంస్థల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అప్పుడు అతిగా ఆందోళన చెందని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు సీఎం రమేష్‌ సంస్థలపై ఐటి దాడి అనగానే గాబరాపడ్డారు. ఇది అన్యాయం, అక్రమం అంటూ ఆక్రోశించారు. దీనిని తెలుగు జాతి మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ దీనికి రాజకీయ రంగు, ప్రాంతీయ మసి పులిమే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టి ఐ.టి దాడులు చేయిస్తుందంటూ చంద్రబాబు, లోకేష్‌లతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాటందుకున్నారు.

ఈ దేశంలో ఎందరి మీదో ఐ.టి దాడులు జరిగాయి. తనిఖీలలో తమ నిజాయితీని నిరూపించుకున్నవాళ్ళున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి గుట్టలు గుట్టలుగా బ్లాక్‌మనీ పోగేసినవాళ్ళున్నారు. సీఎం రమేష్‌ దీంట్లో ఏ కోవకు చెందుతాడన్నది తర్వాత తేలు తుంది. ఆయన సంపాదించిందంతా సక్రమమే అయితే, ఆయన సంపాదించిన సొమ్ముకు లెక్కలు పక్కాగా వుంటే ఆయనగాని, తెలుగుదేశం నాయకులు గాని ఆందోళన చెందాల్సిన పనేలేదు. ఇంకా ఇన్‌కంటాక్స్‌ వాళ్ళు ఇచ్చే క్లీన్‌ సర్టిఫికేట్‌ను పట్టుకుని మేము నిప్పులాంటి చంద్రబాబు అనుచరులం అని ప్రచారం చేసుకోవచ్చు. ఏ తప్పు చేయకుంటే ఇంతలా భయపడాల్సిన పనిలేదు. దీనిని ఓ యుద్ధంలా చిత్రీకరించాల్సిన అవసరం లేదు.

2014కు ముందు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థలు అప్పుల్లో వున్నాయని సమాచారం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్ళలోనే సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీలు వేల కోట్ల కాంట్రాక్ట్‌ పనులను దక్కించుకున్నాయి. వేలకోట్ల ఆస్తులు పెరిగాయి. సీఎం రమేష్‌ విలాసవంతమైన భవనాలు కట్టాడు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంద కోట్లకు పైగానే ఖర్చుపెట్టాడు. ఒకప్పుడు సాధారణ సారా వ్యాపారి అయిన సీఎం రమేష్‌ ఆస్తులు ఈరోజు వేలకోట్లకు పెరగడం వెనుక మతలబు ఏమిటి? ఇవన్నీ కూడా కేంద్ర సంస్థలు నిఖార్సుగా దర్యాప్తు జరిపితే ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తుంది.

ఒక్క సీఎం రమేష్‌ కంపెనీలపై దాడి జరిగితేనే చంద్రబాబు బృందానికి ఇంతగా దడ పుడుతుంది. తెలుగుదేశంలో ఇలాంటి రమేష్‌లు ఇంకా చాలామందే వున్నారు. అందరి మీద ఎన్నికలలోపే ఐటి, సిబిఐ, ఈడి, సిబిఐసిలు పడితే చంద్రబాబు పరిస్థితి ఎలా వుంటుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here