Home గల్పిక ఒక్కరోజు వాజ్‌పేయిలా చంద్రబాబు

ఒక్కరోజు వాజ్‌పేయిలా చంద్రబాబు

నూటపాతిక ప్రపంచ మేటి నగరా లను కాచి వడబోసి కట్టిన అమరావతి నగరమది. కృష్ణా కరకట్ట మీద హైటెక్‌ రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. ఢిల్లీలో మహానేత వాజ్‌పేయి అంత్యక్రియ లలో పాల్గొని అప్పుడే ఇంటికి వచ్చాడు చంద్రబాబు. స్నానం చేసేసి తన ఆఫీసు గదిలోకి వస్తూ హాల్‌లో వున్న భువనేశ్వరీ దేవితో… లోకేష్‌ ఎక్కడకు వెళ్లాడు అని అడిగాడు. రెస్ట్‌ తీసుకుంటున్నాడని ఆమె చెప్పింది. ఏం విరగదీసాడని ఈ టైంలో రెస్ట్‌ అని చంద్రబాబు అడిగాడు. మొన్న ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేశాం కదండి… జెండాకు సెల్యూట్‌ చేసే టప్పుడు మెడ బాగా పట్టేసిందట… పడుకుని వున్నాడని భువనేశ్వరి చెప్పింది. సరేలే అంటూ చంద్రబాబు తన ఆఫీసు గదిలోకొచ్చి కూర్చున్నాడు. చంద్రబాబు ఢిల్లీ నుండి వచ్చాడని తెలుసుకుని ఎంపీలు జె.సి.దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్‌, గల్లా జయదేవ్‌, మురళీమోహన్‌, కేశినేని నాని, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లా రావులు వచ్చారు. ఢిల్లీలో వాజ్‌పేయి అంత్యక్రియల విషయం వారిమధ్య చర్చకు వచ్చింది. చంద్రబాబు వారితో ఎంతైనా వాజ్‌పేయి వాజ్‌పేయే… ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే ఏం లాభం… ఆ మహానేత పట్ల వున్న అభిమానం ఇంకెవరికి వస్తుంది. సాక్షాత్తూ ప్రధానే 7కిలోమీటర్లు ఆయన అంతిమయాత్రలో నడిచాడంటే మాటలా… కాకి లాగా కలకాలం కాదు, వాజ్‌పేయి లాగా పదేళ్ళు దేశం కోసం బ్రతికినా చాలు. వాజ్‌పేయి ప్రధాని కావడానికి కారణం నేనే. 1998, 1999లలో మనం సపోర్ట్‌ చేయబట్టే వాజ్‌పేయి ప్రధాని అయ్యాడు. ఆయన చేత అణుపరీక్షలు చేయించింది నేనే, కార్గిల్‌ యుద్ధం మొదలు పెట్టించిందీ నేనే, నాలుగులైన్ల రోడ్డు వేయించండని సలహా ఇచ్చిందీ నేనే… నా సూచనలకు అంతగా ప్రాధాన్యతనిచ్చేవారాయన. బ్రతికితే ఆయనలాగా బ్రతకాలి, ఆయన లాగా దేశం కోసం నిజాయితీగా పనిచేయాలి అని అనసాగాడు. అప్పుడు జేసీ దివాకర్‌ రెడ్డి… మనకు అవన్నీ సెట్‌ కావులే సార్‌, మనకు సెట్‌ కాని మనుషుల గురించి ఎక్కువ సేపు ఆలోచించకూడదు అని చెప్పాడు. అందుకు చంద్రబాబు… ఏం ఎందుకు ఆయనలా ఉండలేం, ఇప్పుడు లేమా, పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకుంటూ ఎంతో పేదరికంతో బ్రతుకుతున్న మాకు ఆ మహనీయుని మార్గాన్ని అనుసరించడం పెద్ద సమస్యేమీ కాదన్నాడు. అంతలో బయట నుండి కెవ్‌… కెవ్‌… కెవ్‌ మనే కేకలు వినిపించ సాగాయి. చంద్రబాబు, మిగతావాళ్ళు ఆదుర్దాగా బయటకెళ్లారు. అక్కడ గన్‌ మెన్‌లు, స్థానిక టీడీపీ నాయకులు క్రిందపడి కొట్టుకుంటున్నారు. వీళ్ళంతా ఎందుకు పడిపోయారా అనుకుని అటు వైపు చూసారు. అంతే వీళ్ళందరు కూడా టప్పున కళ్ళు తిరిగి పడిపోయారు.

