Home సంపాదకీయం ఎవరి దేశభక్తి ఎంత?

ఎవరి దేశభక్తి ఎంత?

గత మూడు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాలలో తరచుగా వినిపిస్తున్న పదం ‘దేశభక్తి’. దేశ రాజకీయాలలో భారతీయ జనతాపార్టీ ఎదుగుదల మొదలైనప్పటి నుండీ ఈ పదానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగేకొద్ది కాంగ్రెస్‌ బలహీనపడుతూ వచ్చింది. దీనిని బట్టి అర్ధమయ్యేదేంటంటే కాంగ్రెస్‌కు దేశభక్తి తక్కువని!? బీజేపీ దేశభక్తి అంశానికి ఎక్కువుగా ప్రాచుర్యం కల్పిస్తోందని!

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత రాజకీయాలలో కాంగ్రెస్‌ గెలిచింది, ఓడింది. కాని ప్రజలెప్పుడూ కాంగ్రెస్‌ను విలన్‌గా చూడలేదు సరికదా, దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి నేతృత్వం వహించిన పార్టీగా కాంగ్రెస్‌ను చూశారు. ఆ బ్రాండ్‌ ఇమేజ్‌ వల్లే దాదాపు 60ఏళ్ల పాటు ఆ పార్టీ దేశాన్ని ఏలగలిగింది.

కొద్దికాలంగా దేశ ప్రజలలో ఆ పార్టీ ఇమేజ్‌ మసకబారుతూ వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇంతకాలం కాంగ్రెస్‌ నాయకత్వం ముసుగేసి కప్పిపెట్టిన చరిత్రను బీజేపీ నాయకులు ముసుగుతీసి ప్రజలకు చూపిస్తుండడమే! స్వాతంత్య్ర పోరాట సమయంలో సుభాష్‌చంద్రబోస్‌ను యుద్ధఖైదీగా అప్పగిస్తామంటూ గాంధీ, నెహ్రూలు బ్రిటీష్‌ వారితో చేసుకున్న ఒప్పందం, మత ప్రాతిపదిక విభజనకు గాంధీ అంగీకరించడం, తొలిప్రధానిగా సర్ధార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ను కాదని నెహ్రూను చేయడం, చైనా యుద్ధంలో నెహ్రూ చేతకానితనం వల్ల మానస సరోవర్‌ ప్రాంతాన్ని కోల్పోవడం, భారత్‌లో సంపూర్ణంగా విలీనం కావాల్సిన జమ్మూ కాశ్మీర్‌ను రావణకాష్టం చేసి పెట్టడం… తన స్వార్ధం కోసం నెహ్రూ ఇలా ఎన్నో చారిత్రక సత్యాలను మరుగున పడేసారు. దేశాన్ని కాంగ్రెస్‌ పరిపాలించినంత కాలం ఈ అంశాలు వెలుగులోకి రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూపొందించిన చరిత్ర పాఠాలనే చదువుకున్నాం… దురాక్రమణదారులను హీరోలుగా చిత్రించి వారిని ఆదర్శపురుషులుగా చూపితే, నిజమేననుకున్నాం…

కానీ ఈ దేశ రాజకీయాలలో బీజేపీ వేళ్లూనుకునే కొద్దీ… పాతిపెట్టిన చారిత్రక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు రాసాగాయి. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గాంధీ, నెహ్రూలకే పరిమితం చేసి వుండగా, ఇప్పుడు సుభాష్‌చంద్రబోస్‌, భగత్‌సింగ్‌ వంటి త్యాగధనులను గుర్తుంచుకునేలా, వారి త్యాగాలకు గుర్తింపు లభించేలా బీజేపీ బాటలు వేసింది. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సే అని నమ్మేవాళ్ళు క్రమక్రమంగా తగ్గుతుండబట్టే ఆ పార్టీ దేశ వ్యాప్తంగా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఓట్ల బ్యాంకుల కోసం దేశ భద్రతను సైతం పణంగా పెట్టడంలో కాంగ్రెస్‌ ఏరోజూ వెనుకాడలేదు. దేశ భద్రతను రాజకీయం చేయడానికి సైతం ఆ పార్టీ సంకోచించడం లేదు. ఆ పార్టీలో ఇప్పటికీ భారత్‌ కంటే పాకిస్థాన్‌ను ప్రేమించేవాళ్ళున్నారనే విషయం అప్పుడప్పుడూ ఆ పార్టీ నాయకుల స్టేట్‌మెంట్ల ద్వారానే అర్ధమవుతుంది.

