Home రాష్ట్రీయ వార్తలు ఎవరో కింగ్‌?

ఎవరో కింగ్‌?

దేశ వ్యాప్తంగా ఎన్నికల యుద్ధభేరీలు మోగాయి. పార్టీల అధినేతలు సర్వసైన్యాధ్యక్షులై తమ సేనలను ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికల సమరాంగణంలో అధికారమో,

ప్రతిపక్షమో తేలిపోతుంది. దేశానికి, ఆయా రాష్ట్రాలకు ఐదేళ్ళ పాటు రాజులెవరో, రాళ్ళేసేవాళ్లెవరో బయటపడుతుంది.

భారతదేశ పార్లమెంట్‌ వ్యవస్థకు కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశలలో ఎన్నికలు నిర్ణయించగా, మొదటి దశలోనే ఏపిలో ఎన్నికలొచ్చాయి. ఏప్రిల్‌ 11వ తేదీన ఏపిలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే23వ తేదీన కౌంటింగ్‌… అంటే ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌ నాయకులు, ప్రజలు 42రోజుల పాటు వేచిచూడాలి!

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య నువ్వా – నేనా అన్నట్లుగా వుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఈ రెండు పార్టీలకు కూడా ఫైనల్‌ మ్యాచ్‌ లాంటివే! ఈ ఎన్నికలలో ఏ పార్టీ ఓడిపోయినా ఇక సీన్‌లో ఉండకపోవచ్చు. తెలుగుదేశం అన్నది నిలబడాలంటే మళ్ళీ గెలవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. ఆయన తన రాజకీయ వారసుడిగా లోకేష్‌ను ప్రమోట్‌ చేయడానికి ఈ ఎన్నికలలో గెలవాలి. ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అంటూ జరిగితే అది లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చంద్రబాబుకు వయసు పైనపడుతుంది. లోకేష్‌కు సొంతంగా పార్టీని నడిపించేంత శక్తి సామర్ధ్యాలు లేవు. చంద్రబాబు సీన్‌లో వున్నప్పుడే లోకేష్‌కు పట్టాభిషేకం జరిగిపోవాలి. తాను యాక్టివ్‌గా వున్నప్పుడే లోకేష్‌ చేతుల్లో పార్టీని పెడితే, తర్వాతకాలంలో ఆయన తంటాలు ఆయన పడి పార్టీని లాక్కొస్తాడని బాబు ధీమా! లోకేష్‌ కోసమే చంద్రబాబు ఈ ఎన్నికలు గెలవాలి. అంతేకాదు, కేంద్రంలో తాను చక్రం తిప్పడానికి కూడా చంద్రబాబుకు ఇక్కడ గెలుపు అవసరం. తెలుగుదేశం ఇప్పుడు ఓడిపోయి జగన్‌ సీఎం అవడం జరిగితే మరో పదేళ్ళ దాకా ఆ పార్టీ అధికారం మీద ఆశలు వదులుకోవాలి. అప్పటికి చంద్రబాబుకు 80ఏళ్ళు వస్తాయి. ఆ వయసులో ఇక ఆయన రాజకీయ వ్యూహాలు కూడా పని చేయక పోవచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు తెలుగుదేశం కంటే, చంద్రబాబు కంటే లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌కు ఎంతో కీలకం కానున్నాయి.

మరి వైసిపి అధినేత జగన్‌కు కూడా ఇది ఫైనల్‌ మ్యాచే! ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఆయనకు మనుగడ. ఓడిపోతే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో పార్టీని లాక్కురావడం కష్టమే! జగన్‌లో పట్టుదల వుంది కాబట్టే తాను కష్టపడి వైసిపిని పటిష్టంగా నిలబెట్టాడు. పార్టీ కేడర్‌లో గెలుపుపై ఆశలు నిలబెట్టాడు. ఈ ఎన్నికల్లో వైసిపి గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన ప్రాంతీయ శక్తిగా అవతరిస్తుంది. ఓడిపోతే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ ఇక ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

మొదటి దశతో ఎవరికి మహర్దశ?

ఏపిలో మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతాయని ఎవరూ వూహించలేదు. మహా అంటే ఏప్రిల్‌ నెలాఖరులో వుంటాయని భావించారు. కాని ఏప్రిల్‌ 11నే పెట్టేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేసి డిక్లేర్‌ కావడానికి, ఎన్నికల ప్రచారానికి మధ్య 10రోజులే వుంది. ఈ పదిరోజులు చాలా తక్కువ గడువు. ఇంత తక్కువ వ్యవధి రావడం ప్రతిపక్ష వైకాపాకు అడ్వాంటేజ్‌ కాగా, తెలుగు దేశానికి మాత్రం ఇంత తొందరగా ఎన్నికలు పెట్టడం మింగుడు పడడం లేదు. ఎక్కువ గడువు వుండుంటే చంద్రబాబుకు అన్ని రకాల వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి అవకాశముండేది.

మారిన సీన్‌…

కొన్ని నెలలు క్రితం చూస్తే రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజక వర్గాలలో వైసిపికి సరైన అభ్యర్థులు కనిపించలేదు. టిడిపి తరపున బలమైన అభ్యర్థులు కనిపించారు. కాని, గత నెలరోజుల్లోనే సీన్‌మారింది. టిడిపి నుండి పలు లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడగా, వైసిపి నుండి మాత్రం లోక్‌సభకు అన్నిచోట్లా గట్టి అభ్యర్థులే సెట్‌ అయ్యారు. లోక్‌సభ అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి కూడా ఆయా అసెంబ్లీల అభ్యర్థుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

ముంచిన జిల్లాలే మంచి చేస్తాయా?

2014 ఎన్నికల్లో వైసిపిని ముంచింది గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు వున్న ఏడు జిల్లాలే! ఈ జిల్లాల్లో బలంగా వున్న కాపులు ఆనాడు పవన్‌కళ్యాణ్‌ ప్రభావంతో టిడిపికి మద్దతు పలికారు. దానివల్లనే ఈ జిల్లాల్లో వైసిపికి పెద్దగా సీట్లు రాలేదు. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుజిల్లాల్లో మాత్రమే వైసిపి పైచేయి సాధించగలిగింది. కాని, ఈసారి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తెలుగుదేశంకు గతంలో వచ్చినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడు జిల్లాల్లో టిడిపి సీట్లకు భారీగానే కోత పడబోతుంది. అయితే కోతపడే సీట్లలో వైసిపి ఎన్ని గెలుచు కుంటుంది, జనసేన ఎన్ని చీల్చుకుంటుందన్నది చూడాలి. రాయల సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసిపి హవా ఏ మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. ఈ ఆరు జిల్లాల్లో గణనీయంగా సీట్లు పెంచుకుని ఉత్తరం వైపు జిల్లాల్లో పడే లోటును పూడ్చుకోవా లన్నది చంద్రబాబు ఆలోచన. కాని, ఈ ఆరుజిల్లాల్లో తెలుగు దేశంకు ఏమంత అనుకూల వాతావరణం లేదు.

రాష్ట్రంలో ఎండలతో పాటు ఎన్నికలు కూడా వేడెక్కాయి. పోటీలో జనసేన ఉండేటప్పటికీ అధికారం కోసం యుద్ధం మాత్రం టిడిపి – వైసిపిల మధ్యే వుండబోతుంది. మరి 40ఏళ్ల చంద్రబాబు అనుభవం గెలుస్తుందా? 47ఏళ్ల యువనాయకుడి పోరాటాన్ని ప్రజలు ఆదరిస్తారా అన్నది చూద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here