Home రాష్ట్రీయ వార్తలు ఒక్క ఛాన్స్‌.. ప్లీజ్‌

ఒక్క ఛాన్స్‌.. ప్లీజ్‌

”ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌…” ఈ డైలాగ్‌ వింటే గుర్తొచ్చేది కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా! ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగీత సినిమాలలో హీరోయిన్‌ ఛాన్స్‌ కోసం వచ్చి ”ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌” అని బ్రతిమ లాడుకుంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తేనే మనం వారిలో ఆ టాలెంట్‌ను చూడగలం. ఈ దేశ ప్రజలు అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ఒక్క ఛాన్స్‌ ఇవ్వబట్టే దేశ మంతటా స్వర్ణచతుర్భుజీ నాలుగులైన్ల జాతీయ రహదారులు ఏర్పడ్డాయి. 2004లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డికి ఆ ఒక్క ఛాన్స్‌ ఇవ్వబట్టే నిరుపేదలను సైతం కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లిఫ్ట్‌ ఎక్కించే ఆరోగ్యశ్రీ పుట్టుకొచ్చింది. 108 అంబులెన్స్‌ ఆవిష్కృతమైంది. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వచ్చి చిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన లక్షలాది మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. అలాంటి ఒక్క ఛాన్స్‌ ఇప్పుడు మన ప్రియతమ నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి అడుగుదాం… ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా వారి ప్రతిభ తెలిసేది. అలాగే మన జగనన్నకు సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజల ముందుకు పోదాం… అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు వైసిపి నేతలు, కార్యకర్తల్లో ఊహించని స్పందన వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక్క ఛాన్స్‌ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నాయి.

ఈ నెల 11వ తేదీన విశాఖపట్నంలో 175 నియోజకవర్గాలకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు, సమన్వయకర్త లతో వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్‌ టీం సభ్యులు బూత్‌కమిటీలు, ఓటర్ల చేర్పులు, ప్రచార సరళి వంటి వాటిపై సూచనలిచ్చారు. వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే ఈ సమావేశంలో ప్రసంగించాడు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గతంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలను ప్రశంసించారు. ఓటర్ల తొలగింపుపై ఆయన చేస్తున్న పోరాటం, ఓటర్ల చేర్పులపై చూపిస్తున్న ఆసక్తిని, అనునిత్యం ప్రజల మధ్య వుంటూ ప్రజాసమస్యలపై ఆయన పోరాడుతున్న విధానాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు.

ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్‌లలో కోటంరెడ్డి ఒక్కడికే ప్రసంగించే అవకాశం ఇవ్వగా, ఆయన తన ప్రసంగంలో ‘మన రాజన్న బిడ్డకు ఓ అవకాశం ఇద్దాం’ అనే నినాదాన్ని రాష్ట్రంలో దశదిశలా వ్యాప్తి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులు ఇస్తున్న ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ అనే నినాదానికి తోడుగా ‘మన రాజన్న బిడ్డకు ఓ అవకాశం ఇద్దాం’ అనే నినాదాన్ని ప్రచారంలోకి తెస్తే ప్రజల మనసుల్లోకి ఎక్కుతుందని, ప్రజల నుండి సానుకూల స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన సూచనపై సమావేశంలోని అందరూ అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here