Home జిల్లా వార్తలు ఒకవైపు సమున్నత లక్ష్యం.. మరోవైపు ఆర్ధిక సంక్షోభం

ఒకవైపు సమున్నత లక్ష్యం.. మరోవైపు ఆర్ధిక సంక్షోభం

జిల్లాలో తొలి బాలికా పాఠశాల ఏర్పాటుచేసి బాలికలకు విద్యను బోధించాలనే సమున్నత లక్ష్యం..ఆచరణలో రాను రాను అష్టకష్టాల పాలవుతూ వచ్చింది. కస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణంలో బాలికల పాఠశాలను ప్రారంభించి, వారికి హాస్టల్‌ వసతులను లుగజేశామని సంతోషిస్తున్న తరుణంలోనే ముంచుకువచ్చిన ఆర్థిక ఇబ్బందులు వాటి నిర్వహణను మరింత కష్టతరం చేశాయి. విద్యాలయం ప్రారంభం నాటి రోజుల్లో ఉన్న నియమ నిబంధనలను పాతకమిటీ వారు ఎంతో చిత్తశుద్ధితో, దృఢదీక్షతో అమలుచేసినా ఆ తర్వాతి కాలంలో వచ్చిపడిన ఆర్థిక ఇబ్బందులతో విద్యాలయం నిర్వహణ బాగా కష్టతరమైంది. ఈ నేపథ్యంలో విద్యాలయం ప్రాంగణంలో ఉన్న ఖాళీస్థలాలను లీజుకు కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను కమిటీ అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే, లీజు వ్యవహరాలతో వచ్చిన పేచీలతో కమిటీకి మరిన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత కాలక్రమేణా విద్యాలయానికి అన్నివిధాల అండదండలందిస్తున్నవారు కారణాంతరాల వల్ల ఒకరొకరుగా రాజీనామాలు చేయడం వల్ల నిర్వహణ మరింత కష్టమైంది. రాజీనామాలు చేసిన వారి స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకోవడం కూడా ఒక కసరత్తుగా మారింది. ఏదేమైనా అనుకున్న లక్ష్యసాధనకు వెనుకంజ వేయక ధీరత్వంతోనే కమిటీ అన్నివేళలా అందరితోనూ సమిష్టిగా చర్చించి విద్యాలయం అభివృద్ధికి తగు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కస్తూరిదేవి విద్యాలయం పుట్టుపూర్వోత్తరాలను, ఆ విద్యాలయం ప్రగతి తీరును పరిశీలిస్తే విద్యాలయం అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్న కమిటీ ఎన్ని అవరోధాలను ఎదుర్కొంటూ ఎంత నిబ్బరంగా ముందుకు సాగుతూ వచ్చిందో మనకు అవగతమవుతుంది.

విద్యాలయం నిర్వహణకు, హాస్టల్‌లో బాలికలకు తగు వసతులు కల్పించేందుకు ఆనాడు తమ ముందుకు వచ్చిన అన్ని ఆలోచనలను నాటి కమిటీ కూలంకుషంగా పరిశీలించింది. అప్పట్లో బర్మాషెల్‌ లీజుకు సంబంధించిన విషయాలను శ్రీ కెవి సుబ్బారెడ్డి గారితో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత ఆ విషయమై తగు నిర్ణయం తీసుకోవాలని 4-3 -1980లో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణ యించారు. ఆ తర్వాత, కస్తూరి దేవి విద్యాలయా నికి చెందిన ఒక ఎకరా స్థలాన్ని సినిమా థియేటర్ల కాంప్లెక్స్‌ నిర్మాణా నికి 99ఏళ్ళ పాటు లీజుకు కోరుతూ గునుపాటి శ్రీధర్‌ రెడ్డి నుంచి వచ్చిన ప్రతిపాదన 1980 ఆగస్టు 12వ తేది జరిగిన కమిటీ సమావేశంలో చర్చకు రాగా, కమిటీ ఈ విషయమై వివరంగా చర్చించి, ఆ మేరకు ఆ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు కమిటీ అంగీక రించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డిగారితో పాటు, ఏ.ఆదిశేషారెడ్డి, పివి రమణారెడ్డి, శ్రీమతి ఏ.అన్నపూర్ణమ్మ, సికె

శుభప్రద, వై.వెంకటేశ్వర్లు, ఎన్‌.శ్రీరామమూర్తి గార్లు పాల్గొన్నారు. ఈ లీజుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ తర్వాత జరిగే సమావేశంలో చర్చిం చాలని నిర్ణయించుకున్నారు.

