Home రాష్ట్రీయ వార్తలు ఎవర్ని ముంచుతారో?

ఎవర్ని ముంచుతారో?

రాష్ట్ర రాజకీయాలలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి విషయాలలో క్లారిటీ వుంది. 2014లోనే కాదు వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు ఎలాగూ ఓట్లేయరు, కాబట్టి అవి డమ్మీలే! ఇవి పోటీలో వున్నా వచ్చేది నామమాత్రపు ఓట్లే!

అదికాకుండా ఇప్పుడు జనాలకు అర్ధం కాని పజిల్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో తిరుగుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన జెండా పట్టుకుని ప్రత్యక్షంగానే రాజకీయ యాత్రలు చేస్తున్నాడు. లక్ష్మీనారాయణే ఇంకా ఏ జెండా పట్టుకోలేదు. అతని అజెండా ఏంటో కూడా తెలియడం లేదు. కాని వచ్చే ఎన్నికల్లో బీజేపీకో లేదా టీడీపీకో పనిచేసే అవకాశముంది. లేదంటే పవన్‌కు తోడుగా జతకావచ్చు కూడా! గత ఎన్నికలకు రేపటి ఎన్నికలకు తేడా ఇదే! 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి పడ్డ బీజేపీ ఓట్లను ఈసారి ఆ పార్టీ చీల్చుకోవచ్చు. ఈ రూపంలో నష్టం ఎంతుండొచ్చో అప్పుడే చెప్పలేం. మరి లక్ష్మీనారాయణ, పవన్‌కళ్యాణ్‌లు ఎవరిని ముంచడానికి సిద్ధంగా వున్నారో తేలాల్సివుంది. లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరినా, ఏ పార్టీకి ప్రచారం చేసినా వైసిపికి వచ్చే నష్టం ఏమీ లేదు. జగన్‌ వ్యతిరేకులే లక్ష్మీనారాయణ అభిమానులవుతారు. ఆయన ఇంకా జనసేనకో, బీజేపీకో మద్దతునిస్తే ఎంతో కొంత తెలుగుదేశంకే నష్టం. 2014లో పవన్‌కళ్యాణ్‌ ఓటు తెలుగుదేశానికే పడింది. కాబట్టే ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం భారీగా సీట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన సొంతంగానే పోటీ చేయబోతోంది. మరి పవన్‌కళ్యాణ్‌ ఓట్లు తెలుగుదేశం, జనసేనల మధ్య చీలితే ఎవరికి నష్టం? పవన్‌ వల్ల జగన్‌కు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్‌ టీడీపీకే మద్దతు నిస్తే వైసిపికి నష్టం. పవన్‌ విడిగా పోటీ చేస్తే వైసిపికి కొంత లాభం. అసలు వైసిపికే మద్దతునిస్తే తెలుగుదేశాన్ని సులభంగా పడగొట్టొచ్చు. మొత్తంమ్మీద వీళ్ళిద్దరి వల్ల ఎవరికి మూడనుందో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here