————-

నిద్రపోయాడనే గాని చంద్రబాబుకు ఆ రాత్రంతా కలలే! కలల్లో వాజ్‌పేయి తన భుజంపై చేయి వేయడం, తనకు ఫోన్‌ చేసి సలహాలడగడం. నిద్ర లేచాక చంద్రబాబులో ఏదో ధర్మసందేహం మొదలైంది. వాజ్‌పేయి నాకే కలలోకి వచ్చాడంటే దాని పరమార్ధం తన ఆశ యాలకు నన్నే వారసుడిగా భావిస్తు న్నాడా? ఈ దేశంలో ఆయనలాగా నీతికి, నిజాయితీకి నిలువుటద్దం నేనే కాబట్టి ఈ దేశానికి నా నాయకత్వం అవసరమని ఆయన స్వర్గం నుండే సూచిస్తున్నాడా.. ఇలా చంద్రబాబులో మానసిక సంఘర్షణ మొదలైంది. వాజ్‌పేయిలాగా ముందు ఒకరోజు వుందాం… సులభంగా వుంటే కంటిన్యూ చేద్దామనుకునే నిర్ణయానికి వచ్చాడాయన. మొదట సచివాలయంకు వచ్చిందే తడవుగా తమ స్వార్ధం కోసం పార్టీ మారి విలువలను తుంగలో తొక్కిన ముగ్గురు ఎంపీలపై బహిష్కరణ వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు, 23మంది ఫిరాయింపు వైసిపి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిం చాలని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావుకు ఫిర్యాదు చేశాడు. ఈ లేఖ చూసి సుమిత్రా మహాజన్‌ నోరెళ్ళబెట్టగా, కోడెల శివప్రసాద్‌రావు అయితే స్పృహ తప్పి పడిపోయాడు. చంద్రబాబు తన టేబుల్‌ మీదున్న ‘సాక్షి’ పేపర్‌ తీసుకున్నాడు. అందులో పల్నాడులో యరపతినేని మైనింగ్‌ మాఫియా అనే హెడ్డింగ్‌తో వార్త. దానిని చూడగానే చంద్రబాబుకు చిర్రెత్తు కొచ్చింది. వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయాలంటూ పోలీసుశాఖను ఆదేశించడమేకాక, మైనింగ్‌ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖవ్రాసాడు. ఈ పరిణామంతో తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తసాగాయి. చంద్ర బాబు ఏంటి ఇలా మారిపోయాడంటూ వాపోసాగారు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌పై ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం అంచనా వ్యయం ఎంతని ఇరిగేషన్‌ సెక్రటరీని అడిగాడు. ఏడాది క్రితం 58వేల కోట్లు, ఏడాది గడిచింది కాబట్టి 68వేల కోట్లు అని చెప్పాడు. అది విని చంద్రబాబు ఆవేశంగా… ఒక ప్రాజెక్ట్‌ కట్టడానికి 68వేల కోట్లు… అది ప్రజల డబ్బను కుంటున్నారా? మీ డబ్బనుకుంటున్నారా? 16వేల కోట్లతో ప్రాజెక్ట్‌ ఎలా పూర్తి చేయాలో నేను చేసి చూపిస్తా… వెంటనే అంచనాలను తగ్గించేయండి… వాజ్‌ పేయి వారసుడిక్కడ అని ఆదేశించాడు. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పై సింగపూర్‌ కన్సార్డియం కంపెనీ ప్రతి నిధులు వాంగ్‌చుక్‌, జియాంగ్‌ టెంక్‌లతో చర్చలు జరిగాయి. అసెంబ్లీ నిర్మాణానికి చదరపు అడుగు 15వేలు అవుతుందని వాళ్ళు కొటేషన్‌ ఇచ్చారు. అది చూసి చంద్రబాబు… 15వందలు ఇస్తే మా నారాయణ చింతారెడ్డిపాలెం తాపీ మేస్త్రీల చేత మీరు కట్టేదానికంటే బాగా కట్టిస్తాడు… మేం అవినీతికి పాల్పడం… వాజ్‌పేయి వారసుడిక్కడ అని చెప్పి చంద్రబాబు వారిని పంపించేసాడు. అంతలో చంద్రబాబు ఛాంబర్‌లోకి జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు వచ్చారు. వాళ్ళ ముఖాలలో ఆందోళన… సార్‌, కృష్ణా జిల్లాలో మా ట్రావెల్స్‌ బస్సు యాక్సిడెంట్‌కు గురైందట… డ్రైవర్‌ లైట్‌గా ఓ హాఫ్‌ తాగి నడపడంతో ప్రమాదం జరిగి పదిమంది చనిపోయా రట… కేసు గీసు లేకుండా చూడండి సార్‌ అని జేసీ దివాకర్‌రెడ్డి అడిగాడు. చంద్రబాబు వెంటనే పి.