అదేవిధంగా, విద్యాలయం ప్రాంగణంలో ఉన్న మరికొంత ఖాళీస్థలాన్ని కూడా లీజుకు కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను కూడా 1980 డిశెంబరు 7న జరిగిన కమిటీ సమావేశంలో చర్చించి దానిని రెండు లీజు డీడ్‌లుగా విభజించి వాటికి ఆమోదం తెలిపారు. (అయితే, సినిమాహాళ్ళ లీజు వ్యవహారాలే కమిటీకి పేచీలు తెచ్చి పెట్టాయి. విద్యాలయం స్థలంలో సినిమా హాళ్ళ నిర్మాణం జరిగితే విద్యాల యానికి ఇబ్బంది కలుగుతుందనే విమర్శలు అప్పట్లో పెద్దఎత్తున పెల్లుబు కాయి). కాగా, తొలుత నిర్ణయించుకున్న మేరకు లీజుదార్లయిన జి.శ్రీధర్‌రెడ్డి, ఎం.రమేష్‌రెడ్డి 649 అంకణాల స్థలానికి సంబంధించి అద్దెమొత్తం 32,500 రూపాయలను, మరో 164 అంకణాల స్థలం లీజుకు సంబంధించిన లీజుదారుడు 8250 రూపాయలు, 271 అంకణాల స్థలం లీజుకు సంబంధించిన ఇంకొక లీజుదారుడు 13,500 రూపాయల వంతున ఏడాదికి అద్దె మొత్తా లను చెల్లించే విధంగా 16-12-1980న జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయించింది.

విద్యాలయం ప్రాంగణంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు కమిటీ సంకల్పం…

కస్తూరిదేవి విద్యాలయంలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన పేదబాలికలు కళాశాల విద్య కోసం మరో విద్యాలయానికి వెళ్ళాలంటే కష్టసాధ్యంగా ఉన్న ఆ రోజుల్లో ఆ ఇబ్బందులను కూడా కమిటీ దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా లయం ప్రాంగణంలోనే జూనియర్‌ కళాశాలను కూడా ఏర్పాటుచేస్తే బావుంటుందనే ఆలో చనకు వచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు తయారుచేసింది. కస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణంలో బాలికల జూనియర్‌ కళాశాలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని, అందుకు ఇంటర్‌మీడియట్‌ బోర్డు వారితో కూడా సంప్రదించాలని కమిటీ ఈ సమావేశంలో నిర్ణయించింది.

విద్యాలయం ప్రాంగణంలోనే జూనియర్‌ కళాశాలను కూడా ఏర్పాటుచేస్తే విద్యార్థినులకు కళాశాల విద్యకు లోటు లేకుండా ఉంటుందని అందరూ భావించి, ఆ మేరకు కళాశాల ఏర్పాటు విషయంపై తమ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆమేరకు వాటిని ప్రభుత్వానికి కూడా వివరిస్తూ, విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది.

16-12-1980న జరిగిన ఈ కమిటీ సమా వేశంలో శ్రీయుతులు డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి గారితో పాటు, ఎం.గోపాలకృష్ణారెడ్డి, ఎం.ఆదిశేషా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, సికె శుభప్రద, పి.సావిత్రిదేవి గార్లు పాల్గొన్నారు.

ఎలిమెంటరీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఏర్పాటుకు ఆలోచనలు…

ఇదిలావుంటే, ఈ విద్యాలయానికి ఎంతోకాలం నుంచి విశిష్టమైన సేవలందిస్తున్న అన్నపూర్ణమ్మగారు కారణాంతరాల వల్ల కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పంపగా, కమిటీ ఆమె రాజీనామాను ఆమోదించింది. ఆమె ఇంతకాలంగా విద్యాలయానికి చేసిన సేవలను కమిటీ కొనియా డింది. ఆ తర్వాత కొద్ది రోజులకు విద్యాలయం కమి టీకి గత కొంత కాలంగా సభ్యు నిగా సేవలందిస్తున్న శ్రీ పివి రమణారెడ్డిగారు కూడా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ 6-7-1981న లేఖను పంపారు. 11.11.1981లో జరిగిన సమా వేశంలో ఈ విషయం చర్చించి వారి రాజీనామాను కూడా కమిటీ అమోదించింది. ఇంతకాలంగా ఆయన విద్యాలయానికి చేసిన సేవలను ప్రస్తుతించింది.