దేశ భద్రతాంశాలను వీధుల్లో పెట్టి రాజకీయం చేయడం, దానిద్వారా ఓట్ల లబ్ది పొందాలనుకోవడం కాంగ్రెస్‌ సహజ లక్షణం. ‘రాఫెల్‌’ రాద్ధాంతం కూడా ఇలాంటిదే! భారత్‌ – ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పెద్ద రాద్ధాంతమే చేశాడు. ఇక్కడ లక్షకోట్ల అవినీతే జరిగిందనుకుందాం… మరి ఆ డబ్బు తినేది ఎవరు? మొదటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ… నీతి నిజాయితీల విషయంలో ఆయన ముందు రాహుల్‌ దిగదుడుపే! మరి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తిన్నారా…? దేశం కోసం తప్పితే దేహం కోసం పనిచేసే నాయకురాలు కాదు. రక్షణ కొనుగోళ్లలోనూ కమిషన్ల వ్యాపారం చేసే అలవాటు కాంగ్రెస్‌ నాయకులకే వుందన్న సత్యం గతంలో ఎన్నో సంఘటనలలో ఋజువైంది. ఇప్పుడు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కాంగ్రెస్‌ అధినేతల చుట్టూ చక్కర్లు కొడుతుండడం చూస్తూనేవున్నాం.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందమని, దీనిని బయట పెట్టడం కుదరదని కేంద్రం గతంలో ప్రకటించడం తెలిసిందే! రహస్య ఒప్పందం అంటే అందులో ఏదో మతలబు వుందని, వేలకోట్ల అవినీతి దాగుందని కాంగ్రెస్‌ అనుమానించింది. వాళ్ళకు అలాంటివి అలవాటు కాబట్టి అనుమానాలు రావడం సహజమే! కాని, ఇక్కడ ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందం అన్నది ఒక బిజినెస్‌ టెక్నిక్‌! దీనిని చిన్న ఉదాహరణతో పోల్చి చూద్దాం. వెంకటరావు అనే వ్యక్తి హైదరాబాద్‌ సిటీలో ఒక లే అవుట్‌ వేశాడు. చదరపు గజం ధర 10వేలుగా నిర్ణయించి అందరికీ అమ్ముతున్నాడు. అతని మిత్రుడు సుబ్బారావు వచ్చి తనకీ ఒక స్థలం కావాలని అడిగాడు. వెంకట్రావు స్నేహ ధర్మంతో అతనికి తనకు పడ్డరేటు అంటే చదరపు అడుగు 7వేలకే ఇచ్చాడు. అయితే ఆ రేటును బయట మార్కెట్‌లో చెప్పొద్దని, అలా చెబితే మిగతావాళ్ళు కూడా అదే రేటుకు డిమాండ్‌ చేస్తారని, తన వ్యాపారం దెబ్బ తింటుందని చెబుతాడు. ఈ రేటు ఎవరికీ చెప్పనులే అని సుబ్బారావు వాగ్ధానం చేసి వస్తాడు. అక్కడనుండి సుబ్బారావు వచ్చేసి నేను వెంకట్రావ్‌ వద్ద 7వేలకే చదరపు గజం కొన్నానని చెప్పాడనుకోండి.. అది మిత్ర ద్రోహమే కదా! ఫ్రాన్స్‌తో భారత్‌ రాఫెల్‌ ఒప్పందం కూడా అలాంటిదే! మిగతా దేశాలకు అమ్మే ధరకంటే కూడా ఫ్రాన్స్‌ మనకు తక్కువ ధరకే రాఫెల్‌ యుద్ధ విమానాలను అమ్మింది. అంతేకాదు, దానికి సంబం ధించిన టెక్నాలజీని సైతం బదలాయించడానికి అంగీకరించింది. దీనిద్వారా భవిష్యత్‌లో మనం రాఫెల్‌ విమానాలను తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడమే కాదు, ఇక్కడ పెట్టే సంబంధిత పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలం.

రాఫెల్‌ ఒప్పందంలో పెద్ద స్కాం వుందంటూ కాంగ్రెసోళ్లు సుప్రీంకోర్టుకు పోయారు. కోర్టుకు పోకుండా వున్నా వచ్చే ఎన్నికల దాకా కూడా మోడీ లక్ష కోట్ల స్కాం చేసాడంటూ వీళ్ళకు అరిచేదానికి అవకాశముండేది. కోర్టుకు పోవడమే వీళ్ల పొరపాటయ్యింది. రాఫెల్‌ ఒప్పందంలో తమకేమీ అవకతవకలు జరిగినట్లు కనిపించడం లేదని సుప్రీం కోర్టు ఈడ్చి తన్నినట్లు చెప్పడంతో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నిద్రపోతున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్లయ్యింది. ఈ విషయంలో వీళ్ళంతట వీళ్లే నరేంద్ర మోడీకి క్లీన్‌ చిట్‌ ఇప్పించారు.

దేశభక్తి అనే అంశంలో బీజేపీ ఎప్పటికప్పుడు తన ర్యాంకును మెరుగు పరుచుకుంటుంటే, దేశ భద్రతను పణంగా పెడతారనే ప్రచారంలో కాంగ్రెస్‌ ముందంజ వేస్తూనే వుంది. దేశ రక్షణ, జాతీయ భావాల విషయంలో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా ఎంతో మార్చుకోవాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here