ఏను పిలిచి రవాణాశాఖ కమిషనర్‌కు ఫోన్‌ కొట్ట మన్నాడు. చంద్రబాబు అంతలా రియాక్ట్‌ కావడంతో జేసీ సోదరులు భలే సంబర పడసాగారు. టెన్షన్‌ ఫ్రీ అయ్యారు. అవతల రవాణాశాఖ కమిషనర్‌ బాల సుబ్రహ్మణ్యం ఫోన్‌ ఎత్తగానే పి.ఏ ఫోన్‌ చంద్రబాబుకిచ్చాడు. చంద్రబాబు ఆయ నతో… ఈరోజు కృష్ణా జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు యాక్సిడెంట్‌ జరిగిందా అని అడిగాడు. అవతల నుండి కమిషనర్‌ అవునుసార్‌, దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పాడు. చంద్రబాబు కోపంగా, దర్యాప్తు చేసేదేంటి, డ్రైవర్‌ తాగి బస్సులు నడుపు తుంటే చెక్‌ చేయబల్లేదా… వెంటనే ఆ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులన్నింటిని సీజ్‌ చేయండి… పర్మిట్లు లేని బస్సులకు ఒక్కో దానికి కోటి రూపాయలు పెనాల్టీలు వేయండి… ప్రమాదంలో మృతి చెందిన వారికి, గాయపడ్డ వారికి వీళ్ళ వద్ద నుండే మనిషికి 50లక్షల వంతున వసూలు చేసి ఇప్పించండి… ఆ జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ నా ఛాంబర్‌లోనే వున్నారు. పోలీసులతో వచ్చి అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. చంద్రబాబు మాటలతో జేసీ బ్రదర్స్‌కు నోట మాట రాలేదు. ఇతను నిజంగా చంద్రబాబేనా? లేక చంద్రబాబు రూపంలో వచ్చిన నరేంద్ర మోడీనా? ఏంటీ మనిషి ఇలా మారిపోయాడు అనుకుంటూ దివాకర్‌రెడ్డి ఆవేశంగా నోరు తెరచి… బాబూ ఏం బుద్దయ్యా నీది, కాపాడమని నీ దగ్గరకు వస్తే పోలీసువాళ్ళకు పట్టిస్తానంటావా? నీకంటే ఊసరవెల్లి నయం… వయసు, అనుభవం రాగానే సరికాదు, మంచి మర్యాద వుండాలి. అందుకే నిన్ను అందరూ తిట్టేది. బాబూ డౌన్‌డౌన్‌ బాబూ డౌన్‌డౌన్‌… అంటూ కేకలు వేయ సాగాడు. అలా కేకలు వేస్తుండగానే ముఖాన నీళ్ళు పడేసరికి జేసీ దివాకర్‌రెడ్డి కళ్ళు తెరిచాడు. ఎదురుగా లోకేష్‌ వున్నాడు. అప్పటికే చంద్రబాబు, మిగతా ఎంపీలు, మంత్రులు లేచి కళ్ళు నులుము కుంటున్నారు. అసలు ఇంతకీ ఏమైంది, మనమంతా ఇక్కడ ఎందుకు పడుకున్నాం అని జేసీ అడిగాడు. అదిగో ఆ మహాను భావుడి పుణ్యం అంటూ చంద్రబాబు ఎదురుగా చేయి చూపించాడు. అక్కడ సోఫాలో యోగి వేమన గెటప్‌లో చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కూర్చుని వున్నాడు. ఆయన గెటప్‌ చూసే సెక్యూరిటీ, సిబ్బంది పడిపోయారు. తర్వాత మనం వచ్చి చూసి పడిపోయాం… లోకేష్‌ వచ్చి అందరి ముఖాన నీళ్ళు చల్లబట్టి మెలకువ వచ్చింది. అది సరేగాని, నువ్వెందుకు ‘బాబు డౌన్‌డౌన్‌’ అని కలవరిస్తున్నావ్‌ అని చంద్రబాబు అడిగాడు. దానికి జేసీ… మీరు వాజ్‌పేయిలాగా బ్రతకాలని అన్నారు కదా సార్‌… శివప్రసాద్‌ను చూసి కళ్ళు తిరిగి క్రిందపడిపోయాక నాకు ఈ కల వచ్చింది అంటూ కల మొత్తాన్ని వివరించాడు. తర్వాత జేసీయే వుండి… సార్‌, మీరు ఒకరోజు వాజ్‌ పేయిలాగా వుంటేనే రాష్ట్రంలో ఎందరి బ్రతుకులో తలక్రిందులవుతున్నాయి. ఇక బ్రతికినంత కాలం వాజ్‌పేయిలాగా వుంటే మన పార్టీ వాళ్ళంతా చిప్పలు చేతపట్టుకుని ఢిల్లీ వీధుల్లో భిక్షమెత్తు కోవాలి. వాజ్‌పేయి మనకు సెట్‌ కాడులే సార్‌, మరచిపోండి అని చెప్పాడు. ఆ విషయం నాకూ తెలుసు.. కాకపోతే ఆ మాత్రం బిల్డప్‌ వుండాలిలే అంటూ చంద్రబాబు కూడా లేచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here