రాజీనామాలతో ఖాళీ అయిన సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించి విద్యాలయం పాలనను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ ఆలోచనలు చేస్తూనే, మరోవైపు కస్తూరిదేవి బాలికల హైస్కూలుకు అనుబంధంగా ఎలిమెంటరీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ను నెలకొల్పాలనే ఆలోచన కూడా చేసింది. ఆమేరకు కమిటీ ప్రతిపాదనలు చేస్తూ ఈ సమా వేశంలో తీర్మానిం చింది.

ఎన్ని కష్టాలు ఎదురైనా.. వాట న్నింటికి ఎదురీదైనా సరే.. అనుకున్న లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా కమిటీ ముందుకు సాగింది.

ఆ తర్వాత కొద్దికాలానికి విద్యాలయం కమిటీ సభ్యునిగా ఉన్న శ్రీ ఎన్‌.శ్రీరామమూర్తిగారు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పంపిన లేఖను 4-7-1985న సమావేశంలో చర్చించి, వారి రాజీనామా ఉపసంహరణను కమిటీ కోరింది.

లీజు వ్యవహారానికి వ్యతిరేకంగా ఉద్యమం…

ఇదిలావుంటే, ఓ వైపు డికెడబ్ల్యు మహిళా కళాశాల, మరోవైపు కస్తూరిదేవి బాలికల పాఠశాల ఉన్న ప్రాంతంలో ఈ రెండింటికీ నడుమ సినిమాహాళ్ళ నిర్మాణం మంచిది కాదనే ఆలోచన చేసి అప్పట్లో శ్రీయుతులు గునుపాటి హరిశ్చంద్రారెడ్డి, జేకె రెడ్డి, ఆదాల రాఘవరెడ్డి, పుచ్చలపల్లి బాలకృష్ణారెడ్డి (ఇంగ్లీష్‌), తుంగా రాజగోపాలరెడ్డి గార్ల సారధ్యంలో ఓ కమిటీ ఏర్పడి సినిమాహాళ్ళ నిర్మాణాన్ని ఆపాలంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

నెల్లూరు శ్రీరామమూర్తి కమిటీ సభ్యుడిగా ఉండడం, ఆ తరుణంలోనే వచ్చిన లీజు ప్రతిపాదనను కమిటీలో తానూ ఓ సభ్యుడిగా ఆమోదించడంతో అప్పట్లో లీజుదారులకు మద్దతు పలుకుతూ తన జమీన్‌రైతు పత్రికను ఆయన వేదిక చేశాడు. ఈ సమయంలోనే అక్కడ సినిమాహాళ్ళ నిర్మాణం చేపట్టడం మంచిది కాదంటూ, ఈ విద్యాలయం ప్రాంగణంలో సినిమాహాళ్ళ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమంలోంచి పురుడుపోసుకున్నదే.. ‘లాయర్‌’ వారపత్రిక.

1981 జూన్‌ 5వ తేది నుండి ఉద్యమస్ఫూర్తితో ప్రారంభమై కస్తూరిదేవి లీజు వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం నడిపింది..’లాయర్‌’ వారపత్రిక. కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డిగారి సారథ్యంలో ప్రారంభమైన ‘లాయర్‌’ పత్రికలో వచ్చిన వ్యాసాల ఆధారంగా అప్పట్లో కోర్టులలో వ్యాజ్యాలు వేయడంతో పాటు, అసెంబ్లీలో సైతం ఈ అంశాన్ని చర్చకు వచ్చేలా ఉద్యమకారులు చర్యలు చేపట్టారు. ఆ తరువాత కాలంలో 10 సంవత్సరాల పాటు నడిచిన వ్యాజ్యంలో అంతిమ విజయం లీజుదారులదే కావడంతోపాటు, కోర్టులో వ్యాజ్యం నడిచిన ఈ పదేళ్ళ కాలం కూడా వారికి లీజు పొడిగించాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

కానీ, సినిమాహాళ్ళ నిర్మాణం వివాదాస్పదం కావడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రారంభదశలోనే హాళ్ళ నిర్మాణాన్ని లీజుదారులు నిలిపివేశారు. ఇది నెల్లూరు ప్రజల నైతిక విజయంగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నెల్లూరీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here